పాలమూరు కాంగ్రెస్​ పార్టీలో కలిసిన చేతులు

పాలమూరు కాంగ్రెస్​ పార్టీలో కలిసిన చేతులు
  •     పాలమూరులో ఏకతాటిపైకి వస్తున్న కాంగ్రెస్​ నేతలు
  •     సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్న హైకమాండ్ 
  •     నియోజకవర్గాల్లో క్యాండిడేట్లతో కలిసి క్యాంపెయిన్​లో పాల్గొంటున్న లీడర్లు

మహబూబ్​నగర్, వెలుగు: పాలమూరు కాంగ్రెస్​ పార్టీలో అసంతృప్తితో ఉన్న​లీడర్లంతా ఒక్కతాటి పైకి వస్తున్నారు. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి వీరంతా టికెట్ల కోసం పోటీ పడగా.. హైకమాండ్​ రిలీజ్​ చేసిన లిస్టుల్లో వీరి పేర్లు లేకపోవడంతో కొద్ది రోజులుగా నారాజ్​లో ఉన్నారు. అయితే నాలుగు రోజుల నుంచి వీరు సెగ్మెంట్లలో హైకమాండ్​ ప్రకటించిన క్యాండిడేట్లకు అనుకూలంగా తమ అనుచరులతో కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశాలకు క్యాండిడేట్లను చీఫ్​ గెస్టులుగా పిలిచి అండగా ఉంటామంటూ చేతులు కలుపుతున్నారు. మరికొందరు లీడర్లు పార్టీ స్టేట్​ చీఫ్​ రేవంత్​రెడ్డి వద్దకు వెళ్లి క్యాండిడేట్లకు సపోర్ట్​గా ఉంటామని హామీ ఇస్తున్నారు.

రంగంలోకి రేవంత్​రెడ్డి..

మహబూబ్​నగర్​ అసెంబ్లీ సెగ్మెంట్​ నుంచి పోటీ చేసేందుకు బీసీ సామాజిక వర్గానికి చెందిన లీడర్​ ఎన్పీ వెంకటేశ్​ ప్రయత్నాలు చేశారు. తనకే టికెట్​ వస్తుందన్న నమ్మకంతో కొంత కాలం పబ్లిక్​లో తిరిగారు. అయితే, హైకమాండ్​ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డికి సెకండ్​ లిస్ట్​లో టికెట్ కన్ఫాం చేసింది. ఈ క్రమంలో కొద్ది రోజులు పార్టీ కార్యక్రమాలకు ఎన్పీ  దూరంగా ఉంటున్నారు. ఈ విషయం హైకమాండ్​ దృష్టికి వెళ్లడంతో పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి రంగంలోకి దిగారు. వైఎస్ఆర్​తో పాటు ఎన్పీని శుక్రవారం హైదరాబాద్​కు పిలిపించుకున్నారు. మహబూబ్​నగర్  పరిస్థితులు తనకు పూర్తిగా తెలుసుని, అందరూ కలిసి​గెలుపు కోసం పని చేయాలని కోరారు. వీరి వెంట వచ్చిన ఆనంద్ గౌడ్, ఎస్ఏ వినోద్​కు కూడా ఇదే సూచించారు. ‘మీ భవిష్యత్​కు పూచీ నాదే’ అంటూ వారికి హామీ ఇచ్చారు. దీంతో శనివారం నిర్వహించిన ఎలక్షన్​ క్యాంపెయిన్​లో అందరూ కలిసి పాల్గొన్నారు.

సమావేశాలు.. తీర్మానాలు..

మక్తల్​ స్థానం కోసం కాంగ్రెస్​ పార్టీ నుంచి ఎక్కువ మంది పోటీ పడ్డారు. ఇందులో నాగరాజు గౌడ్, ప్రశాంత్​రెడ్డి, పోలీస్​ చంద్రశేఖర్​రెడ్డి, బాలకిష్టారెడ్డి, వాకిటి శ్రీహరి, సీతాదయాకర్​రెడ్డి టికెట్​ కోసం అప్లై చేసుకున్నారు. హైకమాండ్​ మాత్రం ఆ పార్టీ డీసీసీ అధ్యక్షుడు, బీసీ లీడర్​ శ్రీహరికి టికెట్​ కన్ఫాం చేసింది. దీంతో టికెట్​ ఆశించిన లీడర్లంతా అసంతృప్తిలో ఉన్నారు. అయితే, నాలుగు రోజుల కింద దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్​రెడ్డి తమ అనుచరులతో మక్తల్​లో సమావేశం నిర్వహించారు. సమావేశానికి శ్రీహరిని ఆహ్వానించి అందరూ శ్రీహరికే సపోర్ట్​ చేయాలని తీర్మానించారు. మూడు రోజుల కింద బీకేఆర్​ ఫౌండేషన్​ అధినేత బాలకిష్టారెడ్డి కూడా తన వర్గంతో సమావేశం ఏర్పాటు చేశారు. శ్రీహరిని సమావేశానికి ఆహ్వానించి​ప్రతి ఒక్కరి సపోర్ట్​ శ్రీహరికే ఉంటుందని హామీ ఇచ్చారు. శనివారం నర్వ మండలంలో జరిగిన ఎన్నికల క్యాంపెయిన్​లో శ్రీహరితో కలిసి సీతాదయాకర్​రెడ్డి, బాలకిష్టారెడ్డితో పాటు నాగరాజుగౌడ్, పోలీస్​ చంద్రశేఖర్​రెడ్డి పాల్గొనడం విశేషం. మరో లీడర్​ ప్రశాంత్​రెడ్డితో కూడా పార్టీ హైకమాండ్​ చర్చలు జరిపింది. ఈయన కూడా తన అనుచరులతో సమావేశమై తర్వాత హైదరాబాద్​ వెళ్లారు. శనివారం నుంచి శ్రీహరికి సపోర్ట్​గా ఎన్నికల క్యాంపెయిన్​లో పాల్గొన్నారు. 

మద్దతులు.. చేరికలు..

దేవరకద్ర సీటు కోసం మహబూబ్​నగర్​ డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్​రెడ్డి (జీఎంఆర్​)తో పాటు ప్రదీప్​కుమార్​గౌడ్, కొండా ప్రశాంత్​రెడ్డి ప్రయత్నం చేశారు. కానీ, సెకండ్​ లిస్టులో హైకమాండ్​ జీఎంఆర్​కు టికెట్​ కన్ఫాం చేసింది. దీంతో  ఓ సందర్భంలో తనకు టికెట్​ రాలేదని ఇండిపెండెంట్​గా  పోటీ చేస్తానని ప్రశాంత్​ సంకేతాలు ఇచ్చారు. అయితే, స్వయంగా జీఎంఆర్​ రంగంలోకి దిగి, ప్రశాంత్​తో చర్చలు జరుపడంతో ఇష్యూ సద్దుమణిగింది. అలాగే ప్రధాన పార్టీలకు చెందిన గ్రామ, మండల స్థాయి లీడర్లు పెద్ద మొత్తంలో జీఎంఆర్​ సమక్షంలో పార్టీలో చేరుతుండటం కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్​రెడ్డి కాంగ్రెస్​ పార్టీలోనే ఉండడం, ఈ ఎన్నికల్లో జీఎంఆర్​కు సపోర్ట్​గా ఆమె ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. పలు పార్టీల నుంచి దేవరకద్ర స్థానం కోసం సంప్రదింపులు జరిపిన ఓ ఆఫీసర్​ కూడా జీఎంఆర్​కు బ్యాక్​ సపోర్ట్​గా ఉన్నట్లు తెలిసింది.
 
మిగతా నియోజకవర్గాల్లో..

దాదాపు రెండు నెలలుగా జడ్చర్ల, నారాయణపేట అసెంబ్లీ స్థానాల్లో టికెట్లపై సస్పెన్స్​ కొనసాగింది. సెకండ్​ లిస్ట్​ ప్రకటన తర్వాత ఈ రెండు స్థానాలకు తనకు ఎక్కడా టికెట్​ రాలేదని ఎర్ర శేఖర్ బీఆర్​ఎస్​లోకి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్​ క్యాడర్​ మొత్తం ఒకే తాటిపై నిలిచింది. అప్పటి వరకు జడ్చర్లలో రెండు గ్రూపులుగా ఉన్న పార్టీ.. ఒక్కటవ్వడంతో ఆ పార్టీ జడ్చర్ల క్యాండిడేట్  జనంపల్లి అనిరుధ్​రెడ్డికి బెనిఫిట్​ అయ్యింది. నారాయణపేటలోనూ పర్ణికారెడ్డికి ఇదే విషయం అనుకూలంగా మారింది. 

అలాగే కొద్ది రోజుల కింద కొల్లాపూర్​ టికెట్​ ఆశించిన జగదీశ్వర్​రావు టికెట్ రాలేదనే బాధతో ఫార్వర్డ్​ బ్లాక్​లో చేరినా.. మరుసటి రోజే హైకమాండ్​ మాట్లాడి తగిన ప్రియారిటీ ఇస్తామని హామీ ఇవ్వడంతో తిరిగి పార్టీలో చేరారు.