
డీల్‌ను ఆపాలంటూ ఇంటెరిమ్ ఆర్డర్
న్యూఢిల్లీ: ఫ్యూచర్ గ్రూప్–రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు మధ్య కుదిరిన డీల్‌ను తాత్కాలికంగా ఆపాలని సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్(ఎస్‌ఐఏసీ) మధ్యంతర తీర్పును సోమవారం ఇచ్చింది. తుది తీర్పును ఇచ్చేంత వరకు వేచి ఉండాలని ఫ్యూచర్ గ్రూప్‌ను ఆదేశించింది. కాగా, పబ్లిక్ కోర్టులలో కాకుండా ప్రైవేట్‌గా గొడవలను సెటిల్ చేసుకోవడాన్ని ఆర్బిట్రేషన్ అంటారు. ఇండియన్ కోర్టుల ఆమోదం లేకపోతే ఎస్‌ఐఏసీ ఆర్డర్ అమలులోకి రాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరు కంపెనీల మధ్య కుదిరిన కాంట్రాక్ట్‌ను ఫ్యూచర్ గ్రూప్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ అమెజాన్ ఈ పిటీషన్‌ను దాఖలు చేసింది. 2019 లో ఫ్యూచర్ కూపన్స్‌లో 49 శాతం వాటాను అమెజాన్ కొనుగోలు చేసింది. దీంతో ఫ్యూచర్ రిటైల్‌లో ఈ కంపెనీకి పరోక్షంగా 5 శాతం వాటా దక్కింది. ఈ కాంట్రాక్ట్ ప్రకారం కంపెనీ ఆమోదం లేకుండా ఫ్యూచర్ రిటైల్‌లో ప్రమోటర్ల వాటాను రిలయన్స్‌కు విక్రయించారని అమెజాన్ చెబుతోంది. ఈ ఇంటెరిమ్ ఆర్డర్‌తో పాటు ఫ్యూచర్ రిటైల్‌లో వాటా కొనుగోలుపై కంపెనీ తన ప్రపోజల్‌ను వారంలోపు సబ్మిట్ చేయాలని అమెజాన్‌ను ఎస్‌ఐఏసీ ఆదేశించింది. తుది తీర్పు అమెజాన్‌కు అనుకూలంగా వస్తే ఈ ప్రపోజల్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఎస్‌ఐఏసీ ఇచ్చిన ఈ ఇంటెరిమ్ ఆర్డర్ వ్యాలిడిటీ 90 రోజుల వరకు ఉంటుంది. ఈ ఆర్బిట్రేషన్ తుది తీర్పు ఈ టైమ్‌లోపే వస్తుంది. ‘ఈ తాత్కాలిక తీర్పును స్వాగతిస్తున్నాం. కంపెనీ కోరిన రిలీఫ్‌లను ఎస్ఐఏసీ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఆర్బిట్రేషన్ ప్రాసెస్ తొందరగా పూర్తి కావాలని కోరుకుంటున్నాం’ అని అమెజాన్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ తీర్పును కోర్టులో సవాల్ చేస్తామని ఫ్యూచర్ గ్రూప్ తెలిపింది. దేశీయ చట్టాలకు అనుగుణంగా ఫ్యూచర్ రిటైల్‌తో డీల్ కుదుర్చుకున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఈ డీల్ ప్రకారం ట్రాన్సాక్షన్లను తొందరగా పూర్తి చేయాలనుకుంటున్నామని తెలిపింది. ఫ్యూచర్ గ్రూప్–రిలయన్స్ రిటైల్ డీల్‌కు తాత్కాలికంగా బ్రేక్‌లు పడడంతో సోమవారం సెషన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 3.70 శాతం నష్టపోయి రూ.2,034.90 వద్ద క్లోజయ్యింది. ఫ్యూచర్ గ్రూప్ షేర్లు కూడా 10 శాతం పతనమయ్యాయి.
అసలు గొడవేంటి?
అమెజాన్ చెబుతున్న దానిని బట్టి ఫ్యూచర్ రిటైల్‌లోని ప్రమోటర్ల వాటాను ఫ్యూచర్ గ్రూప్ ఇతర కంపెనీలకు అమ్మకూడదు. ఫ్యూచర్స్ ప్రమోటర్ కిషోర్ బియాని వాటాలను మొదట కొనుగోలు చేసే హక్కు అమెజాన్‌కు ఉంటుంది. గతేడాది ఫ్యూచర్ కూపన్స్‌లో 49 శాతం వాటా కొనుగోలు చేశాక అమెజాన్‌కు ఫస్ట్ రెఫ్యూజల్ హక్కు దక్కింది. కానీ, ఈ ఏడాది ఆగస్ట్‌లో ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ బిజినెస్‌లను సుమారు రూ. 25 వేల కోట్లకు కొనుగోలు చేసేందుకు రిలయన్స్ రిటైల్ డీల్ కుదుర్చుకుంది.ఈ డీల్‌కు తమ నుంచి అనుమతి తీసుకోలేదని అమెజాన్ అంటోంది. ‘ఒకవేళ అమెజాన్ ఈ కేసును గెలిస్తే ఫ్యూచర్ రిటైల్‌లో ప్రమోటర్ల వాటాను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఓపెన్ ఆఫర్ ద్వారా మైనార్టీ షేర్ హోల్డర్ల నుంచి వాటాలను కొనుగోలు చేయొచ్చు’ అని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
For More News..