- అర్హులందరికీ కార్డులు అందజేస్తాం
- ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి
నిజామాబాద్, వెలుగు : రాష్ట్రంలో అర్హత గల ప్రతి జర్నలిస్ట్‌కు అక్రెడిటేషన్ కార్డులు అందేలా చూస్తామని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. గతంలో మాదిరిగానే డెస్క్, ఫీల్డ్ జర్నలిస్ట్‌లకు కార్డులు జారీ అవుతాయన్నారు. నిజామాబాద్‌లోని వెల్‌నెస్ హాస్పిటల్ తరఫున ప్రెస్‌క్లబ్ సభ్యులకు బుధవారం స్థానిక న్యూ అంబేద్కర్ భవన్‌లో హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... సంక్షేమ పథకాలను ముడిపెట్టడంతో అక్రిడిటేషన్ కార్డులకు డిమాండ్ పెరిగిందన్నారు. ప్రస్తుతం వర్కింగ్ జర్నలిస్ట్ పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ అక్రిడిటేషన్, మీడియా కార్డులు జారీ చేయాలన్న తమ ప్రపోజల్‌కు సర్కార్ అంగీకరించిందన్నారు. కార్డులతో సంబంధం లేకుండా డెస్క్ సభ్యులు, రిపోర్టర్లకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు.
పనిగంటలతో సంబంధం లేని ఫీల్డ్ జర్నలిస్ట్‌లకు వార్తా సేకరణ కోసం ప్రత్యేక ఐడెంటిటీ అవసరమనే మొదటి ప్రెస్ కమీషన్ ఆలోచనను తాము గౌరవిస్తామన్నారు. గురువారం మరోసారి స్టేట్ లెవల్ అక్రిడిటేషన్ కమిటీ మీటింగ్ జరగనున్నట్లు చెప్పారు. మీడియా ముసుగులో కొందరు జర్నలిజానికి మచ్చ తెస్తున్నారని, అలాంటి వారిని ఏరి వేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. ఇసుక వాహనాలు, రైస్ లోడ్‌తో వెళ్తున్న లారీల చెకింగ్, ఇంటి పర్మిషన్ల పరిశీలనకు, బోర్లు వేసే వారిని, హోటల్ లైసెన్స్ చెకింగ్‌కు అక్రిడిటేషన్ కార్డులు వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ సారి ఇచ్చే అక్రిడిటేషన్ కార్డుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని, న్యూస్‌పేపర్స్, ఛానల్స్, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ పేపర్ల మధ్య తేడా చూపబోమని స్పష్టం చేశారు.

