ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లన్నీ ప్రైవేటుకే

V6 Velugu Posted on Oct 17, 2021

  • ఐకేపీ ఉద్యోగుల జాబ్ పర్మినెంట్ ఆశలపై నీళ్లు
  • అటకెక్కిన రూ.123 కోట్ల డీపీఆర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి మహిళా సంఘాలకు అప్పగిస్తామని, ఐకేపీ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని గత ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. రాష్ట్రంలో త్వరలో ఏర్పాటయ్యే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లన్నీ ప్రైవేట్ సెక్టార్​లోనే ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే యూనిట్ల ఏర్పాటుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి దరఖాస్తులు కోరగా 350 మంది వరకు అప్లై చేసుకున్నారు. ఇన్నాళ్లు యూనిట్లతో ఉపాధి లభిస్తుందని, ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని ఆశలు పెట్టుకున్న మహిళా పొదుపు సంఘాలు, ఐకేపీ ఉద్యోగులకు నిరాశే మిగిలినట్లైంది. 

ఎన్నికలప్పటి హామీ అమలు చేస్తలే
రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) పరిధిలోని 3,99,120 డ్వాక్రా గ్రూపులలో 43,29,058 మంది సభ్యులున్నారు. ఈ సంఘాల నిర్వహణ, పర్యవేక్షణకు 4 వేల మందిదాకా ఐకేపీ ఉద్యోగులు ఎన్నో ఏండ్లుగా కాంట్రాక్ట్​ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని వీళ్లంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఐకేపీ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలతోపాటు ఐకేపీ ఉద్యోగులకు అప్పగిస్తామని 2018 ఎన్నికల మేనిఫెస్టోలో 16వ హామీగా టీఆర్ఎస్ పేర్కొంది. కానీ, ఆ హామీ ఇప్పటికీ నెవరవేరలేదు.

అట‌‌కెక్కిన రూ.123 కోట్ల డీపీఆర్‌‌
రైతుల పంటలను మహిళా సంఘాలే కొని ప్రాసెసింగ్ పరిశ్రమలకు తరలించేలా ప్లాన్ చేశారు. రూ.123.78 కోట్లతో 98 అనుబంధ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను 16 జిల్లాల్లో  ఏర్పాటు చేసేలా డీపీఆర్ స‌‌ర్కార్‌‌కు వెళ్లింది. పాలు, చేపలు, గొర్రెలు, మేకల మాంసం ఉత్పతుల‌‌ను మార్కెటింగ్‌కు జిల్లాకొక ఫుడ్‌‌ పార్కు, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్​కు ఒక పరిశ్రమ  ఏర్పాటు చేస్తామ‌‌ని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఇప్పటికే  స్టేట్‌‌ ఫుడ్‌‌ ప్రాసెసింగ్‌‌ సొసైటీ (టీఎస్‌‌ఎఫ్‌‌పీఎస్‌‌)ని కూడా ఏర్పాటు చేశారు. అయితే డీపీఆర్‌‌పై ఇప్పటికీ నిర్ణయం తీసుకోని సర్కారు.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. 

సీఎం ఇలాకాలోనూ పనులైతలే
సీఎం కేసీఆర్ ఇలాకా గ‌‌జ్వేల్​లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు తున్కి, బొల్లారంలో 400 ఎకరాలు, అచ్చాయపల్లిలో మరో 200 ఎకరాల భూమిని సేకరించారు. ఈ యూనిట్ల ఏర్పాటుతో 4 వేల మంది కొండపోచమ్మసాగర్ భూనిర్వాసితులకు ఉపాధి లభించనుంది. గజ్వేల్, బయ్యారంలో మల్లన్నసాగర్ పునరావాసుల ఉపాధి కోసం గుర్తించిన ప్రభుత్వ భూముల్లో ఇంకా ఫుడ్ ప్రాసెసింగ్‌‌ యూనిట్ల ఏర్పాటు మొద‌‌లు కాలేదు. దాదాపు 10 వేల మందికి ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం ప్రకటించుకుంది కానీ పనులు మాత్రం ముందుకు సాగట్లేదు. ఇలా సర్కారు ఆల‌‌స్యంతో రైతులకు గిట్టుబాటు ధర, మహిళా సంఘాలకు ఉపాధి అంద‌‌ట్లేదు. నేష‌‌న‌‌ల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌‌లో రూ.26 కోట్లతో అల్లం, వెల్లుల్లి మిశ్రమం, కారం, పసుపు పొడి వంటి ఉత్పత్తుల త‌‌యారీకి హర్టిక‌‌ల్చర్ డిపార్ట్ మెంట్ పంపిన డీపీఆర్ కూడా ఇంకా ఆమోదానికి నోచుకోలేదని అధికారులు చెప్తున్నారు.

Tagged Telangana, Telangana government, Food processing uits, IKP employees

Latest Videos

Subscribe Now

More News