పెండింగ్ పిటిషన్ల విచారణ పూర్తి చేయాలి: సీజేఐ

పెండింగ్ పిటిషన్ల విచారణ పూర్తి చేయాలి: సీజేఐ

పెండింగ్ లో ఉన్న బెయిల్, ట్రాన్స్ ఫర్ పిటిషన్లను వేగంగా విచారించేందుకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం పని చేస్తున్న 13 బెంచ్ లు... ప్రతి రోజు 10 బెయిల్, 10 ట్రాన్స్ ఫర్ పిటిషన్లు విచారించాలని సూచించారు. క్రిస్మస్ నాటికి ఈ విభాగాల్లో పెండింగ్ పిటిషన్ల విచారణ పూర్తి చేయాలన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమావేశంలో సీజేఐ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న ట్రాన్స్ ఫర్ పిటిషన్లలో ఎక్కువగా కుటుంబ, వివాహ బంధానికి సంబంధించిన వివాదాలు ఉన్నాయని సీజేఐ అన్నారు. పిటిషన్లు, లిటిగెంట్లు కేసును ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతుంటారని.. ఈ కేసుల్లో న్యాయ సంబంధమైన చిక్కులు ఎక్కువగా ఉండవన్నారు. కానీ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంటాయన్నారు. ప్రస్తుతం 3 వేల ట్రాన్స్ ఫర్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని సీజేఐ తెలిపారు. 13 బెంచ్ ల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి రోజు 10 కేసులను విచారిస్తే, 5 వారాల్లో ట్రాన్స్ ఫర్ పిటిషన్లు అయిపోతాయని చెప్పారు. బెయిల్ పిటిషన్లను కూడా ఇలాగే విచారించాలని ఆయన సూచించారు.