కలెక్టర్​పై అఖిలపక్ష పార్టీల ఫిర్యాదు

కలెక్టర్​పై అఖిలపక్ష పార్టీల ఫిర్యాదు

జనగామ అర్బన్, వెలుగు:  కలెక్టర్  సీహెచ్. శివలింగయ్య తీరుపై మంగళవారం సీఈసీ, సీఎస్ కు అఖిల పక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి. అనంతరం జనగామ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయా పార్టీల నాయకులు ధర్నా  నిర్వహించారు. అనంతరం ఫిర్యాదు చేసిన కాపీలను ప్రజలకు, మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్బంగా అఖిలపక్ష పార్టీల లీడర్లు మాట్లాడుతూ జనగామ జిల్లాలో వివాదాలకు కేరాఫ్​ అడ్రస్ అయిన   కలెక్టర్ ను ఎన్నికల అధికారి బాధ్యతల నుంచి  వెంటనే తొలగించి ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చూడాలని కోరారు. తన పద్దతిని మార్చుకోకుండా రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు.

పుట్టినరోజు వేడుకలకు, పండుగలకు జిల్లాలోని అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల నుంచి బంగారం రూపంలో కానుకలు పొందింది నిజం కాదా అని ప్రశ్నించారు. రియల్​ఎస్టేట్​వ్యాపారులతో కుమ్మక్కై జిల్లాలో ఫాంల్యాండ్స్ పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, యువజన విద్యార్ధి సంఘాల నాయకులు  జిల్లాల  సిద్దారెడ్డి, బనుక శివరాజ్ యాదవ్, నిర్మాల రత్నం, బక్క మారయ్య, పిల్లుట్ల నిలాద్రి, తుర్కపల్లి కుమార్, ఇరుగు మహేందర్, జోగు ప్రకాష్, దడిగె సందీప్​, దూసరి నాగరాజు, తుంగ కౌశిక్​, పాయి ప్రకాశ్ తదితరులు 
పాల్గొన్నారు.