నిజాం సైనికులు, రజాకార్ల దురాగతాలపై పోరాటం

నిజాం సైనికులు, రజాకార్ల దురాగతాలపై పోరాటం

మహబూబాబాద్‌‌‌‌, వెలుగు: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పల్లెలన్నీ కదం తొక్కాయి. నిజాం సైనికులు, రజాకార్ల దురాగతాలపై పోరాడాయి. అలాంటి ఒక పల్లెనే మహబూబాబాద్‌‌ జిల్లా డోర్నకల్‌‌ ‌‌మండలంలోని పెరుమాండ్ల సంకీస. ఈ గ్రామ ప్రజలు నిజాం నిరంకుశ విధానాలను ఎదురించారు. కమ్యూనిస్టులతో కలిసి పోరాటానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం సాయుధ శిక్షణ తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నిజాం సైనికులు, రజాకార్లు ఓ రోజు రాత్రి ఊరిపై విరుచుకుపడ్డారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. రైతులను బంధించి కాల్పులు జరిపారు. కొన ఊపిరితో ఉన్న మరికొంత మందిని గడ్డికుప్పల్లో వేసి సజీవంగా తగులబెట్టారు. ఈ ఘటనలో 21 మంది అమరులయ్యారు. కూరపాటి సత్తయ్య, గండు ముత్తయ్య, కాసం లక్ష్మీనర్సయ్య, బీరెడ్డి నర్సయ్య, దేశబోయిన వీర వెంకటయ్య, కనకం కిష్టయ్య, కనకం సర్వయ్య, గుండ్రాతి రామయ్య, తేరాల గురువయ్య, రామయ్య, బాలయ్య, నాయిని అప్పయ్య, సోమనబోయిన రాములు, శెట్టి పెద్దనర్సయ్య, రామయ్య, చిన్న నర్సయ్య, దాసరి కిష్టయ్య ప్రాణాలర్పించారు. 

నెల్లికుదురు ఠాణాపై వీరోచిత దాడి.. 
ఇదే జిల్లాలో నిజాం సైనికులు, రజాకార్లపై కమ్యూనిస్టులు పోరాడి కీలక విజయం సాధించారు. పల్లెల్లో రజాకార్ల అకృత్యాలు పెరిగిపోవడంతో జిల్లాలోని గెరిల్లా దళాలు నెల్లికుదురు మండల కేంద్రంలోని ఠాణాపై దాడి చేయాలని నిర్ణయించాయి. ఓ రోజు రాత్రి కత్తులు, కర్రలు, కారం పొడి, బాంబులతో ఠాణాపై విరుచుకుపడ్డాయి. ఆనిక్కాయ బుర్రలో ఎండు మిరపకాయలు నింపి, అందులో నిప్పులు వేసి ఠాణాపై విసిరాయి. మూడ్రోజుల పాటు కాల్పులు కొనసాగాయి. చివరకు నాలుగో రోజు నిజాం సైనికులు, రజాకార్లు లొంగిపోయారు.