వార్డు మెంబర్లంతా ఒక్క సామాజిక వర్గం వారే..!

వార్డు మెంబర్లంతా ఒక్క సామాజిక వర్గం వారే..!
  • గెలుపొందిన ఎస్సీ వర్గానికి చెందిన వార్డు మెంబర్లు
  • ఎస్సీ కాలనీలోని వార్డు స్థానాలు జనరల్ 
  • బీసీ కాలనీలోని వార్డు స్థానాలు ఎస్సీ రిజర్వుడ్​
  • జనరల్​ స్థానాల్లో ఒక్క బీసీ గెలువలే

గద్వాల, వెలుగు : ఒక గ్రామ పంచాయతీలోని 10 వార్డు స్థానాలకు 10 ఒకే సామాజికవర్గం (ఎస్సీ మాదిగ) దక్కించుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లా శెట్టి ఆత్మకూరు గ్రామంలో జరిగింది. మొదటి విడతలో శెట్టి ఆత్మకూరు గ్రామానికి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. సర్పంచ్ స్థానం జనరల్ రిజర్వ్ అయింది. గ్రామంలోని 10 వార్డు స్థానాలు ఉన్నాయి. 

ఒకటో నుంచి ఐదో వార్డుల వరకు ఎస్సీ కాలనీ ఉంటున్నది. ఒకటి నుంచి ఐదో వార్డు వరకు జనరల్ లేడీకి రిజర్వుడ్ అయింది. ఎస్సీ కాలనీ వార్డుల్లో ఆ సామాజికవర్గం వారే పోటీ చేయగా, అందరూ గెలిచారు. మిగతా ఆరో వార్డు నుంచి పదో వార్డు వరకు బీసీ కాలనీ ఉంటుంది. ఆరు, ఏడు, ఎనిమిదో వార్డులు ఎస్సీ జనరల్ కాగా, 9, 10వ వార్డులు ఎస్సీ లేడీకి రిజర్వుడ్ అయ్యాయి. 

ఆ స్థానాల్లో కేవలం ఎస్సీలు మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆరో నుంచి పదో వార్డు వరకు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు గెలుపొందారు. దీంతో 10కి 10 వార్డు స్థానాలు వారు గెలుపొందడం చర్చనీయాంశంగా మారింది.

సర్పంచ్ జనరల్..

శెట్టి ఆత్మకూర్ గ్రామ పంచాయతీని జనరల్ కేటగిరీలో సర్పంచ్ పదవి రిజర్మ్ అయింది. దీంతో బీసీ వర్గాలకు చెందిన భాగ్యలక్ష్మి, ముష్టి రవి పోటీ పడగా, భాగ్యలక్ష్మి గెలుపొందింది. గ్రామంలో పాత పంచాయతీ భవనం ఉండగా, దానిని తొలగించారు. ప్రస్తుతం కిరాయి బిల్డింగ్​లో  పంచాయతీ 
ఆఫీస్ కొనసాగుతోంది.