విస్తరణ బాట‌లో పొల్మోర్ స్టీల్‌ : యూరోపియన్ రైళ్ల ఉత్పత్తి కంపెనీలకు విడిభాగాలు సప్లయ్

విస్తరణ బాట‌లో పొల్మోర్ స్టీల్‌ : యూరోపియన్ రైళ్ల ఉత్పత్తి కంపెనీలకు విడిభాగాలు సప్లయ్
  • మెదక్ ప్లాంట్ ను సందర్శించిన పోలాండ్ రాయబారి సెబాస్టియ‌న్ డొమ్‌జ‌ల్‌స్కి 

పొల్మోర్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ (POLMOR STEEL PRIVATE LIMITED) తెలంగాణ రాష్ట్రంలో భారీ విస్తరణకు సిద్ధం అవుతుంది. మెదక్ జిల్లా కాళ్లకల్, ముప్పిరెడ్డిపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఆటోమోటివ్ పార్క్ లో ఉన్న ఈ సంస్థ.. మరింత విస్తరణ దిశగా అడుగులు వేస్తుంది. రైళ్ల కంపెనీలకు విడి భాగాలను తయారు చేసి ఇచ్చే పొల్మోర్ స్టీల్ కంపెనీ.. యూరోపియన్ రైళ్ల ఉత్పత్తి కంపెనీలకు.. తెలంగాణ నుంచి విడిభాగాలను తయారు చేసి పంపిస్తుంది. 

భారతదేశంలోని పోలాండ్ రాయబారి డాక్టర్ సెబాస్టియన్ డొమ్ జల్ స్కి 2024, ఏప్రిల్ 18వ తేదీ ప్లాంటును సందర్శించారు. ఆయనతోపాటు పోలాండ్ కాన్సులేట్ జనరల్ డాక్టర్ అలెక్సాండర్ దండా, పోలాండ్ రాయబార కార్యాలయం ఆర్థిక వ్యవహారాల కౌన్సెలర్ పావెల్ మోక్ర్ జైకి, పొల్మోర్ స్టీల్ ఎండీ కేవీఆర్ సుబ్బారావులు కూడా ఉన్నారు. పోలాండ్ అధికార బృందం.. పొల్మోర్ స్టీల్ రెండో ప్లాంట్ ను సందర్శించింది. 

భారతదేశంలో పోలాండ్ కంపెనీ సాధిస్తున్న వృద్ధిని చూసి రాయబారి డొమ్ జల్ స్కీ సంతృప్తి వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు అభినందించారు. కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా విధానానికి అనుగుణంగా సాగుతున్న ఈ కంపెనీ.. తన విజయాలను మరింతగా కొనసాగించాలని ఆకాంక్షించారు.

పొల్మోర్ స్టీల్ కంపెనీ విస్తరణ వ్యూహాలపై.. ఎండీ సుబ్బారావు మాట్లాడుతూ భారతదేశంలో పలు యూరోపియన్ కంపెనీలు ఉన్నాయని.. అదే బాటలో పొల్మోర్ స్టీల్ మరింతగా విస్తరించనుందన్నారు. మరో మూడు ఎకరాల భూమిలో 2.5 మిలియన్ యూరోల పెట్టుబడితో.. మరో 100 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ప్రకటించారాయన. అంతేకాకుండా పోలాండ్ లోని మాతృ సంస్థలో కూడా 30 మంది తెలంగాణ నుంచి వెళ్లి పని చేస్తున్నారని స్పష్టం చేశారాయన. ఈ అవకాశం వల్ల తెలంగాణ యువతకు మంచి నైపుణ్యాలు వస్తాయని.. యూరోపియన్ ప్రమాణాలతో ఉత్పత్తులు తయారు చేయటానికి వీలవుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, టీఎస్ ఐఐసీలతోపాటు వివిధ వర్గాల నుంచి అందుతున్న అపార మద్దతుపై ఎండీ సుబ్బారావు కృతజ్ణతలు చెప్పారు. అలాగే ప్లాంటుకు వచ్చిన తమను ప్రోత్సహించినందకు రాయబారికి, కాన్సులేట్ జనరల్ కు, ఆర్థిక కౌన్సెలర్ కు ధన్యవాదాలు తెలియజేశారు.