కొనుగోలు సెంటర్లలో.. టార్పాలిన్లు కరువు

కొనుగోలు సెంటర్లలో.. టార్పాలిన్లు కరువు
  • కిరాయికి తెచ్చుకుంటున్న రైతులు
  • కాంటలు పెట్టక ఇబ్బందులు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో వరి కోతలు జోరందుకున్నా.. సెంటర్లలో వడ్ల కొనుగోలు మాత్రం స్లోగా ఉంది. ఇప్పటికే కొందరు రైతులు సెంటర్ల వద్ద వడ్లను కుప్పలుగా పోసి రెండు మూడు వారాలుగా పడిగాపులు కాస్తున్నారు. అయితే వడ్లపై కప్పేందుకు, కింద పరిచేందుకు సెంటర్‌‌‌‌‌‌‌‌ నిర్వాహకులు పట్టాలు, టార్పాలిన్లు అందజేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లాస్టిక్​కవర్లను బయట కిరాయికి తెచ్చుకుంటున్నారు. సకాలంలో కాంటలు కాకపోవడంతో రోజుల తరబడి కవర్లకు కిరాయి చెల్లించాల్సి వస్తోందని రైతులు వాపోయారు.

 2.98 లక్షల ఎకరాల్లో..

జిల్లాలో ఖరీఫ్‌‌‌‌లో 2.98 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 7 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేసినప్పటికీ  ఇందులో  కొనుగోలు సెంటర్లకు 6 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు  వస్తాయని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. వడ్ల కొనుగోలుకు  మొత్తం 350 సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్లాన్‌‌‌‌ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో 83 సెంటర్లు,  ఎల్లారెడ్డిలో 145,  జుక్కల్‌‌‌‌లో  78,  బాన్సువాడలో 44 సెంటర్లుగా నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకు 50 సెంటర్లు ప్రారంభించినా  కాంటాలు మాత్రం ఇంకా కంప్లీట్‌‌‌‌గా మొదలు పెట్టలేదు. ఇందుకో ప్రస్తుతం ఫ్యాడి క్లీనర్లు 192, తేమ చూసే మిషన్లు 441, కాంటాలు 394, టార్పాలిన్లు 10,350 ఉన్నాయి.

టార్పాలిన్లు, ప్యాడి క్లీనర్లే ప్రధాన సమస్య

ముఖ్యంగా కొనుగోలు సెంటర్లలో వడ్లను క్లీన్​చేయటానికి ప్యాడి క్లీనర్లు, ఆరబోసేందుకు టార్పాలిన్లు కావాలి. సెంటర్లకు అవసరమైన ఈ సామాగ్రిని మార్కెటింగ్​శాఖ సమకూర్చాల్సి ఉంది. అయితే జిల్లాలోని చాలా కొనుగోలు సెంటర్లలో సరిపడా ఏర్పాట్లు లేవు. ప్యాడీ క్లీనర్లు కేవలం 192 మాత్రమే ఉన్నాయి. సెంటర్​కు ఒకటి చొప్పున కూడా లేవు. వీటికంటే ముఖ్యంగా  టార్పాలిన్లు అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆకాలంగా వర్షాలు వస్తే సెంటర్లలో ఉన్న వడ్లు తడవకుండా  కప్పేందుకు ఇవి అవసరం.    కొన్ని సెంటర్లకు మాత్రమే డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ నుంచి సప్లయ్ చేశారు.  ఇందులో కొన్ని చినిగిపోయాయి. దీంతో రైతులే కవర్లను కిరాయికి తెచ్చుకుంటున్నారు. ఒక్కో కవర్‌‌‌‌‌‌‌‌కు రోజుకు రూ.10 నుంచి రూ.15 వరకు వసూలు చేస్తున్నారు. ఒక రైతు 10 నుంచి 50 వరకు కవర్లను కిరాయికి తెచ్చినా రోజుకు వందల్లో ఖర్చు అవుతోంది. ఇప్పటి వరకు ఒక్కో రైతుకు రూ.2,500 నుంచి రూ.5 వేల వరకు భారమవుతోంది. మరి కొన్ని రోజులు ఆగితే ఈ ఖర్చు మరింత పెరనుంది. 

 కిరాయికి తెచ్చుకున్నం

మేం నాలుగు ఎకరాల వరి పంట సాగు చేసినం. 20 రోజు కింద పంట కోసి సెంటర్‌‌‌‌‌‌‌‌కు తీసుకొచ్చినం. ఇంకా  కాంట పెట్టలేదు. వడ్లను అరబోసేందుకు, వాన పడితే కప్పేందుకు సెంటర్లలో టార్పాలిన్లు ఇవ్వలేదు. మేమే కిరాయికి తెచ్చుకున్నాం. రోజుకు రూ.300 వరకు కిరాయి అవుతోంది. - దినేశ్‌‌‌‌, గుర్జాల్

సెంటర్లలో ఏమీ లేవు

సెంటర్లలో రైతులకు ఎలాంటి సౌలతులు లేవు. టార్పాలిన్లు లేక  ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంది. ఆకాశం మబ్బులు పట్టి ఉంది. ఎక్కడ వానలు వస్తయోననే భయంతో 15 టార్పాలిన్లు కిరాయికి తెచ్చిన. పోయిన సారి రూ.3,500 కిరాయి కట్టిన. ఈ సారి ఎంత ఖర్చు 
అవుతుందో ఏమో. - గోపాల్, గాంధారి