మునుగోడులో రేపు మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సభ

మునుగోడులో రేపు మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సభ

మునుగోడులో టీఆర్ఎస్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి మునుగోడుకు రోడ్డు మార్గంలో బయలు దేరనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు మునుగోడుకు చేరుకుంటారు. మునుగోడు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న మునుగోడు ప్రజా దీవెన సభలో ఆయన పాల్గొంటారు. ప్రగతి భవన్ నుంచి ఉప్పల్, ఎల్బీనగర్, పెద్ద అంబర్ పేట్, పోచంపల్లి క్రాస్ రోడ్స్, చౌటుప్పల్, నారాయణ్ పూర్, చల్మెడ మీదుగా మునుగోడుకు చేరుకోనున్నారు.  సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ నేరుగా వేదిక వద్దకు చేరుకునేలా ప్రత్యేక రూట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ట్రాఫిక్ ఆంక్షలు

మునుగోడు సభ నేపథ్యంలో టీఆర్ఎస్ భారీ కాన్వాయితో ర్యాలీకి ప్లాన్ చేస్తోంది. దాదాపు 2వేల కార్లతో సీఎం కేసీఆర్కు స్వాగతం పలికి మునుగోడు వరకు ర్యాలీ నిర్వహించాలని భావిస్తోంది. టీఆర్ఎస్ సభ నేపథ్యంలో మనుగోడులో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నల్గొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి చెప్పారు.

భారీగా జన సమీకరణ

మునుగోడు ప్రజా దీవెన బహిరంగ సభ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు నేతృత్వంలో పలు బృందాలు సభ ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యాయి. మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎస్పీ రేమ రాజేశ్వరి సభాస్థలి వద్ద పనులు పరిశీలించారు. సభను సక్సెస్ చేసేందుకు టీఆర్ఎస్ ఇంఛార్జులను నియమించగా వారు క్షేత్రస్థాయిలో జన సమీకరణపై దృష్టి పెట్టారు.

పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

మునుగోడు సభకు హజరయ్యే జనానికి మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నారు.  సభకు వచ్చే వాహనాలను ఎక్కడికక్కడే పార్క్‌ చేసే విధంగా పార్కింగ్‌ స్థలాలను సిద్ధం చేశారు. ఇందుకోసం100 ఎకరాల్లో 10 చోట్ల పార్కింగ్‌ స్థలాలను ఎంపిక చేశారు.