అమర్నాథ్ యాత్రకు అడ్వాన్స్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

అమర్నాథ్ యాత్రకు అడ్వాన్స్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

అమర్‌నాథ్‌ యాత్ర కోసం ఎదురుచూస్తున్న భక్తులకు ఆలయ పుణ్యక్షేత్ర బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది.  ఏప్రిల్ 15వ తేదీ సోమవారం అమర్‌నాథ్‌ యాత్ర 2024 కోసం అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది.  అమర్‌నాథ్ యాత్ర 2024కు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా వెల్లడించింది. ఈ యాత్ర జూన్ 29న ప్రారంభమై.. ఆగస్టు 19న ముగుస్తుందని తెలిపింది. యాత్రికులు ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని చెప్పింది బోర్డు.

ఈ తీర్థయాత్రకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈక్రమంలో భక్తుల భద్రత కోసం అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసేందుకు అధికారులనే ఆదేశించింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(SDRF) సిబ్బందితోపాటు  జమ్మూ కాశ్మీర్ పోలీస్ మౌంటైన్ రెస్క్యూ టీమ్స్(MRTs).. భక్తుల భద్రత కోసం ప్రత్యేక శిక్షణ పొందుతున్నారని అధికారులు తెలిపారు.

జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుండి 41 కిలోమీటర్ల దూరంలో హిమాలయ పర్వతాల్లో  సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తులో అమర్నాథ్ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని  సందర్శించేందుకు ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. జూలై-ఆగస్టు (హిందూ క్యాలెండర్‌లో శ్రావణ మాసం)లో 'శ్రావణి మేళా' సమయంలో భక్తులు ఆలయ పవిత్ర క్షేత్రాన్ని సందర్శిస్తారు.