కేయూ మాజీ వీసీ రమేశ్ విజిలెన్స్ ఎంక్వైరీ ఏమైంది..? ఏడాది కావస్తున్నా ఎటూ తేల్చలే..!

కేయూ మాజీ వీసీ రమేశ్ విజిలెన్స్ ఎంక్వైరీ ఏమైంది..? ఏడాది కావస్తున్నా ఎటూ తేల్చలే..!

హనుమకొండ, వెలుగు: వరంగల్‎లోని కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.తాటికొండ రమేశ్​హయాంలో జరిగిన అక్రమాలపై వేసిన విజిలెన్స్ ఎంక్వైరీపై యాక్షన్ ఉంటుందా..! ఉండదా..! అనే సస్పెన్స్ నెలకొంది. వర్సిటీ వీసీగా నియామకమైనప్పటి నుంచి ఆయన వివాదాలకు కేరాఫ్​అడ్రస్​గా మారారు. సీనియర్ ​ప్రొఫెసర్ గా ప్రమోషన్​, ఫార్మసీ కాలేజీలకు అడ్డగోలు పర్మిషన్లు, పీహెచ్​డీ సీట్ల భర్తీలో అక్రమాలు, కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపులకు కమీషన్లు తీసుకుంటూ వర్సిటీకి చెందిన ఓ ఆఫీసర్ ​ఏసీబీకి పట్టుబడడం.. ఇలా వరుస వివాదాలతో తన మూడేండ్ల పదవీకాలంలో వర్సిటీ అపవాదులనే మూటగట్టుకుంది. 

వీసీ అవినీతి, అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గతేడాది మే18న వీసీపై రాష్ట్ర సర్కార్ విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. రిపోర్ట్ ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్​తీసకోకపోవడంతో ఆరోపణలు వస్తున్నాయి. 

నియామకం నుంచే వరుస ఆరోపణలు  

2021 మే లో వర్సిటీ వీసీగా రమేశ్ నియమితులైనప్పటి నుంచే వరుసగా ఆరోపణలు వచ్చాయి. వీసీగా కావాలంటే ప్రొఫెసర్‎గా పదేండ్ల అనుభవం ఉండాలనే రూల్ ఉంది. కానీ.. అప్పటి బీఆర్ఎస్​సర్కార్ పెద్దల సపోర్టుతో ఆయన పోస్టింగ్ తెచ్చుకున్నారనే విమర్శలు వచ్చాయి. వీసీ అయ్యాక  తన పవర్స్​మిస్​యూజ్ చేసి అప్పటి రిజిస్ట్రార్ శ్రీనివాస్ రావుతో పాటు సీనియర్​ప్రొఫెసర్‏గా అక్రమ ప్రమోషన్​పొందారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్లకు 2022లో నోటిఫికేషన్​జారీ చేశారు. 

ఆ ప్రక్రియ ముగిసే వరకు వీసీ, రిజిస్ట్రార్ స్థాయి ఆఫీసర్లు ఎలాంటి పదవుల్లో ఉండకూడదనే రూల్​ఉంది. కానీ, ప్రొ.రమేశ్ అవేమీ పట్టించుకోకుండా నోటిఫికేషన్ ఇచ్చి, ప్రమోషన్ కూడా ఇచ్చుకున్నారని,  ప్రభుత్వ పర్మిషన్ లేకుండానే 16 మందిని అడ్జాంక్ట్​ ఫ్యాకల్టీగా నియమించారని, వర్సిటీ పరిధిలోని ఫార్మసీ కాలేజీలకు అడ్డగోలుగా పర్మిష న్లు ఇచ్చారనే, ఫామ్ డీ కోర్సుల్లో కాలేజీలకు అనుబంధ ఆస్పత్రులకు ఉండాలనే రూల్​పట్టించుకోకుండా  అక్రమంగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.  

బిల్లుల్లో కమీషన్లు.. పీహెచ్‎డీలో అక్రమాలు

వర్సిటీలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు కమీషన్లు డిమాండ్, గతేడాది జనవరిలో వర్సిటీకి పాలు, పెరుగు సరఫరా చేసే కాంట్రాక్టర్ కు రూ.19 లక్షల బిల్లు రిలీజ్​చేసేందుకు ఏఆర్​కృష్టయ్య రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. ఆ కమీషన్​లో వీసీకి కూడా వాటా ఉందని,  బిల్లులు ఇవ్వడం లేదనే మనోవేదనతో మరో కాంట్రాక్టర్ కాలే మధుసూదన్​చనిపోగా.. కుటుంబ సభ్యులు వీసీ బిల్డింగ్​ఎదుట ఆందోళనకు దిగి.. బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడంతోనే చనిపోయారనే తీవ్ర ఆరోపణలు చేశారు.  వర్సిటీలో ఏ పనికైనా 5 శాతం కమీషన్ తీసుకుంటారని ప్రచారంలో ఉంది. 

వర్సిటీ భూములను అసిస్టెంట్​రిజిస్ట్రార్​అశోక్ బాబు కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారని, ఇది నిజమేనని తెలిసినా వీసీ రమేశ్​ఆయనకు సపోర్ట్ చేశారనే విమర్శలు వచ్చాయి. కేయూ పీహెచ్​డీ అడ్మిషన్లలోనూ, పార్ట్ టైం లెక్చరర్లకు సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణ లు ఉన్నాయి. దీంతో  వీసీ చర్యలకు వ్యతిరేకంగా 2023 సెప్టెంబర్‎లో పీహెచ్​డీకి అర్హులైన అభ్యర్థు లు నిరసన, ఆందోళనలు చేశారు. ఆ ఆందోళనల శిబిరాన్ని  పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్​రెడ్డి సందర్శించారు. తాము అధికారంలోకి రాగానే పీహెచ్​డీ అక్రమాలపై విచారణ జరిపించి యాక్షన్​ తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

యాక్షన్​ ఉంటుందా.. ఉండదా..?

ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్​అండ్​ఎన్​ఫోర్స్ మెంట్ వరంగల్ ఏఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో కేయూలో విచారణ చేపట్టారు. వర్సిటీ భూముల కబ్జాపైనా మాజీ వీసీ రమేశ్​పై వచ్చిన ఆరోపణలపై ఎంక్వైరీ జరిపారు. కొందరు అధికారులను  ప్రత్యేకంగా విచారించి వివరాలు సేకరించారు. మాజీ వీసీపై ఆరోపణలతో అడ్మినిస్ట్రేషన్ వింగ్​నుంచి పలు కీలక వివరాలు  సేకరించారు.  అనంతరం వర్సిటీలో జరిగిన అక్రమాలపై సమగ్ర రిపోర్టును తయారు చేశారు. మూడు నెలల కింద ప్రభుత్వానికి పంపించినట్లు తెలిసింది.

విచారణకు ఆదేశించి ఏడాది పూర్తయినా ఇంతవరకు ఎలాంటి యాక్షన్​లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో అసలు నిందితులపై యాక్షన్​ ఉంటుందా..! ఉండదా..! అనే సందేహాలు వస్తున్నాయి.  విజిలెన్స్ ఎంక్వైరీని ప్రభుత్వం లైట్​తీసుకుంటుందని విద్యార్థి, ఉద్యోగ సంఘాల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టును బయటపెట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై  ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో చూడాల్సి ఉంది. 

విచారణకు ఆదేశించి ఏడాది

మాజీ వీసీ రమేశ్​అవినీతి, అక్రమాలతో పాటు సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అసోసియేషన్​ఆఫ్​కాకతీయ యూనివర్సిటీ టీచర్స్(అకుట్) ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నేతలు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో గతేడాది మే నెలలో వీసీ రమేశ్​పై విజిలెన్స్​విచారణకు ఆదేశిస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీకాలం ముగిసే సమయంలోనే విజిలెన్స్​విచారణకు ఆదేశించడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది.