
- బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో 49 ను పూర్తిగా రద్దు చేయాలని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. పోడు భూముల రైతులకు మేలు జరిగేదాకాలో బీజేపీ తరపున పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. జీవో 49 వెంటనే రద్దు చేయాలని, పోడు భూముల సమస్య పరిష్కరించాలని సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్ బాబు చేపట్టిన సత్యాగ్రహ దీక్ష శుక్రవారం 5వ రోజుకు చేరింది.
బీజేపీ శాసన సభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటేపల్లి వెంకట్రామిరెడ్డి, రాకేశ్రెడ్డి వెళ్లి మద్దతు తెలిపి, హరీశ్ బాబుతో చర్చించి దీక్ష విరమింపజేశారు. అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సిర్పూర్ లో మొదలైన పోడు భూములు సమస్యను రాష్ట్రవ్యాప్తం చేసి ఉద్యమిస్తామన్నారు. ఇదిలా ఉండగా.. దీక్షకు మద్దతుగా కాగజ్ నగర్ టౌన్ బంద్ కు బీజేపీ పిలుపునివ్వగా పాక్షికంగా కొనసాగింది.
మార్కెట్ లో షాపులు బంద్ చేయిస్తుండగా బజరంగ్ దళ్ నేత శివ గౌడ్ కు బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల సమక్షంలోనే జరగ్గా ఇరువర్గాలను పక్కకు తీసుకెళ్లి సద్దుమణిగించారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.