
- లోక్‌సభ ఎన్నికల వరకేనన్న
- బెయిల్ పిటిషన్ అర్జెంట్ లిస్టింగ్‌కు నిరాకరించిన సీజేఐ
న్యూఢిల్లీ : బీజేపీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా ఈ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తున్నామని ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ చెప్పారు. కాంగ్రెస్ తో తమ పొత్తు ఈ ఎన్నికల వరకేనని, శాశ్వతం కాదని తేల్చిచెప్పారు. బుధవారం ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
‘‘ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్‌తో పర్మినెంట్ పెళ్లేమీ జరగలేదు. మోదీ నియంతృత్వ పాలనకు ఫుల్ స్టాప్ పెట్టడమే మా లక్ష్యం. ప్రజలకు మంచి పాలన అందించాలనే ఉద్దేశంతోనే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాం. జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుంది. ఢిల్లీలో ఏడు లోక్ సభ స్థానాల్లోనే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాం.
పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యర్థులుగా బరిలోకి దిగాయి. పంజాబ్‌లో బీజేపీకి ఎలాగూ మనుగడ లేదు’’ అని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ నుంచి దేశాన్ని రక్షిస్తామని తెలిపారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే విపక్షాలకు చెందిన కీలక నేతలంతా జైళ్లలోకి వెళ్లడం ఖాయమన్నారు. దర్యాప్తు ఏజెన్సీలతో మోదీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు.
కాగా, లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్‌పై బయటికొచ్చిన కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో నిరాశే ఎదురైంది. వారం రోజుల పాటు బెయిల్ పొడిగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసర విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో జూన్ 2న కేజ్రీవాల్ తిహార్ జైల్లో లొంగిపోవాల్సి ఉంటుంది.