రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో సీఎంపై విమర్శలు

రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో సీఎంపై విమర్శలు

ఖైరతాబాద్ వెలుగు: మార్చాల్సింది రాజ్యాం గాన్ని కాదు కేసీయార్ నే అంటూ అఖిల పక్ష, ప్రజా సంఘాల నేతలు సీఎంపై ఫైర్ అయ్యారు. సోమవారం తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రాజ్యాంగ పరిరక్షణ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ..  కేసీఆర్ వ్యాఖ్యలు ఆయన నిరంకుశ పాలనకు అద్దం పట్టేలా ఉన్నాయన్నారు. అందరికి సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని లేకుండా  చేసే కుట్ర జరుగుతోందన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా అందరం కలిసి కట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఏడేండ్లలో ప్రజల అవసరాల కోసం ఎప్పుడు పని చేయలేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏ ఒక్కరినీ వదలడం లేదన్నారు. సామాజిక న్యాయంపై సీఎం కేసీఆర్ దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఈ 
నెల12న కార్యాచరణ ప్రకటిస్తం కేసీఆర్ ఇక కాస్కో.. మీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా  పోరాటానికి సిద్ధమయ్యాం’’ అని ప్రకటించారు. 

కొన్ని కులాల వారే పాలకులా: ఆకునూరి మురళి
మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి మాట్లాడుతూ.. గత 75 ఏండ్లుగా కొన్ని కులాల వారే పాలిస్తున్నారని మిగతా వారు ఓటర్లుగానే ఉంటున్నారన్నారు. ‘‘రాజ్యాంగాన్ని మార్చే అధికారం రాష్ట్రపతికి, పార్ల మెంట్ కు లేదు. సవరణలు మాత్రమే చేసుకోవచ్చు” అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడానికే కొత్త రాజ్యాంగం అంటున్నారన్నారు. సీనియర్ సామాజిక ఉద్యమ నేత జేబీ రాజు మాట్లాడుతూ కేసీఆర్ రాజ్యాంగం మార్చాలనడం దేశానికే ప్రమాదకరమన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలో చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉందన్నారు. ప్రజలు రాజ్యాంగాన్ని ఓన్ చేసుకుంటే.. పాలకులు విమర్శిస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ‘‘రాజ్యాంగం నచ్చకపోతే దేశం విడిచి వెళ్లిపోవాలి. అది కేసీఆర్ అయినా ఇంకెవరైనా’’ అని అన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ మాట్లాడుతున్నదే  కేసీఆర్ మాట్లాడుతున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు జాతీయ స్థాయిలో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహాజన సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ..  రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇప్పటికే వారం రోజులు నిరసనకు పిలువునిచ్చామని, ఈనెల12న కలిసివచ్చే అందరితో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టబోతున్నామని 
వెల్లడించారు.