ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్​ కాలేజీలో పని చేస్తున్న గెస్ట్​ లెక్చరర్లను కొనసాగించాలని అంబేద్కర్​ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దెల శివకుమార్​ కోరారు. సింగరేణి హెడ్​ఆఫీస్​లో సోమవారం జీఎం పర్సనల్​ ఆనందరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పని చేస్తున్న వారిని తొలగించి, వారి స్థానంలో తమకు అనుకూలంగా ఉన్న వారిని నియమించుకొనేందుకు జీఎం ఎడ్యుకేషన్​ విభాగంలో కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ధన్​రాజ్, అల్లి శంకర్, స్టీవెన్​ లాజరస్​, సత్యనారాయణ పాల్గొన్నారు. 

క్రమబద్ధీకరణ పూర్తి చేయాలి

ఖమ్మం టౌన్, వెలుగు: అనధికార కట్టడాల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్  వీపీ గౌతమ్  సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో జీవో 59 అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ జీవో58 ద్వారా 125 చదరపు గజాల లోపు నిర్మాణాలు, జీవో 59 ద్వారా 125 చదరపు గజాల పైన ఉన్న గృహాలు, వాణిజ్య సముదాయాలు రెగ్యులరైజ్​ చేసేందుకు అవకాశం కల్పించిందని తెలిపారు. 2014 జూన్  2 కంటే ముందు కట్టుకున్న వాటికి సంబంధించిన విద్యుత్ బిల్లులు, ట్యాక్సుల చెల్లింపు రసీదులను రికార్డుగా సేకరించాలన్నారు. ప్రతిరోజు 25 కట్టడాల రికార్డుల సేకరణ లక్ష్యంగా పని చేయాలని సూచించారు. రోడ్లు, చెరువులు ఆక్రమించుకొని కట్టిన కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమబద్దీకరణ చేయవద్దని ఆదేశించారు. అధికారులకు పూర్తి అవగాహనకై శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు సీనియర్  అధికారులను నియమించామని తెలిపారు. ఈ నెల30లోగా రికార్డుల సేకరణ, ఆన్​లైన్ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అడిషనల్​ కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్  పాల్గొన్నారు. 

రూ. 1.50 లక్షల ఆర్థికసాయం

ములకలపల్లి, వెలుగు: మండలంలో అనారోగ్యంతో బాధ పడుతున్న ముగ్గురికి టీఎన్ఆర్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో రూ.1.50 లక్షల ఆర్థికసాయం అందించారు. క్యాన్సర్​తో బాధ పడుతున్న మండలంలోని రింగిరెడ్డిపల్లికి చెందిన బైటి శ్రీనివాస్ కు రూ.50 వేలు, భగత్ సింగ్ నగర్ కు చెందిన నీలం తిరుపతమ్మకు రూ.50 వేలు, మోటుగూడెం గ్రామానికి చెందిన కుంజా కృష్ణకు రూ.50 వేల చొప్పున అందజేశారు. ట్రస్ట్ చైర్మన్ తాండ్ర వెంకటేశ్వరరావు చేయూతతో ఈ ఆర్థిక సాయం చేసినట్లు ట్రస్ట్ బాధ్యులు తెలిపారు. సొసైటీ చైర్మన్  నడుపల్లి సునంద, కో ఆర్డినేటర్  నడిపల్లి నవీన్, వెంకటేశ్వరావు, నరాటి  ప్రసాద్, వైస్ చైర్మన్  పామర్తి పూర్ణ చంద్ర రావు, సర్పంచ్ బైట రాజేశ్​ పాల్గొన్నారు. 

‘వెలుగు’ కథనంపై స్పందించిన మంత్రి పువ్వాడ అజయ్

ఖమ్మం, వెలుగు: దళితబంధు కింద డెయిరీ ఫామ్​ యూనిట్ల గ్రౌండింగ్​ లంపి స్కిన్ వ్యాధి వ్యాప్తి కారణంగా ఆలస్యమవుతోందని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. సోమవారం ‘వెలుగు’ దిన పత్రికలో పబ్లిష్ అయిన ‘షాపులు, షెడ్లు రెడీ, దళిత బంధు పైసలేవీ? కథనానికి ఆయన స్పందించారు. జిల్లాలో పూర్తి స్థాయిలో గేదెల యూనిట్ల​​ గ్రౌండింగ్ కు ఇంకా 2,500 గేదెలు అవసరం ఉందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో పశువులకు వ్యాపించిన లంపి స్కిన్ అంటువ్యాధి కావడం వల్ల, ఈ సమయంలో ఆయా రాష్ట్రాల నుంచి గేదెలను తీసుకురావడం ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. వాటిని ఇక్కడికి తీసుకురావడం వల్ల స్థానికంగా ఉండే ఇతర పశువులకు కూడా వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత లబ్ధిదారులు, అధికారులు కలిసి వెళ్లి పశువులను కొనుక్కొని వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

స్కూళ్లకు సర్కారే కోడిగుడ్లు సప్లై చేయాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్లను ప్రభుత్వమే సప్లై చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కంచర్ల జమలయ్య డిమాండ్​ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్​లో ఉన్న జీతాలను చెల్లించాలని, ప్రతీ విద్యార్థికి రూ.25 మెస్​ చార్జీ చెల్లించాలని కోరారు. బోయిన విజయ్​కుమార్, పుష్ప, విజయలక్ష్మి, నాగమణి, రావులమ్మ, పద్మ పాల్గొన్నారు. 

టీఆర్ఎస్​లో చేరికలు

ఖమ్మం రూరల్/దమ్మపేట, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ నుంచి పలు కుటుంబాలు టీఆర్ఎస్​ పార్టీలో చేరాయి. మండలంలోని తీర్థాల గ్రామానికి చెందిన వార్డు మెంబర్​ తేజావత్​ సరోజతో పాటు 12 కుటుంబాలు సోమవారం టీఆర్ఎస్​ మండల అధ్యక్షుడు బెల్లం వేణు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తాతా మధు సమక్షంలో టీఆర్ఎస్​లో చేరారు. వారికి ఎమ్మెల్సీ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కొత్తగా చేరిన వారికి అండగా ఉంటామని, మండల పార్టీ నాయకత్వంలో కలిసికట్టుగా పని చేయాలని కోరారు. సర్పంచులు తేజావత్ బాలు నాయక్, సుదర్శన్,  ఉప సర్పంచ్ రవికిరణ్, ఆత్మ కమిటీ డైరెక్టర్  వీరన్న, రైతుబంధు సమితి మండల కన్వీనర్ అక్కినేపల్లి వెంకన్న, సొసైటీ డైరెక్టర్  లక్ష్మణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు రమణయ్య, మాచర్ల శ్రీను, ఉపేందర్, భుక్యా శంకర్, ధర్మసౌత్  వీరన్న పాల్గొన్నారు.

దమ్మపేటలో..

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి వలసలు వస్తున్నాయని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం మండలంలోని సీపీఐ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 250 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరగా, వారికి కండువా కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారందరికీ అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దమ్మపేట ఉప సర్పంచ్ దార యుగేందర్, మండల టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్లు రిలీజ్

పాల్వంచ, వెలుగు: పాల్వంచలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో నిర్వహించే శ్రీదేవి శరన్నవరాత్రుల  పోస్టర్లను సోమవారం రిలీజ్​ చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నివాసంలో దేవస్థానం ఈవో కె సులోచన, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు మహిపతి రామలింగం, సభ్యులు చింతా నాగరాజు, గంధం వెంగళరావు, ముత్యాల ప్రవీణ్, చిన్న వెంకట రామయ్య, బండి చిన్న వెంకటేశ్వర్లు, సందుపట్ల శ్రీనివాస్ రెడ్డి, కె లక్ష్మీనారాయణ, నాగమల్లేశ్వరరావు, ఆచార్యులు పాల్గొన్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 6 వరకు 11 రోజులపాటు జరిగే ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. 

బేడా మండపంలో రామయ్య కల్యాణం

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి సోమవారం వర్షం కారణంగా బేడా మండపంలో నిత్య కల్యాణం నిర్వహించారు. ముందుగా గర్భగుడిలో సుప్రభాత సేవను చేసి మూలవరులు, ఉత్సవమూర్తులు, లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామికి ముత్యాలు పొదిగిన వస్త్రాలను అలంకరించి ముత్తంగి సేవను చేశారు. అనంతరం కల్యాణమూర్తులను ఊరేగింపుగా బేడా మండపానికి తీసుకొచ్చి భక్తుల సమక్షంలో కల్యాణం జరిపించారు. 

పూసుగుప్పలో వెలసిన మావోయిస్టు పోస్టర్లు

చర్ల, వెలుగు: ఈ నెల 21 నుంచి 27 వరకు మావోయిస్టు పార్టీ 18వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరుతూ మండలంలోని పూసుగుప్ప గ్రామంలో మావోయిస్టు పార్టీ చర్ల శబరి ఏరియా కమిటీ పేరిట బ్యానర్లు, కరపత్రాలు వెలిశాయి. బూటకపు న్యూ ఇండియా కాదు, నూతన ప్రజాస్వామిక ఇండియాకై ఐక్య పోరాటాలు చేయాలని కోరారు. గ్రామ గ్రామాన సభలు, సమావేశాలు నిర్వహించి గెరిల్లా యుద్దాన్ని, ప్రజా యుద్దాన్ని విస్తృతం చేయాలని పేర్కొన్నారు. 

పేదలకు సంక్షేమ పథకాలు అందించాలి

కూసుమంచి,వెలుగు: పేదలకు సంక్షేమ పథకాలను అందించాలని కోరుతూ గ్రామీణ పేదల సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మండలకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్​ మీనన్​కు వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా గ్రామీణ పేదల సంఘం జిల్లా కన్వీనర్​ కల్తీ రామచంద్రయ్య మాట్లాడుతూ మూడెకరాల భూ పంపిణీ, ఇండ్ల స్థలాలు, డబుల్​ బెడ్రూమ్  ఇండ్లు, దళిత బంధు అమలు చేయాలని కోరారు. గురవయ్య, మనోజ్, సునీత, వీరలక్ష్మి పాల్గొన్నారు.