
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర క్రీడలకు గతంలో కంటే మూడింతలు ఎక్కువగా బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏపీ జితేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో.. క్రీడాకారులకు అందించాల్సిన ప్రోత్సాహం, బడ్జెట్ కేటాయింపులపై సుదీర్ఘంగా చర్చించారు. గడిచిన పదేండ్లలో గత ప్రభుత్వం క్రీడలకు సరైన బడ్జెట్ కేటాయించలేదన్నారు. దీంతో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులను ప్రోత్సాహం దక్కలేదన్నారు.