హుజురాబాద్ చుట్టే రాష్ట్ర రాజకీయాలు..నేతల చక్కర్లు

హుజురాబాద్ చుట్టే రాష్ట్ర రాజకీయాలు..నేతల చక్కర్లు
  • దళిత బంధు స్కీంపై టీఆర్​ఎస్​ సంబురాలు
  • రాష్ట్రంలోని దళితులందరికీ ఇవ్వాలంటున్న ప్రతిపక్షాలు

హైదరాబాద్​, వెలుగు: నెల రోజులుగా రాష్ట్రంలోని రాజకీయాలన్నీ హుజూరాబాద్​ చుట్టే  తిరుగుతున్నాయి. అన్ని ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమైన లీడర్లంతా ఈ సెంటర్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. బై ఎలక్షన్​ షెడ్యూలు రాకముందే నియోజకవర్గంలోని  గ్రామ గ్రామాన టీఆర్​ఎస్​, బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అదే టైమ్ లో కులాలు, సంఘాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు టీఆర్​ఎస్​ చేస్తున్న ప్రయత్నాలు ఎన్నికల స్టంట్లను తలపిస్తున్నాయి. ఏదడిగితే అది ఇస్తామంటూ హుజూరాబాద్​ నియోజకవర్గంపై ప్రభుత్వం తరఫున వేలాది కోట్ల నిధులను కుమ్మరించే పని పెట్టుకుంది. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ కొత్త స్కీమ్​లు, పాత హామీలన్నింటికీ పదునుపెట్టారు.​ కొత్త రేషన్​కార్డులు, ఆసరా పెన్షన్లు, దళిత బంధు పథకం, స్పెషల్​ డెవలప్​మెంట్​ ఫండ్, 50 వేల ఉద్యోగాలు అంటూ ఆయన హడావుడిగా అనౌన్స్​ చేయటం రాష్ట్రమంతటా హీటెక్కించింది. దళిత బంధు స్కీంకు హుజూరాబాద్​నే పైలట్​ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం, ఇక్కడ రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పడం దళితుల ఓట్లకు గాలం వేయడం కోసమేనని ప్రతిపక్షాలు అంటున్నాయి.  చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి పథకం కింద రూ. 10 లక్షలు కేటాయించాలని, ఎన్నికల స్టంట్​గా మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాయి. ఏడేండ్లుగా దళితులను కేసీఆర్​ మోసం చేస్తున్నారని, ఈ పథకం కూడా అందులో భాగమేనని అంటున్నాయి. మరోదిక్కు టీఆర్​ఎస్​ లీడర్లు రోడ్ల మీదికి వచ్చి డప్పులు కొడుతూ, డ్యాన్స్​లు చేస్తూ సంబురాలు జరుపుకున్నారు. కేసీఆర్​ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. 

గులాబీ ప్రయోగాలు

హుజూరాబాద్​లో అధికార పార్టీ రోజుకో  ప్రయోగం చేస్తోంది. ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం కావటంతో కేసీఆర్, హరీశ్​, కేటీఆర్​ మంతనాలు జరుపుతున్నారు.లోకల్ గా లీడర్లను సమీకరించి, ఇతర పార్టీల లీడర్లను తమవైపు తిప్పుకుంటూ ప్రచారం చేసే పనిని మంత్రి గంగుల కమలాకర్‌‌కు అప్పగించారు  అక్కడ కులాలు, ఎక్కువ ఓట్లున్న  కుటుంబాలను  ప్రభావితం చేసేందుకు ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు పోటీ పడుతున్నారు. నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న దళితుల ఓట్లు, చేనేత కార్మికుల ఓట్లపై ఫోకస్​ పెట్టారు. చేనేత ఓటర్లను ఆకట్టుకునేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌‌. రమణను కేసీఆర్ స్వయంగా​టీఆర్​ఎస్​లోకి ఆహ్వానించి గులాబీ కండువా కప్పారు. అదేరోజు టీజేఎస్‌‌ పొలిట్‌‌ బ్యూరో మెంబర్‌‌ శ్రీశైల్‌‌రెడ్డి, హుజూరాబాద్‌‌కు చెందిన నాయకుడు శ్రీధర్‌‌ను పార్టీలో చేర్చుకున్నారు. అక్కడి మున్సిపల్​ లీడర్లు, జెడ్పీటీసీ మెంబర్లు, ఎంపీపీలను కేసీఆర్​ ఏకంగా ప్రగతిభవన్​కు పిలుపించుకొని మాట్లాడారు.  

ప్రచారానికి రానున్న అమిత్​షా.. బీజేపీలో మరింత జోష్​

ఈటల రాజేందర్​ తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి  రాజీనామా చేసిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలన్నీ ఆసక్తికరంగా మలుపులు తిరుగుతున్నాయి. ఆయన రాజీనామాతో హుజూరాబాద్​లో త్వరలో బై ఎలక్షన్​ జరుగనుండటంతో  అన్ని పార్టీలు అడ్వాన్సుగానే  అక్కడ  మకాం పెట్టాయి. టీఆర్​ఎస్​ను వీడిన ఈటల బీజేపీలో చేరటం, బీజేపీ తరఫున పోటీకి సిద్ధమవుతుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పార్టీ నేతలతో ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ఆయన  కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవటం,  ప్రచారానికి వస్తానని అమిత్​షా హామీ ఇవ్వటంతో బీజేపీలో మరింత జోష్​ పెరిగింది. ఈటల రాజేందర్ సోమవారం నుంచి నియోజకవర్గంలో పాదయాత్రను స్టార్ట్​ చేశారు. 

అభ్యర్థి కోసం కాంగ్రెస్​ వెతుకులాట

త్వరలో జరుగనున్న హుజూరాబాద్​ ఎన్నిక ఇప్పటికే కాంగ్రెస్​కు షాక్​ ఇచ్చింది. ముందునుంచీ ఈటల రాజేందర్​పై విమర్శలు చేసిన హుజూరాబాద్​ నియోజకవర్గ కాంగ్రెస్​ ఇన్​చార్జి కౌశిక్​రెడ్డి త్వరలో గులాబీ గూటికి చేరుకునే  చాన్స్​ ఉంది. కాంగ్రెస్​లో ఉండగానే తనకు టీఆర్​ఎస్  టికెట్​ వస్తుందని మాట్లాడిన ఆయన ఫోన్​కాల్​ రికార్డు లీకవటం కాంగ్రెస్​లో  కలకలం రేపింది. కాల్​ రికార్డు లీకైన రోజే  టీఆర్​ఎస్​ లీడర్ల సూచనతో కాంగ్రెస్​కు రాజీనామా చేసిన కౌశిక్​ రేపోమాపో గులాబీ కండువా కప్పుకునే అవకాశాలున్నాయి. దీంతో  కాంగ్రెస్​ పార్టీ హుజూరాబాద్​లో  అభ్యర్థిని వెతుక్కునే పనిలో పడింది. ఇదే టైమ్​లో పీసీసీ కొత్త చీఫ్​గా రేవంత్​రెడ్డి  బాధ్యతలు చేపట్టడంతో పార్టీ నేతల్లోనూ ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. 

ఎలక్షన్ బంధు మాత్రమే..

ఇది దళిత బంధు కాదు.. ఎలక్షన్​ బంధు మాత్రమే. దళితులకు మూడెకరాల భూమి, దళిత సీఎం, బ్యాక్​లాగ్​ పోస్టులు ఎటు పోయినయ్. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఎటుపోతున్నయ్?ఎలక్షన్​ అయినంక దళిత బంధును కూడా అటకెక్కిస్తడు. 
‑ అద్దంకి దయాకర్, కాంగ్రెస్ లీడర్

కేసీఆర్ నాటకం

హుజూరాబాద్​లో ఎట్లయినా గెలవాలని కేసీఆర్ దళిత బంధు స్కీమ్ తెచ్చారు. ఏడేండ్లుగా దళితులను ఎన్నో రకాలుగా మోసం చేస్తూ, అవమానాలకు గురిచేస్తూ ఇప్పుడు ఎన్నికలు రాగానే తాయిలాలు ఇస్తే మోసపోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు.

దళితుల అభివృద్ధిపై కేసీఆర్​కు చిత్తశుద్ధి ఉంటే హుజూరాబాద్​ లెక్కనే ప్రతి సెగ్మెంట్​కు రూ.2 వేల కోట్లు కేటాయించాలి. దళిత బంధు స్కీంను రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి వర్తింపజేయాలి. ఎలక్షన్​ స్టంట్​గా దీన్ని మార్చొద్దు. ఎన్నికల ముందు వాగ్దానం చేయటం.. మరిచిపోవటం సీఎంకు అలవాటే. ఆయన మోసగాడు. ఈ స్కీంను రాష్ట్రంలోని దళితులు అందరికీ ఇస్తారన్న నమ్మకం లేదు.
‑ వివేక్​ వెంకటస్వామి, బీజేపీ కోర్​ కమిటీ మెంబర్​

కేసీఆర్​ను తరతరాలు గుర్తుంచుకుంటరు

దళిత బంధు సాహసోపేతమైంది, ఇంతమంచి స్కీమ్ తెచ్చిన కేసీఆర్‌ను తరతరాలు గుర్తుంచు కుంటరు. దళితుల కోసం ఇలాంటి పథకాన్ని తీసుకువచ్చింది దేశంలో సీఎం కేసీఆర్‌ ఒక్కరే.  ఈ స్కీం గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది. 
‑ టీఆర్​ఎస్​ నేత, ఎల్​.రమణ