
- అమావాస్య నుంచి భవానీ మాలధారణ
ఊట్కూర్, వెలుగు: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని బిజ్వార్ గ్రామంలోని అంబాత్రయ క్షేత్రంలో దేవీ నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఆదివారం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్పోస్టర్ను భక్తులతో కలిసి ఆదిత్య పరాశ్రీ స్వామి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గా భవానీ మాలలు ఈ నెల 21న అమావాస్య సందర్భంగా భవానీ దీక్షలు వేసుకోవచ్చని తెలిపారు. దేవీ నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. 22న గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా అంబాత్రయ క్షేత్రానికి తీసుకురావడం జరుగుతుందన్నారు.
22న అమ్మవారు శైల పుత్రి ఆలంకరణలో దర్శనమిస్తారని, శత చండీహోమం, లక్ష కమలార్చన, 23న బ్రహ్మచారిణి అలంకరణలో కనిపిస్తారని, అమ్మవారికి బిల్వార్చన నిర్వహించడం జరుగుతుందన్నారు.
24న చంద్రఘంట అలంకరణ,తులసీ అర్చన,25న కూష్మాండ అలంకరణ, కుంకుమార్చన,26న స్కందమాత అలంకరణ, కస్తూరి అర్చన,27న కాత్యాయని అలంకరణ, గంధార్చన, 28న కాళరాత్రి అలంకరణ, పసుపు అర్చన, 29న మహాకాళి అలంకరణ, పుష్పార్చన, 30న సిద్దిధాత్రీ అలంకరణ, సువర్ణార్చన నిర్వహిస్తామని చెప్పారు.
ప్రతి రోజు అమ్మవారి ఊరేగింపు ఉంటుందని, 108 అఖండ జ్యోతులు, 1,108 దేవి అష్టోత్తరాలు,2,108 దివ్య అభిషేకం, హారతులు నిర్వహిస్తారని తెలిపారు. మాలాధారణ చేసుకున్న భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పా. దేవీ నవరాత్రి బ్రహ్మోత్సవాలను సక్సెస్ చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.