
ఊహించని రీతిలో సుప్రీంకోర్టు పరిపాలనా విభాగం ఢిల్లీలోని క్రిష్ణమీనన్ మార్గ్‌లోని భారత ప్రధాన న్యాయమూర్తి అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రస్తుతం ఆ అధికార నివాసంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఉంటున్నారు. తనకు అనుమతించిన కాలానికి మించి ఆయన ఆ నివాసంలో నివసిస్తున్నారు. జస్టిస్ చంద్రచూడ్ 50వ ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 2022 నుంచి నవంబర్ 2024 వరకు పనిచేశారు. ఆయన పదవీ విరమణ చేసి 8 నెలలు అయ్యింది. అయినా, ఆయన అధికారిక నివాసంలోనే ఉంటున్నారు. ఆయన తరువాత వచ్చిన మాజీ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ఖన్నా తన ఆరు నెలల పదవీకాలంలో అధికారిక నివాసంలోకి మారకూడదని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి గతంలో తనకు కేటాయించిన బంగ్లాలోనే నివసిస్తున్నారు.
గత సంవత్సరం డిసెంబర్ 18న జస్టిస్ చంద్రచూడ్ అప్పటి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాకి లేఖరాసి తనని ఏప్రిల్ 30 వరకు 5వ క్రిష్ణమీనన్ మార్గ్‌లోని అధికారిక నివాసంలో నివసించడానికి అనుమతించమని అభ్యర్థిస్తూ లేఖ రాశారు. దానికి అప్పటి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా అనుమతించారు. దానికి ఆయన చెల్లించాల్సిన అద్దె రూ. 5వేలు మాత్రమే. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సమ్మతిని ఇచ్చింది. ఆ తరువాత జస్టిస్ చంద్రచూడ్ అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ఖన్నాని తిరిగి నోటిమాట ద్వారా ఆ నివాసంలో మే 31, 2025 వరకు ఉండటానికి అనుమతించాలని కోరారు. ఈ అభ్యర్థనను కూడా జస్టిస్ ఖన్నా ఆమోదించారు. ఈ తేదీని తిరిగి పొడగించలేమన్న షరతును కూడా విధించారు. ఎందుకంటే అనేకమంది కొత్త న్యాయమూర్తులు గెస్ట్‌హౌస్‌ల్లో ఉండాల్సి వస్తుందని కూడా పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి లేఖ
ఈ రెండు కాలపరిమితులను జస్టిస్ చంద్రచూడ్ ఉల్లంఘించారు. మే నెలాఖరుకు ఖాళీ చేయాలనే అవగాహన ఉందని ఆ తరువాత ఖాళీ చేయాలి. కానీ, చంద్రచూడ్ ఖాళీ చేయలేదు. అందుకే జులై 1వ తేదీన సుప్రీంకోర్టు పరిపాలనా విభాగం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ, ప్రధాన న్యాయమూర్తి అధికారిక బంగ్లాని ఆలస్యం చేయకుండా స్వాధీనం చేసుకొని సుప్రీంకోర్టుకి తెలియజేయాలని కేంద్రాన్ని అభ్యర్థించింది. ఇలాంటి లేఖ సుప్రీంకోర్టు నుంచి రావడం చాలా అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. అందులో నివసిస్తున్నది మరెవరో కాదు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చంద్రచూడ్. చాలామంది ప్రధాన న్యాయమూర్తులు పదవీ విరమణ తరువాత వారి వసతి కోసం తగిన ఏర్పాటు చేసేవరకూ రెండు నెలల వరకు అధికారిక నివాసంలో ఉండటానికి అనుమతిని ఇస్తారు. ఆ తరువాత వాళ్లు వేరే నివాసంలోకి మారిపోవాలి. న్యాయమూర్తులు తాము ఎప్పుడు పదవీ విరమణ చేస్తారో వాళ్లకి తెలుసు. అందరికీ తెలుసు. అలాంటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఈ చిన్న లాజిక్ తెలిసీ మిస్ అవుతున్నారు.
జస్టిస్ యుయు లలిత్
జస్టిస్ యుయు లలిత్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కాలం 74రోజులు. ఆయన తన నివాసంలో 40మందికిపైగా పనివాళ్లు పనిచేసిన రికార్డు కలిగి ఉన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయంలో తప్ప ఏ రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి దగ్గర ఇంతమంది సహాయ సిబ్బంది లేరు. పదవీ విరమణ తరువాత కొంతమంది సిబ్బందిని ఆయన పంపించివేశారట. కానీ, 28మంది ఫ్యూన్లు సహాయ సిబ్బంది పదవీ విరమణ తరువాత ఆయన దగ్గర పనిచేసేవారట. గతంలో ప్రధాన న్యాయమూర్తుల దగ్గర 12–15 మంది మాత్రమే అధికారిక నివాసంలో పనిచేసేవారని, పదవీ విరమణ తరువాత ఇద్దరు లేక ముగ్గురిని మాత్రమే తమ నివాసంలో పనికోసం ఉంచుకునేవారు. రోజురోజుకీ తగ్గాల్సిందిపోయి పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంది.
పదవీ విరమణ తరువాత ప్రయోజనాలు
ప్రభుత్వం ప్రకటించిన తాజా పదవీ విరమణ తరువాత ప్రయోజనాల ప్రకారం.. భారత ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన రోజు నుంచి జీవితాంతం వరకు గృహ సహాయకుడు, డ్రైవర్, సెక్రటేరియెట్ అసిస్టెంట్‌ను పొందుతారు. తాజా మార్పుల ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన తేదీ నుంచి ఐదు సంవత్సరాలపాటు ప్రతినిత్యం వ్యక్తిగత భద్రతా కవరేజీ పొందడానికి అర్హులు. అదేవిధంగా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన తేదీ నుంచి మూడు సంవత్సరాలపాటు తమ నివాసంలో ప్రతినిత్యం భద్రతా కవరేజీకి అర్హులవుతారు. అంతేకాకుండా వ్యక్తిగత భద్రతా గార్డు కూడా వాళ్లకి ఉంటారు.
ఒకవేళ భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తికి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తికి ‘బెదిరింపు’ల కారణంగా అప్పటికే ‘హయ్యర్ గ్రేడ్’ భద్రత ఉంటే అది కొనసాగుతుంది. అది కాకుండా రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తికి పదవీ విరమణ చేసిన తేదీ నుంచి ఎలాంటి కిరాయి (అద్దె) లేకుండా టైప్7 వసతిని ప్రభుత్వం ఇస్తుంది. సాధరణంగా కేంద్ర మంత్రులుగా పనిచేసిన సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులకి ఈ టైప్7 వసతిని ఇస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తికి పదవీ విరమణ చేసిన రోజు నుంచి జీవితాంతం వరకు గృహ సహాయకుడు, డ్రైవరుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అంతేకాదు విమానాశ్రయాలలో సెరిమోనియల్ లాంజ్ సౌకర్యం ఉంటుంది. హైకోర్టు మాజీ న్యాయమూర్తులకి కూడా ఈ సౌకర్యాన్ని విస్తరించారు.
ఉచితంగా టెలిఫోన్ సౌకర్యం
పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తులకి ఉచితంగా టెలిఫోన్ సౌకర్యం పొందేందుకుగాను నెలకు 4,200 రూపాయలకు మించని రెసిడెన్షియల్ లేదా మొబైల్‌ఫోన్ లేదా బ్రాడ్‌బ్యాండ్ లేదా మొబైల్ డేటా, లేదా డేటా కార్డు చార్జీలను పన్నులతో సహా పొందడానికి అర్హులు. ఈ కొత్త నియమాల ప్రకారం పదవీ విరమణ తరువాత న్యాయమూర్తులకి ఎన్నో సౌకర్యాలను ప్రభుత్వం ఇస్తుంది. అయినా అధికారిక నివాసాలను ఇంకా ఖాళీ చేయకపోవడం దేశ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది ఇలాఉండగా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడంలో తన వైపు నుంచి ఎలాంటి జాప్యం ఉండదని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ బార్, బెంచ్‌కి తెలిపారు. వచ్చే రెండు వారాల్లో తను బంగ్లాని ఖాళీ చేస్తాను అని ఆయన అన్నారు. మా ఫర్నిచర్ అంతా ప్యాక్ అయింది. రోజువారీ అవసరమైన వస్తువులు తప్ప అన్నీ సర్దుకున్నామని ఆయన అన్నారు.
ఇద్దరు కుమార్తెల అరుదైన వైద్య పరిస్థితి
తన ఇద్దరు కుమార్తెల అరుదైన వైద్య పరిస్థితి కారణంగా తన బసని పొడిగించుకున్నాను అని ఆయన అన్నారు. అది నిజమే కావొచ్చు. ఈ పరిస్థితి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఎంతోకాలంగా ఉన్నదే. దానికి తగినట్టుగా ముందుచూపుతో చర్యలు తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవడం మాజీ ప్రధాన న్యాయమూర్తి హోదాకి శోభనివ్వదు. ఈ విషయాన్ని న్యాయమూర్తులు గుర్తించాలి. పదవీ విరమణ తరువాత సంవత్సరాలుగా గృహ సహాయకులని వాడుకుంటున్న న్యాయమూర్తులూ, అదేవిధంగా హైకోర్టు వాహనాలను వాడుకుంటున్న న్యాయమూర్తులూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితిని వాళ్లు తెచ్చుకోకూడదు. ఏది ఏమైనా ఈ అరుదైన సంఘటన న్యాయవ్యవస్థనే కాదు. దేశ ప్రజలని ఒక రకమైన ఆందోళనకి గురిచేసిందని చెప్పక తప్పదు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నిబంధనల సవరణల ప్రకారం..
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఆ సవరణల ప్రకారం పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తులకి టైప్7 వసతిని అద్దె లేకుండా అందిస్తారు. జస్టిస్ ఎన్వి రమణకు ఆరునెలలపాటు 2 తుగ్లక్ రోడ్లోని వసతి గృహాన్ని కేటాయించారు. జస్టిస్ యుయు లలిత్కు షాజహాన్ రోడ్లోని ఒక బంగళాని ఆఫర్ చేశారు. కానీ, ఆ భవనం అధ్వానంగా ఉన్నందున ఆయన ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. డీవై చంద్రచూడ్ 19 అక్బర్ రోడ్డుకి మారాలని నిర్ణయించడంతో సుప్రీంకోర్టు..17, సఫ్దర్‌జంగ్ రోడ్డులో ఉన్న పూల్‌లోని బంగ్లాల్లో ఒకదాన్ని జస్టిస్ లలిత్కు కేటాయించారు.
డా. మంగారి రాజేందర్, జిల్లా జడ్జి (రిటైర్డ్)