ఈ ఊళ్లో ఒక్కరో ఇద్దరో కాదు అందరు కబడ్డి ప్లేయర్లే

ఈ ఊళ్లో ఒక్కరో ఇద్దరో కాదు అందరు కబడ్డి ప్లేయర్లే

ఆటలంటే అందరికీ ఇష్టమే. కాకపోతే ఒక్కొక్కరికీ ఒక్కో ఆటలో స్పెషల్​ ఇంట్రెస్ట్​ ఉంటుంది. కానీ, ఈ ఊళ్లో ఒక్కరో ఇద్దరో కాదు అందరి ఇంట్రెస్ట్​ ఒక్కటే. అదే కబడ్డీ. ఇక్కడ ఏ ఇంటికెళ్లినా కబడ్డి.. కబడ్డి.. కూతే వినపడుతుంది. ఉడుం పట్లు కనిపిస్తాయి. ప్లేయర్లు జర్రున రైడర్​ని​ అందుకుంటుంటే..చూసేవాళ్లకే చెమటలు పడతాయి. వాళ్ల ప్రతిభ ఆ ఊరికే పరిమితం కాలేదు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ సత్తా చాటారు. ఎన్నో పతకాలు గెలుచుకున్నారు. కబడ్డీ కూతతో మారు మోగుతున్న ఈ ఊరి పేరు బురదపల్లి. 

నిర్మల్ జిల్లా మామడ మండలంలో ఉన్న ఓ మారుమూల ఆదివాసీ గూడెం బురదపల్లి.  గోండు బిడ్డలు ఉండే ఈ ఊరిని ఒకప్పుడు అన్నలకు షెల్టర్​ జోన్​గా పిలిచేవాళ్లు. అలాంటి ఊరు ఇప్పుడు స్పోర్ట్స్​ విలేజ్​గా మారింది. దీనికి కారణం కబడ్డీ ఆటని వీళ్లు తమ ఊరి ఆనవాయితీల్లో ఒకటిగా చూడటమే. ఆ ఆనవాయితీనే ఇప్పుడు ఈ ఊరి కుర్రాళ్లని పతకాల వైపు పరుగులు పెట్టిస్తోంది. అయితే దీనంతటికి కారణమైన కోచ్​ ఆడే రాములు గురించి  ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
పతకాలు గెలుచుకుంటున్నరు

కబడ్డీ  ఇక్కడ ఎప్పుడు మొదలైందో తెలియదు. కానీ.. ఈ ఊరి ఆటకి ప్రాణం పోసింది మాత్రం రాములు. తన తండ్రి నుంచి వారసత్వంగా కబడ్డీ నేర్చుకున్నాడు రాములు. లోకల్​ పోటీల్లోనూ పాల్గొన్నాడు. తనలా కబడ్డీని  ప్రేమించేవాళ్ల కోసం ఇరవైయేండ్ల కిందట కోచ్​గా కూడా మారాడు. అది కూడా ఫ్రీగా.  ఊళ్లో దాదాపు ఆరు  టీమ్​లు తయారుచేశాడు. అలా రాములు దగ్గర కోచింగ్​ తీసుకున్న మనోజ్​కుమార్ ఉత్తరప్రదేశ్ లో జరిగిన జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో పతకం గెలుచుకున్నాడు. అలాగే మరో  ప్లేయర్​ ఆడే రవి జార్ఖండ్​లో జరిగిన జాతీయ స్థాయి కబడ్డీ  పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున మెడల్స్ సాధించాడు . సిడాం రంభ అనే  అమ్మాయి  కూడా కబడ్డీలో జిల్లాస్థాయిలో మెడల్స్​ గెలుచుకుంది.

కాంపిటీషన్స్

బురదపల్లి  సర్పంచ్​తో పాటు ఆదివాసీ కులపెద్ద పటేల్ కూడా కబడ్డీ ప్లేయరే. దాంతో  ఈ ఊరి పిల్లలకి కబడ్డీ మరింత దగ్గరైంది. వాళ్ల సాయంతో ఊరిలో పోటీలు కూడాపెడుతున్నాడు రాములు. పండుగలు, సెలవు రోజుల్లో ఊళ్లోని టీమ్​ల మధ్య కబడ్డీ పోటీలుపెడుతున్నాడు. ముఖ్యంగా ఈ ఊళ్లో గణేశ్ నవరాత్రులకి వారం రోజులు జరిగే కబడ్డీ టోర్నమెంట్ చాలా ప్రత్యేకం. ఈ టోర్నమెంట్​కు చుట్టుపక్కల గ్రామాల్లోని గిరిజనులంతా వస్తారు. పోటాపోటీగా జరిగే ఆ కాంపిటీషన్​ చూసేవాళ్ల గుండె చప్పుడు వేగం పెరగడం ఖాయం. రానున్న రోజుల్లో మరింత మందిని కబడ్డీ వైపు నడిపిస్తా అంటున్నాడు రాములు. 
::: జె.మనోజ్ కుమార్ ,నిర్మల్​, వెలుగు