చంద్రబాబు, పవన్ భేటీపై మంత్రి అంబటి సెటైర్లు

చంద్రబాబు, పవన్ భేటీపై మంత్రి అంబటి సెటైర్లు

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. సంక్రాంతి పండుగకు అందరి ఇంటికి గంగిరెద్దులు వెళ్తాయి కానీ చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. పవన్ ,చంద్రబాబు భేటీ ఆశ్యర్యకరమైన విషయం కాదన్నారు. చంద్రబాబుకు బీ టీం జనసేన అని అన్నారు. వీరిద్దరు కలిసి వస్తారని తాము ముందే చెప్పామని తెలిపారు. వారిద్దరి చర్చ ప్రజాస్వామ్యా పరిరక్షణ కోసం కాదని.. తెలుగుదేశం పరిరక్షణ వేదిక అని విమర్శించారు. టీడీపీ, జనసేన వేర్వేరు కాదని.. వారు వేర్వేరు అయినప్పుడే వాళ్ళది  కీలక భేటీ అవుతుందని చెప్పారు. కందుకూరు ,గుంటూరు సభలో 11 మంది మృతి చెందిన ఘటన గురించి పవన్, చంద్రబాబు మాట్లాడకపోవడం దారుణమన్నారు.

మూడు నెలల్లో రెండోసారి భేటీ

ఇవాళ  హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వీరిద్దరు భేటీ కావడం గత మూడు నెలల్లో ఇది రెండోసారి. రాష్ట్రంలో పెన్షన్లు తొలగించిన అంశం, రైతులకు గిట్టుబాటు ధర, లా అండ్ ఆర్డర్ సమస్యతో పాటు పలు అంశాలపై చర్చించామని పవన్ కళ్యాణ్ అన్నారు. బ్రిటీష్ కాలం నాటి జీవోలు తీసుకొచ్చి.. ప్రజల్లోకి తమను వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో సభలు పెట్టి వైసీపీ సొల్లు కబుర్లు చెబుతోందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ సమావేశాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు కాని.. ప్రతిపక్ష పార్టీలు సభలు పెడితే మాత్రం అనుమతులు తీసుకోవాలని అని ఆయన మండిపడ్డారు.