ఉంచుతరా..! దింపుతరా! .. కొత్త ప్రభుత్వం రావడంతో అవిశ్వాసానికి మరోసారి చర్చలు

ఉంచుతరా..!  దింపుతరా! .. కొత్త ప్రభుత్వం రావడంతో అవిశ్వాసానికి మరోసారి చర్చలు
  • గ్రేటర్​లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలపై రచ్చ
  • కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో పార్టీల నేతల మధ్య మంతనాలు
  • అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో జంప్ అయిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు 
  • బీఆర్ఎస్ సర్కార్​లోనే అవిశ్వాసం పెట్టినా.. బుజ్జగించిన  నేతలు 

హైదరాబాద్, వెలుగు : సిటీ శివారులోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మరోసారి అవిశ్వాస తీర్మానాల రచ్చకు తెరలేవనుంది. అదును కోసం కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బల్దియాతో పాటు శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పార్టీలు మారారు. ఇప్పుడు కొన్నిచోట్ల తప్ప కౌన్సిల్ కోరం కూడా మారిపోయింది. దీంతో ఎప్పుడు తమ పదవి ఊడుతుందోనని మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లలో టెన్షన్ నెలకొంది. బల్దియా కౌన్సిల్ ఏర్పడి 3 ఏండ్లు అవుతుంది.  శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగి దాదాపు నాలుగేళ్లు కావొస్తోంది.

ఈ ఏడాది జనవరిలో మూడేళ్ల పదవీ కాలం పూర్తయిన 7 కార్పొరేషన్లు, 23 మున్సిపాలిటీల్లో చాలా వాటిలో  అవిశ్వాస తీర్మానాలకు గతంలోనే నోటీసులు ఇచ్చారు. పార్టీ పెద్దలు నచ్చజెప్పడంతో వెనక్కి తగ్గారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో ఆ పార్టీ వైపు చాలామంది చూస్తున్నారు. ఎన్నికలకు ముందే కొందరు కాంగ్రెస్​లో చేరిపోయారు. ఇప్పుడు కోరం పెంపు పనిలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు బిజీగా ఉన్నారు. స్థానిక నేతల మధ్య అసమ్మతి పెరిగిపోవడంతో గతేడాదే కొన్ని చోట్ల అవిశ్వాస తీర్మానాలకు నోటీసులు సైతం ఇచ్చారు. అయితే.. కనీస గడువును 3 నుంచి 4 ఏళ్లకు పెంచుతూ అప్పట్లో మున్సిపల్ చట్ట సవరణ బిల్లును గవర్నర్​కు పంపగా.. నేటికీ ఆమోదించలేదు. ఇప్పటికే బల్దియా సహ అన్నిచోట్ల అవిశ్వాస తీర్మానాలు పెట్టే చాన్స్ ఉంది. 

ఏ క్షణమైనా అవిశ్వాసం పెట్టే  చాన్స్ 

బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌‌నగర్, నిజాంపేట, బడంగ్‌‌పేట, బండ్లగూడ జాగీర్‌‌, మీర్‌‌పేట కార్పొరేషన్లతో పాటు మరో 23 మున్సిపాలిటీల్లో ఐదారు మినహా అన్నింటిని బీఆర్ఎస్​ గెలుచుకుంది. అయితే, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపొంది అధికారం చేపట్టింది. దీంతో బీఆర్ఎస్​ చేతుల్లోని రెండు, మూడు కార్పొరేషన్లతో పాటు 10కిపైగా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పెట్టే చాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే కొన్నిచోట్ల పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కలిసి మంతనాలు చేసినట్లు సమాచారం.

అధికార పార్టీలోకి వెళితే అభివృద్ధికి అడ్డంకులు ఉండవని చూపుతూ అవిశ్వాసం పెట్టేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. మేయర్, చైర్మన్ రేసులో ఉన్న వారు ప్రభుత్వం మారిన వెంటనే  గ్రౌండ్ లెవెల్​లో ఇదే పనిలో నిమగ్నమయ్యారు. మరో ఏడాది పదవీ కాలం ఉండడంతో ఎలాగైనా పదవిని సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. కొద్దిరోజుల్లోనే వరుస పెట్టి అవిశ్వాస తీర్మానాల నోటీసులు అందే అవకాశాలు బలంగానే కనిపిస్తున్నాయి.

బల్దియా పరిస్థితేంటి..?

బల్దియా పరిస్థితి కూడా అలాగే కనిపిస్తున్నది. మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉండగా..  బీఆర్ఎస్​కు 56, బీజేపీ 48, ఎంఐఎం 44, అధికార కాంగ్రెస్​కు 2 సీట్ల చొప్పున ఉన్నాయి.  అప్పట్లో కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్లతో బీఆర్ఎస్​కు బలం ఉండగా ఎంఐఎం మద్దతుతో మేయర్ సీటును దక్కించుకుంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో  కార్పొరేటర్లు పార్టీలు మారారు.  బీఆర్ఎస్​ నుంచి రెండుసార్లు కార్పొరేటర్​గా ఎన్నికైన జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్​లో చేరి శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మరో ముగ్గురు కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ ​నుంచి కాంగ్రెస్​లో చేరారు.

56 మంది బీఆర్ఎస్​ కార్పొరేటర్లలో నలుగురు కాంగ్రెస్​లోకి జంప్ అయ్యారు. బీజేపీలోంచి ఆరుగురు బీఆర్ఎస్​లోకి వచ్చారు. కాంగ్రెస్​నుంచి బీఆర్ఎస్​లోకి ఒకరు చేరారు. బీజేపీ కార్పొరేటర్ దేవర కరుణాకర్ మృతితో గుడిమల్కాపూర్ డివిజన్ ఖాళీగా ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్​ కార్పొరేటర్లు 58, ఎంఐఎం 44, బీజేపీ 40, కాంగ్రెస్​కు చెందిన వారు ఆరుగురున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడంతో మిగతా పార్టీల కార్పొరేటర్లు ఆ పార్టీ వైపు చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. శివారు ప్రాంతాల్లో బీఆర్ఎస్ ​నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీలోకి వచ్చే చాన్స్ ఉందనే చర్చ కూడా జోరుగా జరుతుంది.  తర్వాత బల్దియాలోనూ  అవిశ్వాస తీర్మానం పెట్టే చాన్స్ ఉండొచ్చు.