
ఓ వైపు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా.. ఇంగ్లండ్ టూర్‌లో ఉండగా.. మరోవైపు యూఏఈ గడ్డపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందడి మొదలైంది. కోహ్లీ, రోహిత్, బుమ్రా వంటి స్టార్లు ఇంగ్లిష్ టీమ్‌తో టెస్టు సిరీస్ ఆడుతుండగా.. ధోనీ, రైనా వంటి వెటరన్స్.. ఇషాన్ కిషన్‌లాంటి యంగ్‌స్టర్స్ వచ్చే నెల 19 నుంచి అరబ్ గడ్డపై జరిగే ఐపీఎల్ 14వ సీజన్ ఫేజ్2 కోసం రెడీ అవుతున్నారు..! చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఇప్పటికే యూఈఏ చేరుకొని ప్రాక్టీస్ షురూ చేశాయి..! ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అరబ్ గడ్డపై అడుగు పెట్టింది..! మిగతా ఫ్రాంచైజీలు కూడా ఈ నెలాఖర్లోగా యూఏఈ చేరుకొని ప్రిపరేషన్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాయి..! అదే టైమ్‌లో కొత్త సీజన్ కాకపోయినప్పటికీ.. సెకండ్ ఫేజ్ కోసం పలు టీమ్స్‌లో మార్పులు జరుగుతున్నాయి..! తొలిసారి ట్రోఫీ నెగ్గాలని ఆశిస్తున్న ఆర్‌సీబీ టీమ్‌లోకి ముగ్గురు కొత్త ప్లేయర్లు వచ్చారు..! ఆ టీమ్ హెడ్ కోచ్ కూడా మారాడు..! మిగతా ఫ్రాంచైజీలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి..! ఇంటర్నేషనల్ షెడ్యూల్, ఫారిన్ ప్లేయర్ల అందుబాటును దృష్టిలో ఉంచుకొని టీమ్‌లో మార్పులు చేసుకుంటున్నాయి..! ఓవరాల్‌గా అరబ్ గడ్డపై ఐపీఎల్ కోసం అన్ని ఫ్రాంచైజీలు.. కొత్త ప్లేయర్లతో సరికొత్త ప్రణాళికలతో సిద్ధమవుతున్నాయి..!!
న్యూఢిల్లీ: ఐపీఎల్ సెకండ్ ఫేజ్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) సరికొత్తగా రెడీ అవుతోంది. ముగ్గురు కొత్త వారికి చోటు కల్పించి టీమ్‌ను మరింత బలోపేతం చేసుకుంది. ఇందులో భాగంగా లంక టాప్ స్పిన్నర్ వానిందు హసరంగ, పేసర్ దుష్మంత చమీరాతో పాటు బిగ్‌బాష్‌లో దుమ్మురేపిన సింగపూర్ ప్లేయర్ టిమ్ డేవిడ్‌ను కొత్తగా టీమ్‌లోకి తీసుకుంది. ఆడమ్ జంపా, డానియల్ సామ్స్, ఫిన్ అలెన్ ప్లేస్‌లో ఈ ముగ్గుర్ని తీసుకున్నట్లు ఫ్రాంచైజీ శనివారం ప్రకటించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆర్‌సీబీ హెడ్ కోచ్ సైమన్ కటిచ్.. పదవి నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. ప్రస్తుతానికి కొత్త కోచ్‌గా ఎవరిని నియమించకపోయినా.. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వ్యవహరిస్తున్న మైక్ హెస్సన్.. చీఫ్ కోచ్‌గానూ కొనసాగుతాడని ఫ్రాంచైజీ తెలిపింది. యూఏఈలో పరిస్థితులను బట్టి తాము టీమ్‌లో మార్పులు చేశామని హెస్సన్ తెలిపాడు. ‘చాలా రోజుల నుంచి మేం కప్ కోసం పోరాటం చేస్తున్నాం. టీమ్‌గా నిలకడను చూపిస్తున్నాం. ఇప్పుడు కూడా అదే కొనసాగించాలని కోరుకుంటున్నాం. అందుకే టీమ్‌లో మార్పులు చేశాం. హసరంగ, డేవిడ్, చమీరా కరెక్ట్ టైమ్‌లో రాకపోయి ఉండొచ్చు. అయినప్పటికీ మా పెర్ఫామెన్స్‌లో ఏమాత్రం తేడా ఉండదు. ఈ ఏడాది ఆరంభంలో ఎలా ఆడామో ఇప్పుడు దానిని కొనసాగిస్తాం’ అని హెస్సన్ పేర్కొన్నాడు.
సింగపూర్ క్రికెటర్‌కు చాన్స్..
టిమ్ డేవిడ్‌ను ఆర్‌సీబీ తమ టీమ్‌లోకి తీసుకోవడంతో ఐపీఎల్‌లోకి తొలిసారి ఓ సింగపూర్ క్రికెటర్ వచ్చాడు. 6 .5 అడుగుల పొడవు ఉండే టిమ్ డేవిడ్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో సింగపూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే వరల్డ్ వైడ్‌గా జరిగే టీ20 లీగ్‌లకూ అతను ఫ్రీలాన్స్ క్రికెటర్‌గా అందుబాటులో ఉంటాడు. ఇప్పటివరకు ఆడిన14 టీ20ల్లో 158 స్ట్రయిక్ రేట్‌తో 558 రన్స్ చేశాడు. బీబీఎల్, పీఎస్‌ఎల్‌తో కలిసి మొత్తం 42 మ్యాచ్‌లు ఆడగా, 1171 రన్స్ ఖాతాలో వేసుకున్నాడు. భారీ సిక్సర్లు కొట్టడంలో డేవిడ్ దిట్ట. సీనియర్ లెవెల్లో ఇప్పటికే 77 సిక్స్‌లు బాదాడు. 25 ఏళ్ల డేవిడ్.. బీబీఎల్‌లో హోబర్ట్ హరికేన్స్, పెర్త్ స్కాచర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. డేవిడ్ తండ్రి రాడ్ డేవిడ్ కూడా సింగపూర్ మాజీ క్రికెటర్. సింగపూర్ పౌరసత్వం ఉన్న డేవిడ్ ఫ్యామిలీ.. పెర్త్‌లో (ఆస్ట్రేలియా) స్థిరపడింది.
29న యూఏఈకి ఆర్‌సీబీ
ఆర్‌సీబీలోని మిగతా ఇండియన్ ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, టీమ్ మేనేజ్‌మెంట్ శనివారం బెంగళూరుకు చేరుకున్నారు. ఏడు రోజుల క్వారంటైన్ తర్వాత ఈ నెల 29న యూఏఈ బయలుదేరుతారు. మిగతా ఇంటర్నేషనల్ ప్లేయర్లు 29 నుంచి అక్కడికి చేరుకుంటారు.
హేజిల్‌వుడ్ వస్తున్నడు..
ఐపీఎల్14 రీస్టార్ట్‌కు టైమ్ దగ్గరపడుతున్న వేళ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓ గుడ్ న్యూస్. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్.. సెకండ్ ఫేజ్ మ్యాచ్‌లకు చెన్నైకు అందుబాటులో ఉండనున్నాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. సీఎస్‌కే హేజిల్‌వుడ్‌ను 2020లో రూ.2 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో మూడు మ్యాచ్‌లే ఆడిన తను ఐపీఎల్ 14 సీజన్ ఫస్ట్ ఫేజ్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో జోష్‌కు రీప్లేస్‌మెంట్‌గా ఆసీస్‌కే చెందిన బెరెన్‌డార్ఫ్‌ను సీఎస్‌కే టీమ్‌లోకి తీసుకుంది. కానీ బెరెన్‌డార్ఫ్ ఒక్క మ్యాచ్‌లోనూ బరిలోకి దిగలేదు. ఇప్పుడు జోష్ టీమ్‌లోకి రావడంతో టోర్నీ రీప్లేస్‌మెంట్ రూల్ ప్రకారం.. సీఎస్‌కే బెరెన్‌డార్ఫ్‌ను రిలీజ్ చేయాల్సి ఉంటుంది.
ప్రాక్టీస్‌లో ముంబై, సీఎస్‌కే బిజీబిజీ
అందరికంటే ముందే యూఏఈ చేరుకున్న సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ జట్లు.. ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో సీఎస్‌కే వరుసగా రెండో రోజు ప్రాక్టీస్ చేసింది. కెప్టెన్ ధోనీ, రైనా ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించారు. తర్వాత రెగ్యులర్ ట్రెయినింగ్ చేశారు. ఇంకోవైపు అబుదాబి బేస్‌గా ఉన్న ముంబై టీమ్.. శనివారం తమ రెండో ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. ఇక, తమ ఆటగాళ్లు, వారి ఫ్యామిలీ మెంబర్స్ కోసం ముంబై ఫ్రాంచైజీ హోటల్లో సకల సౌకర్యాలు కల్పించింది. ప్లేయర్లంతా ఒక్క చోట సేదతీరేందుకు.. పెద్ద రూమ్‌లో సోఫాలు, బీన్ బ్యాగ్స్, భారీ స్క్రీన్ ఏర్పాటు చేసింది. అందులో టేబుల్ టెన్నిస్ బోర్డ్, బాస్కెట్‌బాల్ బోర్డ్ ఏరియాతో పాటు చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లేయింగ్ ఏరియాను కేటాయించింది.
ఈ ఐదుగురిలో పంజాబ్‌కి ఎవరు..?
పంజాబ్ కింగ్స్ కూడా కొత్త ప్లేయర్ల కోసం ట్రై చేస్తోంది. జే రిచర్డ్‌సన్, రిలే మెరిడిత్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో.. వీళ్లలో ఒకరి ప్లేస్‌లో నేథన్ ఎల్లీస్‌ను తీసుకుంది. అయితే రెండో రీప్లేస్‌మెంట్ కోసం.. నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్), నవీన్ ఉల్ హక్ (అఫ్గానిస్తాన్), జాసన్ బెరెన్‌డార్ఫ్ (ఆస్ట్రేలియా), క్రిస్ గ్రీన్ ( సౌతాఫ్రికా), అంకిత్ రాజ్‌పుత్ (ఇండియా) రేస్‌లో ఉన్నారు. మరో రెండు రోజుల్లో చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే తుది నిర్ణయం తీసుకోనున్నాడని ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి.
బట్లర్ ప్లేస్‌లో ఫిలిప్స్
ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ యూఏఈలో జరగనున్న ఐపీఎల్ 14 ఫేజ్–-2కు అందుబాటులో ఉండటం లేదు. ఈ మేరకు బట్లర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజస్తాన్ రాయల్స్ శనివారం ఓ ప్రకటన చేసింది. బట్లర్ భార్య లూసీ త్వరలో తమ రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. దీంతో బట్లర్ లీగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. బట్లర్‌కు రీప్లేస్‌మెంట్‌గా న్యూజిలాండ్ టాపార్డర్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ గ్లెన్ ఫిలిప్స్‌ను రాయల్స్ జట్టులోకి తీసుకుంది.
క్యాపిటల్స్ వచ్చేసింది..
ఐపీఎల్ –14 ఫేజ్ 2 మ్యాచ్‌ల కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యూఏఈ చేరుకుంది. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన క్యాపిటల్స్ టీమ్ సాయంత్రానికి దుబాయ్‌లో ల్యాండ్ అయ్యింది. దీంతో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత ఈసారి అరబ్ గడ్డపై అడుగుపెట్టిన మూడో జట్టుగా ఢిల్లీ నిలిచింది. క్యాపిటల్స్ జట్టు దుబాయ్ బేస్‌గా ఉండనుంది. అక్కడి ఓ హోటల్లోకి ప్లేయర్లు ఎంటరవుతున్న వీడియోను ఫ్రాంచైజీ తన సోషల్ మీడియాలో పెట్టింది. భుజం గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్.. కొద్దిరోజుల క్రితమే దుబాయ్ చేరుకున్నాడు. అంతేకాకుండా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాడు. కాగా, ఢిల్లీ తమ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను కొనసాగిస్తుందా లేదంటే అయ్యర్‌కు తిరిగి బాధ్యతలు అప్పగిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.