క‌రోనాతో మ‌ర‌ణిస్తే ద‌హ‌నం చేయాల్సిందే: పూడ్చాలంటే కండిష‌న్స్..

క‌రోనాతో మ‌ర‌ణిస్తే ద‌హ‌నం చేయాల్సిందే: పూడ్చాలంటే కండిష‌న్స్..

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైర‌స్ యావ‌త్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ్యాపిస్తుండ‌డం.. వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో భారీ సంఖ్య‌లో దీని బారిన‌ప‌డి మ‌ర‌ణిస్తున్నారు. ఇది కొత్త వైర‌స్ కావ‌డం వ‌ల్ల దాని ప్ర‌భావం కూడా పూర్తి స్థాయిలో ఇంకా తేల‌ని ప‌రిస్థితులు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనా సోకి ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే.. ఆ డెడ్ బాడీల ద‌హ‌నం విష‌యంలోనూ చాలా జాగ్ర‌త్త‌లు పాటించాల్సి వ‌స్తోంది. మృత‌దేహాల‌ను కుటుంబ‌స‌భ్యులు, బంధువులు తాకొద్ద‌ని కూడా వైద్యులు సూచిస్తున్న‌ట్లు కొన్ని వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఏంసీ) క‌రోనా మృతుల అంత్య‌క్రియ‌ల‌పై కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది.

ఏ మతం వారైనా స‌రే క‌రోనాతో మ‌ర‌ణిస్తే వారి ఆచార వ్య‌వ‌హారాల‌ను ప‌క్క‌న‌పెట్టి.. త‌ప్ప‌నిస‌రిగా ద‌హ‌నం చేయాల‌ని ఆదేశించారు బీఎంసీ క‌మిష‌న‌ర్ ప్ర‌వీణ్ ప‌ర్దేశీ. ఆ డెడ్ బాడీల‌ను పూడ్చ‌డానికి అనుమ‌తించ‌బోమ‌ని చెప్పారాయ‌న‌. అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండ‌కూడ‌ద‌ని ఆయ‌న తెలిపారు. ఎవ‌రైనా త‌ప్ప‌నిస‌రిగా మృత‌దేహాన్ని పూడ్చాల్సిందేన‌ని భావిస్తే ముంబై సిటీ ప‌రిధిలో అనుమ‌తించ‌బోమ‌ని చెప్పారు. అలా నిర్ణ‌యించుకున్న వాళ్లు ముంబై జూరిడిక్ష‌న్ దాటి వెళ్లి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌ని అన్నారు.

మార్చి 30 నాటికి ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు ఏడున్న‌ర‌ ల‌క్ష‌ల మందికి క‌రోనా వైర‌స్ సోకింది. అందులో ల‌క్ష‌న్న‌ర మందికి పైగా కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు 35 వేల మంది వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయారు. ఇక భార‌త్ లో దాదాపు 1200 మంది క‌రోనా బారిన‌ప‌డ‌గా.. 104 మంది వ్యాధి పూర్తిగా న‌య‌మై డిశ్చార్జ్ అయ్యారు. 30 మంది వైర‌స్ కు బ‌ల‌య్యారు.