భారతదేశంలో వందల ఏండ్లుగా ప్రజల్ని విభజించి పాలిస్తున్న వ్యవస్థ కులవ్యవస్థ. అది మెజారిటీ ప్రజల హక్కుల్ని కాలరాసింది. చదువుకూ తద్వారా జ్ఞానార్జనకు దూరం చేసింది. దొంగచాటుగా ఎవరన్నా చదువుకుంటే వాళ్ల నాలుకలు తెగ్గోసింది. చెట్టుచాటు నుంచి అక్షరాలు విన్న పాపానికి చెవుల్లో సీసం పోసింది. ఏదో అలా బతుకుదామంటే-పొద్దంతా కష్టపడినప్పటికీ ఎంగిలి మెతుకులు మాత్రమే తినాలని శిలాశాసనం.
అంబేద్కర్ రాజ్యాంగం రాసి కులాన్ని అదుపుచేసేదాకా ఈ దేశంలో కులవ్యవస్థ ఊహించని స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించింది. నేడు మన దేశంలో మునుపటి కంటే దారుణంగా కులం తన వికృతరూపాన్ని ప్రదర్శిస్తున్నది.
కులం పేరు మీద జరిగే అకృత్యాల పట్ల బాధితుల నుంచి తప్ప మిగిలిన సమాజం నుంచి పెద్దగా స్పందన లేకపోవడాన్ని గమనిస్తే మన సమాజం ఎంతగా ప్రమాదపుటంచుల్లోకి వెళ్లిందో అర్థమవుతుంది. కులం అనే భావన పట్ల వ్యతిరేకత లేకపోగా గతంలోకంటే భిన్నంగా ప్రజల నుంచి కులాలకు గట్టి సమర్థింపులు తోడయ్యాయి. ఇది ప్రజల మనస్తత్వంలోని తిరోగమన తత్వానికి సూచిక.
మనుషుల మధ్య హెచ్చుతగ్గులను ప్రోత్సహించే కులానికి ప్రజల మద్ధతు లభించటానికి కారణాలు వారి వ్యక్తిగత జీవితాలలోనో, నైతిక ప్రవర్తనలోనో చూస్తే అది పైపై పరిశీలన మాత్రమే అవుతుంది. ఇటీవలకాలంలో ప్రజల భావజాల రంగంలో చాలా వేగవంతమైన మార్పులు వచ్చాయి. దానికి ప్రధాన కారణం సోషల్ మీడియా.
సోషల్ మీడియా వేదికగా కుట్ర
మామూలు అక్షరజ్ఞానం కలిగిన వ్యక్తి దగ్గర నుంచి ఆయా అంశాల్లో పరిశోధనలు చేసేస్థాయిగల వ్యక్తుల దాకా అందరూ సోషల్ మీడియా బాధితులే. అబద్ధాలనే నిజాలుగా సోషల్ మీడియా భ్రమింపజేస్తోంది. ఆ భ్రమ ఎంత తీవ్రంగా ఉంటుందంటే మనం నిజాలను ఉదాహరణలతో సహా నిరూపించినా సరే నమ్మే పరిస్థితి లేదు. అదంతా కావాలని సూడో మేధావులు చేస్తున్న వక్రీకరణలు అని దబాయించటం మొదలుపెడతారు. అసలు విషయం ఏమిటంటే వక్రీకరణలు చేసేదే ఈ కులవాదులు.
ఇదంతా ధర్మం పేరుతో, దేశభక్తి పేరుతో యథేచ్ఛగా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న కుట్ర. దీని వెనుక ఎవరున్నారో, ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో ఉహించటం పెద్ద కష్టమేమీ కాదు. వాళ్ల ప్రయోజనమల్లా ఈ దేశాన్ని మళ్లీ ఆ పాతకాలంలోకి తీసుకెళ్లటం.
ప్రాచీన వ్యవస్థను పునరుద్ధరించటం. ఆ వ్యవస్థకు ప్రాణప్రదమైనది కులవ్యవస్థ. ఆ వర్గం వారు దేనినైనా భరిస్తారు కానీ మనుషులంతా సమానం అంటే అస్సలు భరించలేరు. అందుకే కులవ్యవస్థను మరింత బలంతో ముందుకు తెచ్చే కుట్రలు చేస్తున్నారు. ఈ క్రమాన్నంతా జాగ్రత్తగా ముసుగుకప్పి చేస్తున్నారు. ఆ ముసుగు పేరే సనాతన ధర్మం.
కుల నిర్మూలనకు అంబేద్కర్ కృషి
పాత వ్యవస్థ చాలా గొప్పదని నమ్మేవాళ్లకు పాపం అది ఎందుకు గొప్పదో తెలియదు. చెప్పమంటే వాళ్లకు ఎక్కడలేని కోపం వస్తుంది. మరీ ఒత్తిడి పెడితే పొంతన లేని సమాధానాలు చెప్తారు. ఏ విషయం మీద స్పష్టత లేని వీళ్లు దేశభక్తి గురించి, ప్రాచీన వ్యవస్థ గొప్పదనం గురించి చిలుక పలుకులు పలుకుతారు. ఒక్కోసారి దారుణంగా ఉంటుంది వీళ్ల ప్రవర్తన.
ఈ నేపథ్యంలోనే కులాలు ఉండాలన్న వైఖరి ఇటీవల మెజారిటీ ప్రజల్లో గూడుకట్టింది. ఈ క్రమంలోనే కులం కట్టుబాట్లను ఎవరు ధిక్కరించినా ఓర్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. కులాంతర వివాహాలను ఏమాత్రం సహించని వాతావరణం నానాటికీ పెరిగిపోతోంది.
కన్న కూతురును, కన్న కొడుకును చంపి అయినా సరే కులాన్ని నిలబెట్టాలన్న క్రూరత్వం పెరిగిపోయింది. దీనికి సామాజిక మద్దతు లభించటం విషాదాలలోకెల్ల విషాదం. అడుగడుగునా ఈ కులవ్యవస్థ పెట్టిన హింసను అనుభవించిన అంబేద్కర్ దాని నిర్మూలన కోసం శాస్త్రీయంగా పరిశోధన చేసి ఒక సిద్ధాంత పత్రాన్ని తయారు చేశాడు. అదే ‘కుల నిర్మూలన’ అనే పుస్తకం.
కులం స్వభావాన్ని వివరిస్తూ దానిని పూర్తిగా తుడిచిపెట్టడానికి ఏవిధంగా ముందుకు వెళ్లాలో మార్గనిర్దేశం చేశాడు. కానీ, భారతదేశ ప్రజలు కులపోరాటాల విషయంలో అస్త్ర సన్యాసం చేశారు. అందుకే కులం నానాటికీ బలాన్ని పుంజుకుంటూనే ఉంది. కులం పోయి మనిషి మనిషిగా బతకాలంటే ఈ దేశానికి అంబేద్కరిజమే శరణ్యం.
తోకల రాజేశం
