ఉద్యోగాలలో బహుజనుల వాటా ఎంత?

ఉద్యోగాలలో బహుజనుల వాటా ఎంత?

ప్రజా సంరక్షణ, పాలన కోసం అతిపెద్ద రాజ్యాంగం ఏర్పాటు చేసుకొన్న ప్రజాస్వామ్యదేశం మనది. రాజ్యాంగబద్ధంగా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగాలనే సిద్ధాంతం మనది. కానీ ఆధిపత్య వర్గాల పార్టీలు నడిపే ప్రభుత్వాలు రాజ్యాంగం కల్పించిన హక్కులను, రిజర్వేషన్లను అలంకార ప్రాయం చేశాయి. నాటి నుంచి నేటి వరకు మోడువారిన బతుకులే మిగిలాయి బహుజనులకు. పేరుకే రాజ్యాంగంలో రిజర్వేషన్లు.. పెత్తనమంతా పెద్దోళ్ల చేతుల్లోనే.. రిజర్వేషన్ల పేరుతో ఉత్తుత్తి ఉద్యోగాలు బహుజనులకు.. ఉన్నతమైన పదవులు, పోస్టులన్నీ ఆధిపత్య వర్గాలకు దక్కుతున్నాయి.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగంలో పేర్కొన్నారు. దేశంలో ఎస్టీలకు 7.5 శాతం, ఎస్సీలకు 15 శాతం, బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇవి రాజ్యాంగం ప్రకారం హక్కుగా వచ్చినవి. అయితే ప్రస్తుతం అమలు చేస్తున్న రిజర్వేషన్ల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జరగవల్సినంత మేలు జరగలేదు. విద్యా, ఉద్యోగాలలో వారికి న్యాయంగా రావల్సిన వాటాలో సగం కూడా దక్కలేదు. ఈ రిజర్వేషన్లు ఆ వర్గాలు ఎంత శాతం అనుభవిస్తున్నాయి.? అలాగే ఏ రిజర్వేషన్లు లేకుండానే ఆధిపత్య, ఉన్నత కులాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పదవులు అత్యధికంగా ఎట్ల దక్కించుకున్నాయి? అన్నవి పరిశీలిస్తే అసలు నిజాలు ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి.  కేంద్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్స్​లో ఉన్న లెక్కల ప్రకారమే ఏయే కులాలకు ఎంత శాతం ఉద్యోగాలు దక్కాయంటే..

  • ప్రెసిడెంట్ సెక్రటేరియట్‌‌లో మొత్తం 49 పోస్టులు ఉంటే వాటిలో 45 మంది అధికారులు ఉన్నత వర్గం వారే ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు నలుగురు ఉన్నారు. ఓబీసీలు ఒక్కరు కూడా లేరు. 
  • వైస్​ప్రెసిడెంట్ సెక్రటేరియట్​లోని మొత్తం ఏడు పోస్టుల్లో అందరూ ఆధిపత్య వర్గాల అధికారులే ఉన్నారు.
  • ప్రధానమంత్రి ఆఫీసులో మొత్తం పోస్టులు 35 ఉండగా, ఇందులో 33 పోస్టుల్లో అధిపత్య కులాల వారు,  2 పోస్టుల్లో ఎస్టీ, ఎస్సీలు ఉన్నారు. ఓబీసీలు ఎవరూ లేరు. 
  • సుప్రీం కోర్టు న్యాయమూర్తులు 23 మంది ఉన్నారు. వీరిలో 22 మంది ఓసీ వర్గాల వారు కాగా ఎస్సీ వర్గం నుంచి ఒకరు ఉన్నారు. ఎస్టీ, ఓబీసీల నుంచి ఒక్కరు కూడా లేరు. 
  • గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్‌‌ పదవులు 27 ఉన్నాయి, ఇందులో 25 మంది ఓసీ కులాల వారే ఉన్నారు. ఎస్సీ ఎస్టీల నుంచి ఒక్కరు కూడా లే-రు. ఓబీసీ వర్గాలకు రెండు పదవులు కేటాయించారు. 
  • కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్​ విభాగంలో మొత్తం పోస్టులు 20 ఉంటే, 19 పోస్టుల్లో ఉన్నత వర్గం వారే ఉన్నారు. ఎస్సీ, ఎస్టీల నుంచి ఒకరు, ఓబీసీ వర్గాల నుంచి ఎవరూ లేరు. 
  • కేంద్ర వ్యవసాయ, నీటిపారుదల శాఖ కార్యాలయంలో పోస్టులు 274 ఉంటే, వాటిలో 259 పోస్టులు ఉన్నత వర్గాలవే. ఎస్సీ, ఎస్టీలకు-15 ఇవ్వగా ఓబీసీలకు ఏమీ లేవు.
  • రక్షణ మంత్రిత్వ శాఖ పేషీలో పోస్టులు 1379 ఉంటే అందులో 1331 ఉన్నత కులాల వారే ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలు -48 మంది ఉండగా ఓబీసీ లేరు.
  • సాంఘిక సంక్షేమ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆఫీసులో పోస్టులు 209.  వాటిలో 192  పోస్టుల్లో ఉన్నత వర్గాల వారే ఉన్నారు. ఎస్టీ, ఎస్సీ అధికారులు17 మంది కాగా ఓబీసీలు ఎవరూ లేరు.
  • ఆర్థిక మంత్రిత్వ శాఖలో పేషీలో పోస్టులు 1008 ఉంటే అందులో 942 పోస్టుల్లో ఉన్నత వర్గాల అధికారులే ఉన్నారు. ఎస్సీ, ఎస్టీల నుంచి 66 మంది, ఓబీసీల నుంచి ఎవరూ లేరు.
  • హోం శాఖ కార్యాలయంలో మొత్తం పోస్టులు 409 ఉంటే అందులో 377 మంది ఉన్నత వర్గాలే ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ -అధికారులు 19 మంది కాగా ఓబీసీల నుంచి -13 మంది ఉన్నారు.
  • కార్మిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో పోస్టులు 74 కాగా, 70 మంది ఉన్నత వర్గాల వారే ఉన్నారు. ఎస్సీ, ఎస్టీల నుంచి- నలుగురు, ఓబీసీల నుంచి ఒక్కరు కూడా లేరు.
  • రసాయన, పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆఫీసులో 121పోస్టులు ఉండగా, 112 పోస్టుల్లో ఉన్నత వర్గాలే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తొమ్మిది కేటాయించగా ఓబీసీలకు ఒక్కటీ ఇవ్వలేదు.
  • విదేశాలలో రాయబారి ఉద్యోగాలు 140 ఉంటే అందులో 140 మంది ఉన్నత వర్గాల అధికారులే ఉన్నారు. ఇతర వర్గాలకు ఒక్క పోస్టు కూడా కేటాయించలేదు.
  • కేంద్రం పరిధిలోని యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్ పదవులు108 ఉండగా... మొత్తం పదవులు అధిపత్య వర్గాలకే ఇచ్చారు. 
  • ప్రిన్సిపల్ సెక్రటరీ పదవులు 26 ఉంటే, అన్ని ఓసీలకే ఇచ్చారు.
  • కేంద్ర సర్వీసుల్లో 3600 ఐఏఎస్ అధికారులు ఉండగా. వారిలో ఉన్నత వర్గాల నుంచి 2950 మంది, ఎస్సీ, ఎస్టీల నుంచి 600 మంది, ఓబీసీల నుంచి 50 మంది ఉన్నారు.
  • పీటీఐలో మొత్తం ఉద్యోగాలు 2700 . ఇందులో ఓసీలే పనిచేస్తున్నారు. ఇతరులెవరూ లేరు.

రిజర్వేషన్ ఉన్నా.. ఉద్యోగాలు రాలే

రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఉన్నా బహుజన వర్గాలకు వచ్చిన ఉద్యోగాలు ఎన్ని? ఇంకోదిక్కు ఎటువంటి రిజర్వేషన్ లేకుండానే ఆధిపత్య వర్గాలు అత్యధిక ఉద్యోగాలు ఎట్లా పొందారు? ఇంత అంతరం ఎందుకు ఉంది. అధికారం ఆధిపత్య వర్గాల చేతిలో ఉండటం వల్ల ఏదో ఒక రీతిలో వారు లబ్ధిపొందడమే దీనికి ప్రధాన కారణం. అట్లనే వ్యవస్థలో అగ్రభాగాన ఉండి దేశ సంపదను మొత్తం వారి హస్తగతం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా కంపెనీలు, ఫ్యాక్టరీలు, వ్యాపారాలు, సినిమాలు, హోల్ సేల్ బిజినెస్. షాపింగ్ మాల్స్, యార్డులు. భూములు, ప్రైవేట్ బ్యాంకులు, మిల్లులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు ఇట్ల.. ఇంకా ఎన్నో వారి ఆధీనంలో ఉన్నాయి. దేశ సంపదలో 85 శాతం ఆధిపత్యవర్గాల చేతుల్లో ఉంది. అయినా ఇంకా పేదరిక నిర్ములన కోసమంటూ.. రాజ్యాంగ సవరణ చేసి 10 శాతం రిజర్వేషన్లు కల్పించుకున్నారు.  సామాజిక వెనుకబాటుతనం వల్ల అన్ని రంగాల్లో అట్టడుగున ఉండడాన్ని దృష్టిలో పెట్టుకొని బహుజనులకు రిజర్వేషన్స్ కల్పించిన రాజ్యాంగ సిద్ధాంతాన్ని మార్చి..  పేదరికం పేరుతో రిజర్వేషన్స్ ఇవ్వడం ఎంత వరకు న్యాయం. ఆధిపత్య వర్గాల పాలకులు వారు ఇష్టం ఉన్నట్టుగా చట్టబద్దత కల్పించుకొని 50 శాతం ఉన్న రిజర్వేషన్స్ 60 శాతానికి పెంచి చరిత్రనే తిరిగి 
రాసుకున్నారు. వేల ఏండ్ల నుంచి శ్రమదోపిడీ, వివక్ష, పేదరికంతో కష్టాలు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల బహుజన బిడ్డలు ఇప్పుడిప్పుడే చదువు, పట్టుదలతో ఎదుగుతున్నారు. ఇలాగే ఈ బహుజనం అంతా ఐక్యంగా అధికారం వైపు అడుగులు వేయాలి. 

సంచార, విముక్త జాతులపై వివక్ష ఎందుకు

అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగితేనే ప్రజాస్వామ్య పాలన అవుతుంది.  సంచార, విముక్త జాతుల అభివృద్ధి కోసం 13 ఏండ్ల కింద కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణ రేణుకే జాతీయ కమిషన్ వేసింది. కమిషన్ దేశవ్యాప్తంగా తిరిగి సంచార, విముక్త జాతుల స్థితిగతులను పరిశీలించి.. వీరు జనాభాలో 10 నుంచి 12 శాతం వరకు ఉన్నారని, అన్ని విధాలుగా, అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని కమిషన్ నివేదిక ఇచ్చింది. ప్రత్యేకంగా వీరికి 10 శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలని, అలాగే వారి అభివృద్ధి కోసం 80 రకాల ప్రతిపాదనలు చేసింది. అయితే 2008 నుంచి ఇప్పటిదాకా దాని పరిస్థితి ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్లుంది. దేశంలో ప్రజాస్వామ్య పాలన ఉందనుకుంటే.. చట్టబద్ధంగా కమిషన్ వేసిన ప్రభుత్వం అది ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎందుకు వారికి రిజర్వేషన్స్ కల్పించలేదు. ఇది ఆధిపత్య వర్గాల పాలకులు చూపే వివక్ష కాదా?

- శ్రీనివాస్ తిపిరిశెట్టి, సీనియర్ జర్నలిస్ట్