ఫెయిల్యూర్స్ నుంచే చాలా నేర్చుకున్నా..

ఫెయిల్యూర్స్ నుంచే చాలా నేర్చుకున్నా..

అందం, అభినయం కలగలసిన రూపం.. లావణ్య త్రిపాఠి

కూల్‌‌గా ఉండే పాత్రలు చేస్తుంది.

కానీ ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది.

వెలుగు’ పలకరిస్తే తన మనసును తెరిచింది.

కబుర్లన్నింటినీ ఇలా కుమ్మరించింది.

బాగా బిజీ అయినట్టున్నారు?

దేవుడి దయవల్ల బిజీగానే ఉన్నాను. రెండు సినిమాలు చేస్తున్నాను. సందీప్‌‌ కిషన్‌‌తో చేస్తున్న ‘ఏ1 ఎక్స్‌‌ప్రెస్’లో హాకీ ప్లేయర్‌‌‌‌గా నటిస్తున్నాను. చాలాకాలం తర్వాత ఓ మంచి పాత్ర దొరికినందుకు సంతోషంగా ఉంది. కార్తికేయతో  ‘చావు కబురు చల్లగా’ చేస్తున్నాను. ఇదీ నా మనసుకు దగ్గరైన రోల్.

హిట్‌‌ ట్రాక్‌‌ ఎక్కాలనే ప్రెషర్ పెరిగిందా?

పదిహేడు పద్దెనిమిది సినిమాల తర్వాత ఎవరికైనా ప్రెషర్​ ఉంటుంది.  కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలనుకుంటాం. నేనూ అదే చేశాను. రకరకాల పాత్రలు చేశాను. అన్నీ ట్రై చేశాను కాబట్టి నాకేది సూటవుతుందో ఇప్పుడు తెలిసింది. అందుకే కాస్త టైమ్‌‌ పట్టినా ఫర్వాలేదని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. నా పాత్రలు స్ట్రాంగ్‌‌గా ఉండేలా జాగ్రత్త పడుతున్నాను. గ్యాప్ వచ్చినా పర్లేదు కానీ నాకు నప్పని పాత్రలు చేయకూడదని డిసైడయ్యాను. అందుకే కాస్త ప్రెషర్‌‌‌‌ ఉండటం కామన్.

అంత సెలెక్టివ్‌‌గా ఉండటం అవసరమా?

అవసరమే. ఎందుకంటే పర్సనల్‌‌ లైఫ్‌‌కి ప్రొఫెషనల్‌‌ లైఫ్‌‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. జీవితాన్ని జీవిస్తాం. కానీ మేం నటనలోనూ జీవించాలి. అలా జీవించాలంటే మంచి పాత్రలు పడాలి. ఒక క్యారెక్టర్‌‌‌‌తో మనం కనెక్టయినప్పుడు అందులో ఇన్‌‌వాల్వ్ అయిపోయి నటిస్తాం.  బెస్ట్ ఇస్తాం. అందుకే పాత్రల విషయం సెలెక్టివ్‌‌గా ఉండి తీరాలి.

అసలు మీకు యాక్టింగ్‌‌ మీద ఇంటరెస్ట్ ఎప్పుడు కలిగింది?

స్కూల్లో ఉన్నప్పుడే ఆర్ట్ ఫీల్డ్‌‌కి వెళ్లాలని డిసైడయ్యాను.  ఏం చేయాలనేది అప్పటికి పూర్తిగా క్లారిటీ లేదు. కానీ శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌‌ల సినిమాలు చూసినప్పుడు మాత్రం యాక్టర్ అవ్వాలని అనిపించేది. మా నాన్న లాయర్. మా సిస్టర్ కమిషనర్. మా బ్రదర్‌‌‌‌ డైరెక్టర్. వీళ్లందరి సపోర్ట్‌‌తో ఫీల్డ్‌‌కి వచ్చాను.

వచ్చాక ఏదైనా ఇబ్బంది పడ్డారా?

లేదు. మొదట్నుంచీ కెరీర్‌‌‌‌ బాగానే సాగింది. కాకపోతే మొదట్లో ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. కామ్‌‌గా ఉండేదాన్ని. సోషల్‌‌గా ఉండటం అవసరం అని తర్వాత అర్థమయ్యింది. ఇక్కడ అందరితో కలిసి ఉండాలి. లేదంటే ఎవరేంటి అనేది తెలియదు. మనమేంటి అనేది వాళ్లకీ తెలియదు. ఆ విషయం తెలుసుకోడానికి నాకు కాస్త ఎక్కువ టైమే పట్టింది.

చాలా ఫెయిల్యూర్స్‌‌ చూశారు. ఏం నేర్చుకున్నారు?

నేను సక్సెస్‌‌ల కంటే ఫెయిల్యూర్స్‌‌ నుంచే ఎక్కువ నేర్చుకున్నాను. నిజానికి సక్సెస్‌‌ నుంచి నేర్చుకోడానికి ఏమీ ఉండదు. అదే ఫెయిలైతే.. ఎందుకు ఫెయిలయ్యామా అని తరచి చూసుకోవడం మొదలుపెడతాం. వాటిని సరిదిద్దుకోడానికి ట్రై చేస్తాం. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం.

మిగతా హీరోయిన్లంతా ఫిమేల్‌‌ ఓరియెంటెడ్ మూవీస్ ట్రై చేస్తున్నారు కదా. మీరు చేయట్లేదా?

మిగతా హీరోయిన్లు ఏం చేస్తారనేది వాళ్ల ఇష్టం. వాళ్లని చూసి నేనిలా చేయాలి అనుకోవడం కరెక్ట్​ కాదు.  ప్రతి ఒక్కరికీ వాళ్ల వాళ్ల ఇష్టాలుంటాయి. బలాలుంటాయి. కమర్షియల్ సినిమాలు చేస్తున్నందుకు నేనేమీ ఫీలవడం లేదు. అయినా ఎవరు ఎప్పుడు ఏ విషయంలో సక్సెస్ అవుతారనేది చెప్పలేం.

అలాంటి చాన్సొస్తే భారమంతా మీరు మోయగలరా?

మోయలేనని ఎందుకు అనుకుంటున్నారు! ‘అందాల రాక్షసి’లో చేసిన పాత్ర తేలికైనదేమీ కాదు. హెవీ ఎమోషన్స్ ఉన్న రోల్​. అందరూ చాలా  మెచ్చుకున్నారు. మొదటి సినిమాలోనే అలా చేయగలిగానంటే ఇప్పుడింకా బాగా చేయగలను కదా!

నటిగా మీలో మార్చుకోవాల్సింది ఏదైనా ఉందా?

నటిగా అంటే.. యాక్టింగ్ పరంగా లేదు కానీ సినిమా రిజల్ట్‌‌ని పట్టించుకోవడం తగ్గించుకోవాలని చాలాసార్లు అనుకుంటాను. కానీ నావల్ల కాదు. నిజానికి ఏ పాత్రయినా మనకి నచ్చే చేస్తాం. మన బెస్ట్ ఇస్తాం. అయినా ఒక్కోసారి కోరుకున్న సక్సెస్ రాదు. అలాంటప్పుడు మనసుకు తీసుకోకూడదు. కానీ నేను తెలియకుండానే తీసేసుకుంటూ ఉంటాను.

కానీ సక్సెస్‌‌ రేటు కూడా ఇంపార్టెంటే కదా?

సినిమా ఫెయిలవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఏ ఒక్కరి వల్లో సినిమా పోదు. అందుకే సక్సెస్‌‌ని, ఫెయిల్యూర్‌‌‌‌ని సీరియస్‌‌గా తీసుకోకూడదు. నీ వల్ల సినిమా పోయింది, నువ్వు బాగా చేయలేదు అని ఎవరైనా నన్నంటే ఫీలవ్వాలి తప్ప మిగతా విషయాలకు నొచ్చుకోకూడదు.

తమిళ ఇండస్ట్రీ మిమ్మల్ని బ్యాన్ చేసిందనే వార్తలొచ్చాయే?

విన్నవన్నీ నమ్మకూడదు అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఆ వార్త ఎలా పుట్టుకొచ్చిందో కూడా అర్థం కాలేదు నాకు. నేను తెలుగులో బాగా బిజీగా ఉన్నప్పుడు నాకు తమిళ ఆఫర్స్ వచ్చాయి. నేను నో అన్నాను. ఇప్పుడు అధర్వతో ఓ సినిమా చేస్తున్నాను. త్వరలో మరిన్ని సైన్ చేయబోతున్నాను. బ్యాన్​ చేస్తే ఇదెలా జరుగుతుంది!

ఇప్పటి సినిమాల్లో గ్లామర్, ఇంటిమేట్ సీన్స్ లాంటివి ఎక్కువయ్యాయి. అవి మీకు ఓకేనా?

ఇలాంటి వాటి గురించి ఎందుకు ప్రత్యేకంగా ఆలోచిస్తారు? ఏ సినిమాలో అయినా క్యారెక్టర్‌‌‌‌కి అవసరమైతేనే ఇలాంటివి పెడతారు. క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు ఆర్టిస్టులకు తప్పదు. ఇంటిమేట్ సీన్ ఉన్నంత మాత్రాన ఆ సినిమాని తక్కువ చేసి మాట్లాడటం, గ్లామరస్‌‌గా కనిపించినంత మాత్రాన హీరోయిన్స్‌‌ని తప్పుబట్టడం కరెక్ట్ కాదు. నేనైతే ఇప్పటి వరకు అలాంటివి చేయలేదు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆలోచిస్తాను.

ఇండస్ట్రీలో అమ్మాయిలు సేఫ్‌గా లేరంటారు.. నిజమేనా?

నేను ఫేస్​ చేయలేదు కాబట్టి ఏవీ జరగవని చెప్పను. ఇంతమంది అమ్మాయిలు వచ్చి తమకిలా జరిగిందని చెబుతున్నారంటే కచ్చితంగా నిజమే అయ్యుంటుంది. అలాంటివి ఫేస్ చేయడం నిజంగా బాధపడాల్సిన విషయమే. ఇండస్ట్రీలో ఉన్న కొందరి వల్ల అలా జరుగుతోంది తప్ప ఇండస్ట్రీ చెడ్డది కాదు. భవిష్యత్తులో అందరూ మరింత సేఫ్‌‌గా ఉండాలంటే ఓపెన్‌‌గా మాట్లాడటం అవసరమే.

ఓవరాల్‌‌గా ఇండస్ట్రీలో ఉమన్‌‌ ప్లేస్ ఎలా ఉంది?

బానే ఉంది. పేమెంట్స్ లాంటి విషయాల్లో కాస్త తేడాలున్నాయనేది నిజమే. అయినా అందులో తప్పు కూడా లేదు. ఒక హీరోయిన్‌‌ లీడ్ రోల్ చేస్తోంది. సినిమా భారమంతా తనే మోస్తోంది అంటే తనకి కూడా బాగానే పే చేస్తారు. కానీ హీరోలకి ఎక్కువ పే చేయడంలో కూడా న్యాయముంది. ఎందుకంటే వాళ్లు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కష్టమైన ఫీట్స్, ఫైట్స్ చేస్తారు. రిస్కులు తీసుకుంటారు. చాలాసార్లు గాయపడతారు కూడా. అలాంటప్పుడు వాళ్లకి  ఎక్కువ పే చేయడంలో తప్పేముంది!

ఇప్పటి వరకు సాగిన మీ కెరీర్‌‌‌‌ మీకెంత వరకు తృప్తినిచ్చింది?

ఇండస్ట్రీకొచ్చి ఎనిమిదేళ్లయ్యింది. చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా సినిమాలు చేశాను. రకరకాల రోల్స్‌‌లో కనిపించాను. అయితే ఎన్ని సినిమాలు చేసినా నా మొదటి సినిమాలోని పాత్రే నాకు ప్రత్యేకం. ఎందుకంటే తొలి ప్రయత్నంలోనే వంద మార్కులు వేయించుకున్నాను. ఏం చేసినా దానికంటే ఎక్కువే చేయాలి తప్ప తక్కువ మార్కులు పడేలా ఉండకూడదు అనే పట్టుదలని కలిగించిందా పాత్ర. మళ్లీ అలాంటి రోల్ దొరక్కపోతుందా అని వెయిట్ చేస్తున్నా. త్వరలోనే దొరుకుతుందని నా నమ్మకం. ఇప్పుడు చేస్తున్నవి కూడా మంచి సినిమాలు. స్ట్రాంగ్ రోల్స్. నా కెరీర్‌‌‌‌లో ఇది బెస్ట్ ఫేజ్ అని చెప్పొచ్చు.

యంగ్ స్టార్స్‌‌ నచ్చినవారిని పెళ్లాడేస్తున్నారు. మీ మనసులో ఎవరైనా?

ఎవ్వరూ లేరు. ప్రస్తుతం నా మనసు నా దగ్గరే ఉంది. (నవ్వుతూ) అదెప్పుడూ రైట్‌‌ ప్లేస్‌‌లోనే ఉంటుంది.

నెపోటిజంతో నష్టమేనంటారా?

ప్రశాంతంగా ఉన్న ఇండస్ట్రీలో సమస్యలు క్రియేట్ చేయడానికి కొందరు మాట్లాడే మాటలివి. నేను ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చాను. కానీ నిలబడ్డాను కదా. ఇండస్ట్రీలో సెటిలవ్వడానికి బ్యాగ్రౌండ్ కాదు, టాలెంట్ కావాలి. అయినా నెపోటిజం ఎక్కడ లేదు? పాలిటిక్స్​లో కూడా ఉంది. మరి సినీ ఇండస్ట్రీ గురించే ఎందుకు మాట్లాడతారు? తామున్న ఫీల్డ్‌‌లోకే పిల్లల్ని పంపడంలో తప్పేముంది? ఫ్యూచర్‌‌‌‌లో నాకో బిడ్డ పుడితే వాళ్లకి నేను హెల్ప్ చేస్తాను.  టాలెంట్ ఉంటే సక్సెస్ అవుతారు. బ్యాకింగ్ లేకుండా వచ్చి సక్సెస్ అయినవాళ్లు, బ్యాగ్రౌండ్ ఉండి కూడా ఫెయిలయినవాళ్లు ఉన్నారు కదా!

ఓ సెలెబ్రిటీకి అతి కష్టమైన విషయం ఏంటి?

పబ్లిక్‌‌ని డీల్ చేయడం. సెలెబ్రిటీలంటే పబ్లిక్‌‌ ఫిగర్స్ కాబట్టి పబ్లిక్‌‌ ప్రాపర్టీ అనుకుంటారు కొందరు. మా గురించి అన్నీ తెలుసనుకుంటారు. కేవలం అటెన్షన్‌‌ కోసం లావణ్య అలా చేసింది, తనని ఫలానా పార్టీలో చూశాం అంటూ ఏవేవో చెప్పేస్తుంటారు. నిజానిజాలు తెలియకుండా ఇలా మాట్లాడటం వల్ల మా  ఇమేజ్‌‌ పాడవుతుందని వాళ్లు ఆలోచించరు. తమకు తెలియకపోయినావిన్నదాన్ని, ఎవరో చెప్పినదాన్ని ప్రచారం చేసేస్తుంటారు.  మీడియా కూడా దాన్ని హైలైట్ చేసేస్తుంది. మీడియాని తప్పుబట్టడం నా ఉద్దేశం కాదు. కానీ ప్రతిచోట మంచి, చెడు ఉన్నట్టే మీడియాలోనూ బ్యాడ్​ మీడియా ఉంది. అందుకే ఒక్కోసారి ఇలాంటివి ఫేస్ చేయాల్సి వస్తోంది.

మీ గురించి ఒక్క మాటలో?

వెర్సటైల్​

మీరు యాక్టర్‌‌‌‌ కాకపోయుంటే?

ఫ్యాషన్ డిజైనర్ అయ్యేదాన్ని

మిమ్మల్ని నవ్వించేది?

ఎదుటి మనిషి నవ్వు

మిమ్మల్ని ఏడిపించేది?

ఇష్టమైన వాళ్లని పోగొట్టుకోవడం

మిమ్మల్ని ఎంటర్‌‌‌‌టైన్ చేసేది?

ఇల్లు. నాకు ఇంట్లో ఉండటమే ఇష్టం. బైటికి వెళ్లను. పార్టీలు కూడా ఇంట్లోవాళ్లతోనే చేసుకుంటాను.

మీకు చేతకానిది?

కోప్పడటం. నాకస్సలు కోపం రాదు.
అదే నా బలం.

మరి వీక్‌‌నెస్‌‌?

నా మోరల్ వేల్యూస్. మంచిదో చెడ్డదో చూడను. వద్దు అంటే వద్దనుకుంటాను.

దీపావళి పండుగ వస్తోందంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ ఫెస్టివల్‌‌తో ఓ పెద్ద మెమొరీ కూడా ముడిపడి ఉంది. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు దీపావళికి ‘గులామ్’ సినిమా విడుదలైంది. అందులో ‘ఏయ్.. క్యా బోల్‌‌తీ తూ’ అనే పాట చాలా పాపులర్. ఆ పాటలో ఆమిర్ ఒక అగ్గిపుల్లని తన నాలుక మీద పెట్టుకుని ఆర్పుతారు. నేను చాలా కష్టపడి ఆ ట్రిక్ నేర్చుకున్నాను. మా స్కూల్లో వాష్‌‌రూమ్స్‌‌లో కొందరు అల్లరి పిల్లలు క్రాకర్స్ కాల్చుతున్నారని టీచర్స్‌‌కి తెలిసింది. అందరి బ్యాగ్స్ చెక్‌‌ చేస్తున్నప్పుడు నా బ్యాగ్‌‌లో అగ్గిపెట్టె దొరికింది. దాంతో క్రాకర్స్ కాల్చింది నేనేనని టీచర్ అనుకున్నారు. ప్రిన్సిపల్ ఆఫీసు బయట ఇంటర్వెల్ వరకు నిలబెట్టారు. ఆ తర్వాత ఎందుకిలా చేశానో రీజన్ రాసి ఇమ్మన్నారు.  నాకు చాలా సిగ్గేసింది. ఎందుకంటే నాకు చిన్నప్పట్నుంచీ డిసిప్లిన్ ఎక్కువ. కూల్‌‌గా ఉండేదాన్ని. నా పని నేను చేసుకునేదాన్ని. రూల్స్ పాటించాలి, చేయకూడదన్నదేదీ చేయకూడదు అంటూ ప్రతిదీ స్ట్రిక్ట్‌‌గా ఫాలో అయ్యేదాన్ని. (నవ్వుతూ) అలాంటి నాకు ఇలా జరగడం చాలా అవమానంగా ఫీలయ్యా. దాన్ని ఇప్పటికీ మర్చిపోలేదు. ఎనీ వే.. మీ అందరికీ ముందుగానే దీపావళి శుభాకాంక్షలు. -సమీర నేలపూడి.

 

 

 

రి