- సాదాబైనామాలను 45 రోజుల్లోనే పరిష్కరిస్తాం
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ఖమ్మంరూరల్/కూసుమంచి, వెలుగు : ప్రజల నుంచి వచ్చి ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల, కూసుమంచి గ్రామాల్లో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి కలెక్టర్ దివాకర టీఎస్, అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డితో కలిసి హాజరై ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సాధారణ సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు మూడు నెలల గడువు విధిస్తున్నామని, ఈ లోపు ప్రతి దరఖాస్తుకు స్పష్టమైన పరిష్కారం చూపడమే తమ లక్ష్యమన్నారు. సాదాబైనామా సమస్యలను 45 రోజుల్లోనే క్లియర్ చేస్తామని స్పష్టం చేశారు. మొదటివిడతలో 4.5 లక్షల ఇండ్లను మంజూరు చేశామని, త్వరలోనే రెండో విడత ఇండ్ల పంపిణీకి శ్రీకారం చుడుతామన్నారు. మే 4న ఖమ్మంలోని ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీఓ శ్రీనివాస్, ఆఫీసర్లు శ్రీరాం, పుల్లయ్య, ప్రసాదరావు, రాంబాబు, మంగళపూడి వెంకటేశ్వర్లు, రాజారావు పాల్గొన్నారు.
పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం మోసపూరితంగా వ్యవహరిస్తోంది
పెట్రోల్, డీజిల్, యూరియాపై కేంద్రం మోసపూరితంగా వ్యవహరిస్తోందని, రెగ్యులర్‌గా రావాల్సిన వాటాను సైతం అడ్డుకుంటోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. రెగ్యులర్ వాటాను తీసుకురావాల్సిన బాధ్యత కేంద్రమంత్రులైన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌పైనే ఉందన్నారు. పెట్రోల్, డీజిల్ కొరతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. కేంద్రంపై కొట్లాడి రాష్ట్రానికి రావాల్సిన వాటాను సాధించాలని సూచించారు.

