
- కుల సంఘాల ప్లాట్లను ఇతరులకు కేటాయిస్తున్నారని నిర్వాసితులు ఆవేదన
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి ఆర్అండ్ఆర్ కాలనీలో ప్లాట్లు అన్యాక్రాంతమవుతున్నాయనే ఆరోపణలున్నాయి. కుల దేవతల ఆలయాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం కుల సంఘాలకు కేటాయించిన ప్లాట్లను రెవెన్యూ అధికారులు ఇతరులకు కేటాయిస్తున్నారని అంటున్నారు.
ఇప్పటికే 20 ప్లాట్లకు పైగా అనర్హులు దక్కించుకున్నారని చెబుతున్నారు. గౌడ కులస్తులకు సంబంధించిన మూడు ప్లాట్లు, కురువలకు రెండు ప్లాట్లు, వడ్డెరలకు రెండు ప్లాట్లతో పాటు మరి కొన్ని కబ్జాకు గురయ్యాయని, వాటిలో నిర్మాణాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కాలనీలో సౌలతులు, బడి లేక ఇబ్బంది పడుతుంటే మరోవైపు ప్లాట్లను కబ్జా చేస్తున్నారనే అంటున్నారు.
కుల సంఘాల ప్లాట్లు అన్యాక్రాంతం..
నెట్టెంపాడు లిఫ్ట్‌లో ముంపునకు గురైన చిన్నోనిపల్లి గ్రామానికి ఆర్అండ్ఆర్ సెంటర్ మంజూరు చేశారు. గ్రామంలో 360 ప్లాట్లు వేసి, నిర్వాసితులందరికీ అందజేశారు. గౌడ కుల సంఘానికి మూడు, రెడ్లకు మూడు, ఉప్పరి కులస్తులకు 8, బోయ కులస్తులకు 11, కురువలకు ఆరు, వడ్డెర కులస్తులకు ఆరు ప్లాట్లను కేటాయించారు.
ఇలా కేటాయించిన 10 ప్లాట్లు ఇతరులకు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. కుల సంఘాలకు కేటాయించిన ప్లాట్లలో ఆయా కుల దేవతల ఆలయాలు, కమ్యూనిటీ హాల్స్ నిర్మించుకోవాలని గతంలో తీర్మానం చేశారు. ఆ ప్లాట్లపై కన్నేసిన కొందరు ఆఫీసర్లతో కుమ్మక్కై వాటికి పట్టాలు తీసుకొని ఇండ్లు నిర్మిస్తున్నారు.
ఓపెన్ ప్లేస్ సైతం..
ఆర్అండ్ఆర్ సెంటర్ లో ఓపెన్ ప్లేస్ లను వదలడం లేదు. స్కూల్, ప్లే గ్రౌండ్, ప్రధాన ఆలయాల కోసం వదిలిపెట్టిన ఓపెన్ ప్లేస్ ను కబ్జా చేస్తున్నారని నిర్వాసితులు చెబుతున్నారు. మట్టి తవ్వడంతో గుంతలు పడ్డాయని వాపోతున్నారు.
ఓపెన్ ప్లేస్ లో మరికొందరు గుడిసెలు వేసుకొని స్థలం మాదేనంటూ వాదనకు దిగుతున్నారని అంటున్నారు. ఇదిలాఉంటే ఆర్అండ్ఆర్ సెంటర్ లో గౌడ కులస్తులకు చెందిన ప్లాట్లను అక్రమంగా పట్టా ఇచ్చారని, గత నెల 25న కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
రిజర్వ్ ప్లాట్లను ఇచ్చాం..
కమ్యూనిటీలకు సంబంధించిన కొన్ని రిజర్వ్ ప్లాట్లను అర్హులకు ఇచ్చాం. ఓపెన్ ప్లేస్ అన్యాక్రాంత కాకుండా చర్యలు తీసుకుంటాం. డబ్బులు తీసుకొని ప్లాట్లు ఇస్తున్నట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటాం. - లక్ష్మీనారాయణ, అడిషనల్ కలెక్టర్