
- ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్టను మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. యాదగిరిగుట్టలో రూ.3.20 కోట్లతో నూతన మున్సిపల్ భవన నిర్మాణానికి గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. పట్టణాన్ని ఆగం చేసిందని ఆరోపించారు.
ఆగమైన యాదగిరిగుట్ట పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇందులో భాగంగానే రోడ్లు, తాగునీటి సౌకర్యం, అండర్ డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. స్థానిక పట్టణ ప్రజలతోపాటు నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.
మిషన్ భగీరథ పెండింగ్ పనులను రూ.200 కోట్లతో పూర్తి చేసి తాగునీటి కష్టాలను పూర్తిగా తొలగించామన్నారు. దాదాపుగా రూ.600 కోట్లతో గంధమల్ల రిజర్వాయర్ పనులు పూర్తి చేసి రైతుల సాగునీటి కష్టాలను శాశ్వతంగా పారద్రోలుతామన్నారు. ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సుధాహేమేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, వర్తక సంఘం అధ్యక్షుడు మాధవులు గౌడ్, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు భిక్షపతి, తహసీల్దార్ గణేశ్ నాయక్, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.