ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం భక్తులు ఆలయాలకు పోటెత్తారు. గోవిందా నామస్మరణలతో వైష్ణవ ఆలయాలు మారుమోగాయి. సంగారెడ్డి శివారులోని శ్రీ గోదా లక్ష్మీ సమేత విరాట్ వేంకటేశ్వర స్వామి దేవాలయం, సదాశివపేట మండలం వెంకటాపూర్, కొండాపూర్‌‌‌‌లలోని వేంకటేశ్వర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠపురంలో బ్రహ్మ ముహూర్తంలో గరుడ వాహనంపై స్వామివారిని మాఢవీధుల్లో ఊరేగించారు. మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ దంపతులు, తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రభాకర్, ఎస్పీ రమణ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. 

మెదక్​లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పూజలు 

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మెదక్​ జిల్లాలోని దేవాలయాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వార దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మెదక్​ పట్టణంలోని కోదండ రామాలయంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌‌‌‌రెడ్డి,  ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి, మెదక్​జడ్పీ వైస్​ చైర్‌‌‌‌పర్సన్​ లావణ్య, మున్సిపల్​ చైర్మన్​ చంద్రపాల్​, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పల్లకీ సేవలో పాల్గొన్నారు. నారాయణఖేడ్‌‌లోని చారిత్రక రామాలయంలో ఎమ్మెల్యే భూపాల్‌‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప ప్రత్యేక పూజలు చేశారు. చేర్యాల, నాగపురి గ్రామాల్లోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. సుమారు 4 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల క్యూ కిలోమీటర్​ దూరం వరకు ఉంది. 

సిద్దిపేట జిల్లాలోని పలు  వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు  తరలివచ్చారు. సిద్దిపేట పట్టణంలోని కొత్త వేంకటేశ్వరాలయంలో దాదాపు 50 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. సిద్దిపేటలోని పాత వేంకటేశ్వరాలయం, పుల్లూరు శ్రీలక్ష్మినరసింహస్వామి, దుబ్బాకలోని బాలాజీ టెంపుల్, హుస్నాబాద్‌‌లోని సీతారామాలయం, గజ్వేల్​కోదండ రామాలయం, వర్గల్ సరస్వతీ ఆలయం, నాచారం లక్ష్మి నరసింహ్మ స్వామి ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా భక్తులు దర్శనాలు చేసుకున్నారు.  పాపన్నపేట మండలం మల్లంపేట రామాయలంలో రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి భక్తులకు ప్రవచనాలు వినిపించారు. అక్కడి నుంచి ఏడుపాయలకు చేరుకొని వనదుర్గ భవానీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పాలక మండలి,ఆలయ అధికారులు ఆయనకు  పూర్ణకుంభంతో 
స్వాగతం పలికారు. 

న్యాయం ముందు అందరూ సమానమే హైకోర్టు చీఫ్​ జస్టిస్​ ఉజ్జల్​ భుయాన్​

మెదక్​ టౌన్​ :  న్యాయం ముందు అందరూ సమానులేనని, పేదలకు ఉచిత న్యాయ సేవలు అందించడమే జాతీయ లీగల్​సర్వీసెస్​అథారిటీ ధ్యేయమని  హైకోర్టు చీఫ్​జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భుయాన్‌‌ అన్నారు. సోమవారం వర్చువల్‌‌ విధానంలో జిల్లా న్యాయ సేవాసంస్థల సేవలను చీఫ్​జస్టిస్​ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ  ద్వారా   25 ఏండ్లుగా రాష్ట్ర,  జిల్లా, మండల స్థాయిలో పేదలకు ఉచిత న్యాయ సేవలు  అందిస్తున్నామని పేర్కొన్నారు. మెదక్​ జిల్లా ప్రిన్సిపాల్‌‌ సెషన్స్‌‌ జడ్జి లక్ష్మీశారద  మాట్లాడుతూ న్యాయ సేవా సంస్థ ద్వారా లోక్‌‌ అదాలత్‌‌లు నిర్వహించి రూ.3 లక్షలలోపు ఆదాయం గల వారికి ఉచిత సేవలందించేందుకు అడ్వకేట్‌‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం కోర్టు  సముదాయంలో జిల్లా న్యాయ సేవ సంస్థ భవనంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తో కలిసి  పూజ నిర్వహించారు. కార్యక్రమంలో సెక్రటరీ కమ్​ -సీనియర్ సివిల్ జడ్జి జితేందర్, ఫస్ట్​క్లాస్​జుడిషియల్​ మెజిస్ట్రేట్ ప్రిన్సిపాల్, జూనియర్ సివిల్ జడ్జి రీటా లాల్ చంద్​,  జూనియర్ సివిల్ జడ్జి కల్పన, మెదక్​ డీఎస్పీ సైదులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాలయ్య, పీపీ ఫజల్ ​అహ్మద్​ పాల్గొన్నారు. 

ప్రజాస్వామ్యాన్ని  ఖూనీ చేస్తున్నారు.. కాంగ్రెస్​ లీడర్ల ముందస్తు అరెస్ట్‌‌‌‌‌లు

పటాన్​చెరు : అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా.. అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్​నాయకులు ఫైర్​అయ్యారు. సోమవారం సర్పంచుల సమస్యలపై హైదరాబాద్‌‌లో నిర్వహించ తలపెట్టిన దీక్షకు వెళుతున్న కాంగ్రెస్​శ్రేణులను పోలీసులు ముందస్తు అరెస్ట్​చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అరెస్ట్‌‌ను నిరసిస్తూ పటాన్‌‌చెరు అంబేడ్కర్​ సర్కిల్​వద్ద రాస్తారోకో చేశారు.  నర్సాపూర్, హత్నూర మండలాల్లో కాంగ్రెస్​ లీడర్లను ముందస్తు అరెస్ట్​ చేశారు.  చేర్యాలలో హైదరాబాద్‌‌కు బయలుదేరిన కాంగ్రెస్​లీడర్లను ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌‌కు తరలించారు.  సంగారెడ్డి నుంచి కాంగ్రెస్​లీడర్లు హైదరాబాద్ ​వెళ్లకుండా అడ్డుకున్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ అక్రమ అరెస్టులు సరికాదన్నారు. 

ప్రజావాణిలో రెవెన్యూ సమస్యలే ఎక్కువ

సంగారెడ్డి టౌన్ : ప్రజావాణిలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. సోమవారం మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి కలెక్టరేట్లలో ప్రజావాణి నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌‌లో అడిషనల్​కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణికి 87 దరఖాస్తులు వచ్చినట్లు వారు తెలిపారు. మొత్తం దరఖాస్తుల్లో 28 అర్జీలు రెవెన్యూ శాఖకు చెందినవి వచ్చాయి. 
మెదక్​ టౌన్​, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని మెదక్​ అడిషనల్​కలెక్టర్ రమేశ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 33  ఫిర్యాదులు రాగా వాటిలో ధరణి, పోడు సమస్యలపై 29 దరఖాస్తులు వచ్చాయి. 

మెదక్​ ఎస్పీ ఆఫీసులో.. 
పోలీస్​స్టేషన్లకు వచ్చే బాధితుల సమస్యలను తెలుసుకొని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. సోమవారం ఎస్పీ ఆఫీసులో ప్రజల ఫిర్యాదులు స్వీకరించారు. 

సిద్దిపేట రూరల్ : ప్రజావాణి వినతులపై ప్రత్యేక దృష్టి సారించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  ప్రజావాణిలో వివిధ సమస్యల పై 63 అర్జీలు వచ్చినట్లు శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. 

కొత్త ఏడాదిలో ఉన్నత ఆశయాలతో ముందుకు సాగాలి

మెదక్​ టౌన్ : కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఉన్నత ఆశయాలతో ముందుకు సాగా లని మెదక్​ అడిషనల్​ కలెక్టర్​ ప్రతిమాసింగ్​ అన్నారు. సోమవారం మెదక్​ కలెక్టరేట్‌‌లో పీఆర్టీయూ–2023 క్యాలెండర్‌‌‌‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆ సంఘం  జిల్లా జనరల్​ సెక్రటరీ కృష్ణ , పీఆర్టీయూ టీఎస్​ పత్రిక సంపాదకవర్గ సభ్యులు వెంకటరామి రెడ్డి,  రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రవి, మల్లారెడ్డి, మహేశ్, సాయిలు, మాజీ ప్రెసిడెంట్​ సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర బాధ్యు లు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) మెదక్​జిల్లా క్యాలెండర్​ను అడిషనల్​కలెక్టర్​ప్రతిమాసింగ్, డీఈవో రమేశ్​ఆవిష్కరించారు.  కార్యక్రమంలో తపస్​ జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు ఎల్లం, లక్ష్మణ్,  లీడర్లు రామారావు, రాజు, మహేశ్ పాల్గొన్నారు. 
నారాయణ్ ఖేడ్, వెలుగు: ఉమ్మడి జిల్లా పద్మశాలీ ఉద్యోగుల సంఘం క్యాలెండర్‌‌‌‌ను సోమవారం కలెక్టరేట్‌‌లో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షా ఆవిష్కరించారు. అనంతరం ఉమ్మడి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జెట్ల భాస్కర్, సంఘం బాధ్యులు అదనపు కలెక్టర్లను సన్మానించారు.

ఖేడ్​లో బస్తీ దవాఖానా షురూ

నారాయణ్ ఖేడ్ : నారాయణఖేడ్ పట్టణంలో బస్తీ దవాఖానాను డీఎంహెచ్‌‌వో గాయత్రీదేవితో కలిసి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఖేడ్​లో త్వరలోనే 50 పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని కూడా ప్రారంభించనునట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, మున్సిపల్ చైర్‌‌‌‌పర్సన్ రుబీనా నజీబ్, కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక కేంద్రంగా శ్రీసిద్ధి గణపతి ఆలయం : ఎమ్మెల్యే మహిపాల్‌‌రెడ్డి 

పటాన్​చెరు : రుద్రారం శ్రీ సిద్ధి గణపతి ఆలయాన్ని రాష్ట్రంలోనే  ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు పటాన్‌‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌‌రెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయానికి రూ.కోటి 50 లక్షల సొంత నిధులతో మూడు రాజగోపురాల నిర్మాణ పనులకు సోమవారం ఉదయం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పటాన్‌‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీ రాజు, కార్పొరేటర్ కుమార్ యాదవ్, ఈవో మోహన్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.