కరోనా ఎఫెక్ట్: ఇక నుంచి ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఇవన్నీ కావాల్సిందే

కరోనా ఎఫెక్ట్: ఇక నుంచి ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఇవన్నీ కావాల్సిందే
  • ఇన్సూరెన్స్ ఇక ఈజీ కాదు!
  • ప్రీమియాలు 30 శాతం వరకు పెరిగే చాన్స్
  • కొన్ని వ్యాధుల బాధితులకు నో పాలసీ!
  • కరోనా బాధితులకూ బీమా దీమా కష్టమే!

న్యూఢిల్లీ: కరోనా దాపురించాక మన ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ అర్థమయింది. పాలసీల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఇన్సూరెన్స్ కంపెనీల బ్యాలన్స్ షీట్లపై బలమైన ఎఫెక్ట్ కనిపిస్తోంది. దీంతో ఇక నుంచి పాలసీలు ఇవ్వడానికి మరింత కఠినమైన రూల్స్ అమలు చేయాలని కంపెనీలు అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రీమియాల రేట్లనూ పెంచడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. కరోనా వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు కోట్లాది రూపాయలు చెల్లిస్తుండటం వల్లే ఈ నిర్ణయానికి వచ్చాయని సెక్టార్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌లు చెబుతున్నారు. 

వీళ్లకు కష్టాలే...
తీవ్రమైన వ్యాధులు ఉన్న వారికి, మానసిక సమస్యలు ఉన్న వారికి, ఫ్రంట్‌‌‌‌లైన్ వర్కర్లు, నిరుద్యోగులు, స్వయం ఉపాధి పొందేవారికి, తక్కువ క్రెడిట్‌‌‌‌ స్కోరు ఉన్న వారికి పాలసీలు అమ్మేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలనే ఆలోచనలో కంపెనీలు ఉన్నాయి. ఈ మేరకు ‘అండర్‌‌‌‌‌‌‌‌రైటింగ్ నామ్స్’లో మార్పులు చేయాలని గ్లోబల్ రీఇన్సూరెన్స్ కంపెనీలు లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలను కోరుతున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీల రిస్కును తగ్గించేందుకు రీ ఇన్సూరెన్స్ కంపెనీలు పనిచేస్తాయి. ఇక నుంచి పాలసీ ఇచ్చేటప్పుడే టెలీమెడిసిన్ విధానంలో అప్లికెంట్ మెడికల్ హిస్టరీని, వ్యాధుల వివరాలను పరిశీలిస్తారు. సీరియస్ జబ్బులు ఉంటే అప్లికేషన్‌‌‌‌ను తిరస్కరించే చాన్సులు ఉంటాయని ఒక కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఏడాదికి రూ.ఐదు లక్షల కంటే తక్కువ ఆదాయం ఉండేవారికి, కనీసం డిగ్రీ చదువు లేని వారికి పాలసీలు ఇవ్వడానికి అంగీకరించపోవచ్చని అన్నారు. ఇలాంటి వాళ్లు ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వబోరని కంపెనీలు అనుకుంటాయని అన్నారు.

రేట్లు పెరుగుతాయి...
హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల రేట్లను 25 శాతం పెంచాలనే ప్రపోజల్‌‌‌‌ను కంపెనీలు పరిశీలిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే రేట్ల పెంపు అమల్లోకి రావొచ్చు. మనదేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ మాత్రం ఇంత వరకు రేట్లను పెంచలేదు. సాధారణ ఇన్సూరెన్స్ కంపెనీలు రీఇన్సూరెన్స్ కాంట్రాక్టులపై సంతకాలు చేసేటప్పుడే ఈ కొత్త రూల్స్‌‌‌‌కు ఒప్పుకోవాల్సి ఉంటుందని మరో కంపెనీ ఎగ్జిక్యూటివ్ అన్నారు. స్విస్ రే, లాయిడ్, మ్యూనిక్ వంటి విదేశీ కంపెనీలు మన సంస్థలకు రీ ఇన్సూరెన్స్ సేవలు అందిస్తున్నాయి. ఇండియాలో ప్రీమియాల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని ఇవి అంటున్నాయి. సీరియస్ జబ్బులు ఉన్న వాళ్లకు పాలసీ పొందడం కష్టం కానుంది. ఇప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలకు ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఖర్చులను భరించేందుకు కంపెనీలు ఒప్పుకోకపోవచ్చు. మానసిక సమస్యలు ఉన్నా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. హెల్త్ పాలసీ తీసుకోవాలంటే కరోనా నెగటివ్ రిపోర్టును తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ విషయమై బేషక్ ఆర్గ్ పేరుతో ఇన్సూరెన్స్ అవగాహన వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ నడిపే మహావీర్ చోప్రా మాట్లాడుతూ ఇక నుంచి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్లు ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉండొచ్చని స్పష్టం చేశారు. లేనివాళ్లతో తక్కువ మొత్తానికే పాలసీ పొందవచ్చని వివరించారు. కరోనా కారణంగా కంపెనీలకు క్లెయిమ్‌‌‌‌లు విపరీతంగా వస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి, ఆరోగ్య బీమా సంస్థలతో సహా నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కరోనా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఖర్చుల కోసం రూ .14,560 కోట్ల విలువైన రీయింబర్స్ మెంట్లు కోరుతూ 9.8 లక్షల క్లెయిమ్‌‌‌‌లు వచ్చాయి. ఈ నెల 14 నాటికి రూ .22,955 కోట్ల విలువైన 14.8 లక్షల క్లెయిమ్స్ అందాయి.  అంటే ఆర్థిక సంవత్సరంలో మొదటి 44 రోజుల్లో వచ్చిన కోవిడ్ క్లెయిమ్‌‌‌‌ల విలువ రూ .8,385 కోట్లకు చేరింది.

ఇక నుంచి ఇన్సూరెన్స్ పొందడానికి ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్
1.ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్టు
2.ఇన్కమ్/ఎంప్లాయ్‌మెంట్ ప్రూఫ్
3.సిబిల్ స్కోరు
4.ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్
5. కరోనా నెగెటివ్ రిపోర్టు