
- రీసెర్చ్, ర్యాంకింగ్స్‌లో వెనుకబాటు
- 5 వేల పోస్టులు ఖాళీ.. వాటికి ఫైనాన్స్ అప్రువల్ తీసుకోలే
- కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లు పేరుతో మరింత ఆలస్యం
హైదరాబాద్, వెలుగు: యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీపై రాష్ట్ర సర్కార్ ఆసక్తి చూపడం లేదు. వర్సిటీల్లో ఎన్ని టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనే ప్రపోజల్స్ కూడా ఇప్పటివరకు తెప్పించుకోలేదు. వర్సిటీల్లో ఖాళీలపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసి 8 నెలలు గడుస్తున్నా ఆ దిశగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఆయా వర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఐదు వేల ఖాళీలు ఉన్నాయని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ వివరాలను తెప్పించుకుని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాతే రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలవుతుంది. కానీ ఇంతవరకు ఆ వివరాలే వర్సిటీల నుంచి తీసుకోలేదు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు చట్టం అమల్లోకి వచ్చాక భర్తీ ప్రక్రియ చేపట్టాలని సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అన్ని అనుమతులు తీసుకుని రెడీగా ఉంటే.. కొత్త చట్టం అమలులోకి రాగానే భర్తీ మొదలు పెట్టే వీలుంటుందని వర్సిటీ ఆఫీసర్లు చెప్తున్నారు. గత 8 ఏండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీల్లో రిక్రూట్మెంట్స్ చేపట్టలేదు. ఏళ్ల తరబడి గెస్ట్ ఫ్యాకల్టీ, ఔట్‌సోర్సింగ్ సిబ్బందితోనే నెట్టుకొస్తుండడంతో ఉన్నత విద్యలో నాణ్యత కొరవడుతోంది.
కొత్త విధానంపై గందరగోళం
యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు రాక మునుపే 1,061 పోస్టుల భర్తీకి నాలుగేండ్ల క్రితం ఆమోదం లభించింది. కానీ అప్పుడు వర్సిటీలను పోస్టుల భర్తీ చేపట్టనివ్వని సర్కార్.. ఇప్పుడు బోర్డు పేరుతో కొత్త విధానం తీసుకొస్తోంది. ఒడిశా, ఏపీ వంటి రాష్ట్రాల్లో ఇలాగే ప్రత్యేక విధానంలో రిక్రూట్మెంట్ చేసే ప్రయత్నం చేయగా న్యాయస్థానాల్లో నిలవలేదు. మన రాష్ట్రంలో ఈ విధానంపై గతంలోనే గవర్నర్ తమిళి సై పలు అనుమానాలు లేవనెత్తారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డిని పిలిపించుకుని మాట్లాడారు. లీగల్ ఎక్స్‌పర్ట్స్‌తో స్టడీ చేయిస్తున్నారు.
వేళ్ల మీద లెక్కపెట్టేలా ప్రొఫెసర్లు..
ఉస్మానియా వర్సిటీలో 70 శాతం పోస్టులు ఖాళీలున్నాయి. బోధన సిబ్బంది 1,246 మందికి కేవలం 400 మందిలోపే పనిచేస్తున్నారు. వివిధ విభాగాల్లో ఔట్ సోర్సింగ్, టైమ్ పేస్కల్ పద్ధతిలో కొన్ని పోస్టులు భర్తీ చేసి నెట్టుకొస్తున్నారు. కాకతీయ వర్సిటీలోనూ 75 శాతం బోధన సిబ్బంది ఖాళీలున్నాయి. ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కలిపి దాదాపు 410 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. శాతవాహన, మహాత్మాగాంధీ,పాలమూరు, ఆర్‌జీయూకేటీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాలు అన్ని కలిపితే ప్రొఫెసర్లను వేళ్లపై లెక్కించొచ్చు. తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు చేసి 16 ఏండ్లయింది. 30 మంది ప్రొపెసర్లకు నలుగురే ఉన్నారు. 60 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు పది మందిలోపే ఉన్నారు. మొత్తంగా 15 వర్సిటీల్లో 72 శాతం ప్రొఫెసర్, 87 శాతం అసోసియేట్ ప్రొఫెసర్, 65 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి
రీసెర్చ్ నడుస్తలే
రెగ్యులర్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకపోవడంతో పరిశోధనలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. రీసెర్చ్ స్కాలర్ కు గైడ్ చేయాల్సింది పర్మినెంట్ లెక్చరర్లే. యూజీసీ నిబంధనల ప్రకారం రీసెర్చ్ స్కాలర్స్ ను గైడ్ చేసేందుకు కాంట్రాక్టు లెక్చరర్లు అనర్హులు. శాతవాహన, మహాత్మాగాంధీ యూనివర్సిటీలు ప్రమాణాలు పాటించడం లేదని గతంలోనే యూజీసీ మొట్టికాయలు వేసింది.
ర్యాంకులపై ఎఫెక్ట్
నిధుల కొరత, భారీగా సిబ్బంది ఖాళీలు, పరిశోధనలు లేకపోవడం వంటి కారణాలతో వర్సిటీలు ఆశించిన మేర ఫలితాలను సాధించడం లేదు. దీని ప్రభావం గ్రాంట్లపై పడుతోంది. రాష్ట్ర యూనివర్సిటీల్లో చదువుతున్న స్టూటెంట్స్కు తగిన గుర్తింపు, ఎంప్లాయ్మెంట్ఆశించిన మేర లభించడం లేదు. ఇటీవల ప్రకటించిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2023లోనూ రాష్ట్ర వర్సిటీలు వెనకబడ్డాయి. 2022 ఏడాదికి విడుదలైన ర్యాంకుల్లో ఓయూ 1001–1200 ర్యాంకుల శ్రేణిలో ఉండగా, తాజా (2023) ర్యాంకుల్లో 1201–1500 శ్రేణిలోకి దిగజారింది.