
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న స్కీముల్లో లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు కొందరు ఎమ్మెల్యేలు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లబ్ధిదారులుగా చేర్చినందుకు, ప్రభుత్వం నుంచి పైసలు ఇప్పించినందుకు లంచాలు తీసుకుంటున్నరు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆరే ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో, ఆ తర్వాత పార్టీ మీటింగ్‌లో కూడా చెప్పినట్లు తెలిసింది. స్కీముల్లో చేర్చి లబ్ధి చేకూర్చినందుకు ఎమ్మెల్యేలు, వారి అనుచరులు డబ్బులు తీసుకుంటున్నట్లు ఇంటెలిజెన్స్, విజిలెన్స్ రిపోర్ట్ లలోనూ వెల్లడైంది. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసేలా గైడ్ లైన్స్ రూపొందించకుండా, ఆ బాధ్యతను నేరుగా ఎమ్మెల్యేలకే అప్పగించడంతోనే ఇదంతా జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి.
కల్యాణలక్ష్మి చెక్కుల దగ్గరి నుంచి దళితబంధు దాకా అనేక స్కీములను ప్రభుత్వం ఎమ్మెల్యేలకు లింక్ చేసింది. దీంతో అర్హులైన పేదలకు కాకుండా బీఆర్ఎస్ లీడర్లకు, కార్యకర్తలకే తొలుత లబ్ధి జరిగేలా చూస్తున్నారు. అందులోనూ స్కీమును బట్టి కమీషన్లు తీసుకుంటున్నారు. దళితబంధు స్కీమ్ లో దరఖాస్తు పెట్టుకుందామంటే ఆఫీసర్లు తీసుకుంటలేరని, ఎమ్మెల్యే దగ్గరకు పోవాలంటున్నరని గత ఏడాది పిటిషన్ వేస్తే హైకోర్టు సైతం స్పందించింది. ప్రభుత్వ పథకాల్లో రాజకీయ జోక్యం ఉండరాదని స్పష్టం చేసింది. ఎమ్మెల్యే సిఫార్సులకు, లబ్ధిదారుల ఎంపికకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. ఎమ్మెల్యే సిఫార్సు ఉండాలంటూ దళితబంధు అప్లికేషన్లను వరంగల్ జిల్లా కలెక్టర్ తిరస్కరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అర్హత మేరకు లబ్ధిదారుల ఎంపిక ఉండాలని ఆదేశించింది. అయినా ప్రభుత్వం తన తీరు మాత్రం మార్చుకోలేదు.
పైసలిస్తేనే పేరు ఎక్కిస్తాం
స్కీముల్లో లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యేలదే ఫైనల్ నిర్ణయంగా ఉంది. ఏదైనా పథకం కింద లబ్ధిదారుడిగా చేరాలంటే లోకల్ ఎమ్మెల్యేను పట్టుకుని బ్రతిమిలాడాల్సిందే. ఇందుకోసం ఎమ్మెల్యేకు దగ్గరగా ఉండే వాళ్ళని, ఊర్లో లీడర్ దగ్గర నుంచి మండల లీడర్ల వరకు ఫలానా స్కీములో తమ పేరు ఎక్కించాలని అడుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పెద్ద మొత్తంలో సబ్సిడీ వచ్చే స్కీమ్ అయితే ఎమ్మెల్యేలు.. చిన్నవైతే ఎమ్మెల్యే అనుచరులు, అధికార పార్టీ లీడర్లు కమీషన్లు తీసుకుంటున్నారు. లేదంటే ఎమ్మెల్యే సంతకం చేయరని, లిస్ట్ లో పేరు ఉండదని చెప్తున్నారు. ఎవరైనా అనుకున్న మొత్తానికి ఒప్పుకోకపోతే ఎమ్మెల్యే పంపే లబ్ధిదారుల లిస్ట్ లో ఆ పేరు లేకుండా చూసుకుంటున్నారు. చేసేదేమీ లేక కొందరు లబ్ధిదారులు అడిగినకాడికి ఇచ్చుకుంటున్నారు.
రూల్స్ మార్చేందుకు సర్కార్ నో
ఎమ్మెల్యేలకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యత విషయంలో గైడ్ లైన్స్ మార్చాలంటూ ఉన్నతాధికారులు ప్రపోజల్స్ పెట్టినా రాష్ట్ర సర్కార్ నో అంటోంది. పైగా ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఇంకింత పెంచుతూ వస్తోంది. దీంతో అవినీతి మరింత పెరుగుతోంది. దళితబంధు విషయంలోనూ అదే జరుగుతోంది. కల్యాణలక్ష్మిలో ఎమ్మెల్యే సంతకం అవసరం లేదని చెప్పినా అలాగే కొనసాగిస్తోంది. సాధారణంగా ఏదైనా స్కీమ్‌కు ఎమ్మార్వో లేదంటే ఎంపీడీవోకు లేదంటే కలెక్టర్ కు అప్లై చేసుకోవాలి. దానిపై ఎంక్వైరీ చేసి అర్హత ఉంటే సంబంధిత స్కీమ్ లబ్ధిదారుడికి అందేలా చూడాలి. కానీ ఇపుడు ఎమ్మెల్యే ఎంపిక చేసే వ్యక్తులకు కలెక్టర్ కూడా ఏమీ చూడకుండానే స్కీమ్ లబ్ధిని మంజూరు చేయాల్సిన పరిస్థితి
నెలకొంది.
విజిలెన్స్ తేల్చిన దందాలివే..
- కల్యాణలక్ష్మి స్కీం అప్లికేషన్ అప్రూవల్‌కు ఎమ్మెల్యే సంతకం పెట్టాల్సిందే. సిగ్నేచర్పెట్టి ఫైల్ పంపిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే చెక్కు కూడా ఎమ్మెల్యే చేతుల మీదుగానే ఇవ్వాలనే రూల్పెట్టారు. ఇదే అదునుగా లబ్ధిదారుల నుండి ఎమ్మెల్యేల అనుచరులు రూ. 10 వేల నుంచి రూ. 20 వేలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేల ప్రోగ్రాం ఖర్చులకి అని ఆ మొత్తం తీసుకుం టున్నట్లు విజిలెన్స్ రిపోర్ట్ లో వెల్లడైంది.
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు దళితబంధు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు డబ్బులు తీసుకున్నారు. ఒక్కో ఎమ్మెల్యే రూ. 2 లక్షల చొప్పున లబ్ధిదారుల నుండి వసూలు చేయించినట్లు ఇంటెలిజెన్స్ , విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఒక్కొక్కరు 30, 40 మంది దగ్గర నుండి డబ్బులు తీసుకున్నారు. ఇదే విషయం సీఎం కేసీఆర్ మొన్నటి కేబినెట్ భేటీ, పార్టీ మీటింగ్ లో చెప్పారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని కొందరు ఎమ్మెల్యేలు కూడా ఇదే దందాకు తెర తీశారు.
- ఇప్పటికే కొన్ని చోట్ల పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల్లో కొందరి నుండి ముందస్తు ఒప్పందం కింద రూ. లక్ష చొప్పున వసూలు చేశారు. మహబూబ్ నగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబధించిన దగ్గరి వ్యక్తులు పార్టీ కార్యక్రమాల కోసమని ఇలా డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అన్నీ ఎమ్మెల్యేల చేతుల్లోనే
గతంలో ఒకటి, రెండు స్కీముల్లో స్పెషల్ కోటా కింద కొందరి పేర్లను జిల్లా అధికారులకు ఎమ్మెల్యేలు సిఫార్సు చేసేవాళ్ళు. అందులోనూ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఆఫీసరే తుది నిర్ణయం తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్కీమ్ లో ఎంతమందిని చేర్చాలన్నా.. అందరి పేర్లతో సహా ఎమ్మెల్యేనే లిస్ట్ తయారు చేసి పంపాలి. అప్పుడే సర్కార్ స్కీమ్ అందుతది. దీనికోసం ఆయా స్కీమ్‌ల కోసం అర్హులైన వాళ్లంతా స్థానిక ఎమ్మెల్యేల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. కల్యాణలక్ష్మి చెక్కులు, డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితబంధు, సొంత జాగా ఉన్నోళ్లు ఇండ్లు కట్టుకునేందుకు డబ్బులు ఇచ్చే స్కీమ్, భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చే బైక్‌లు, ఆగ్రోస్ సెంటర్లు, ఇండస్ట్రీ ఇన్సెంటివ్‌లు, ఇంకా ఇతరత్రా స్కీముల్లో లబ్ధి పొందాలంటే ఎమ్మెల్యే గ్రీన్‌సిగ్నల్ ఉండాల్సిందే. చివరకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు, రేషన్ షాపుల ఏర్పాటుకు సైతం అధికార పార్టీ ఎమ్మెల్యే ఓకే అంటేనే పని అవుతోంది.