googleను ఢీకొట్టే ఫీచర్స్తో openai ఛాట్ బోట్

googleను ఢీకొట్టే ఫీచర్స్తో openai ఛాట్ బోట్

ఛాట్ జీపీటీ (జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్) .. ఇది లాగ్వేంజ్ ప్రాసెసింగ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ఒక ఛాట్ బోట్. దీని ప్రత్యేకత ఏమిటంటే మనం అడిగే ప్రశ్నలు/సందేహాలకు అచ్చం మనిషిలా స్పందించి.. మనిషిలా ఆలోచించి వివరణాత్మక సమాధానాలను టెక్స్ట్ రూపంలో ఇస్తుంది. ఇందుకోసం కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఎన్నోరకాల సోర్స్ లను జల్లెడపట్టి.. అత్యంత వేగంగా వాటిలోని అత్యుత్తమ సోర్స్ నుంచి సమాచారాన్ని వడపోసి సమాధానాన్ని మన కళ్ల ఎదుట ప్రత్యక్షం చేస్తుంది. అంతేకాదండోయ్!!  మనం అడిగిన ఒక ప్రశ్న ఆధారంగా.. తదుపరిగా మనం అడిగే అవకాశమున్న ప్రశ్నలను కూడా సిద్ధం చేసుకొని వాటికి సమాధానాలను చూపిస్తుంది.  ఈ అధునాతన టెక్నాలజికల్ ప్రోడక్ట్ ను అమెరికా కంపెనీ ఓపెన్ ఏఐ అభివృద్ధి చేసింది. 

పైథాన్ కోడ్ ను కూడా..

అత్యంత క్లిష్టంగా ఉండే పైథాన్ కోడ్ ను కూడా మనం ఇచ్చే సూచనలకు అనుగుణంగా రాసి పెట్టగల సామర్థ్యం ఓపెన్ ఏఐ ఛాట్ జీపీటీకి సొంతం.  వ్యక్తులు, వ్యాపార సంస్థల మధ్య జరిగే కాంట్రాక్టు పేపర్ల ముసాయిదాలను కూడా ఇది నీట్ గా, ఫాస్ట్ గా  రాసిపెట్టగలదు. మీ షరతులు, నిబంధనలు చెబితే అందుకు అనుగుణంగా అగ్రిమెంట్ పేపర్లను ఛాట్ జీపీటీ డ్రాఫ్టింగ్ చేసిపెడుతుంది.  అయితే ఈక్రమంలో కొన్నిసార్లు తప్పులు చేసే అవకాశం కూడా ఉంటుంది. 

జర్నలిస్టులు, సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్ల ఉద్యోగాలకు గండం..

ఛాట్ జీపీటీలో ప్రస్తుతమున్న కొన్ని లోపాలను సరిదిద్దగలిగితే మాత్రం.. భవిష్యత్తులో జర్నలిస్టులు, సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్లు వంటి నిపుణులకు ప్రత్యామ్నాయంగా అవతరించే చాన్స్ ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇంకొందరైతే మరో అడుగు ముందుకు వేసి ఛాట్ జీపీటీ ప్లాట్‌ఫామ్ భవిష్యత్తులో గూగుల్​ సెర్చింజన్ ను సైతం రీప్లేస్​ చేయగలదని  లెక్కలు కడుతున్నారు. చాలా మంది తమ ప్రశ్నలకు సమాధాన కోసం గూగుల్‌ ను సెర్చ్ చేస్తుంటారు. ఇదే పని కోసం మనం ChatGPTని కూడా వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

వారంలోపే 10 లక్షల యూజర్లు

పబ్లిక్ బీటా టెస్టింగ్​ కోసం చాట్​ జీపీటీ ప్లాట్‌ఫామ్ ను డిసెంబరు 1న అందుబాటులోకి తెచ్చారు. అందుబాటులోకి వచ్చిన వారంలోపే దీని వినియోగం కోసం 10 లక్షల మందికిపై యూజర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రస్తుతానికి దీన్ని ఉచితంగా వాడుకోవచ్చు. మీరు కూడా openai  చాట్ జీపీటీ సేవలను పొందేందుకు అకౌంట్ ను క్రియేట్ చేసుకోవచ్చు. ఓపెన్ ఏఐ  కంపెనీ భవిష్యత్తులో చాట్​ జీపీటీ ప్లాట్‌ఫామ్‌ ను మానిటైజ్ చేయనుందని, ప్రస్తుతం రిసెర్చ్​ ప్రివ్యూ మాత్రమే ఉచితంగా లభిస్తుందని OpenAI  సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో సబ్‌స్క్రిప్షన్‌ ​ఛార్జీలు అమలు చేసి.. ఓపెన్ ఏఐ నుంచి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తున్నామని చెప్పారు.

వ్యవస్థాపకుల్లో ఎలాన్ మస్క్ ..

ఓపెన్ ఏఐ కంపెనీ వ్యవస్థాపకుల్లో ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్  కూడా ఒకరు. 2015 సంవత్సరంలో సామ్ ఆల్ట్‌మాన్ అనే మరో టెక్ నిపుణుడితో కలిసి ఈ కంపెనీని మస్క్ స్థాపించారు. అయితే 2018 ఫిబ్రవరిలో కంపెనీ బోర్డు డైరెక్టర్ పదవికి మస్క్ రాజీనామా చేశారు. అయితే ఓపెన్ ఏఐ కంపెనీ దాతగా తన పేరును మస్క్ ఇంకా కొనసాగిస్తున్నారు. ఓపెన్ ఏఐ కంపెనీలో అపర కుబేరుడు బిల్ గేట్స్ కు చెందిన మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది.