26 ఏళ్లలో చుక్కనీరు ఎత్తిపోయలే .. అలంకార ప్రాయంగా అమీరాబాద్ ఎత్తిపోతల స్కీమ్​

26 ఏళ్లలో చుక్కనీరు ఎత్తిపోయలే .. అలంకార ప్రాయంగా అమీరాబాద్ ఎత్తిపోతల స్కీమ్​

సంగారెడ్డి/న్యాల్కల్, వెలుగు: బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో నిర్మించిన అమీరాబాద్ ఎత్తిపోతల పథకం చుక్క నీరు ఎత్తిపోయలేదు. 26 ఏళ్ల కింద నిర్మించిన ఈ పథకం అలంకార ప్రాయంగా మారింది.  సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం అమీరాబాద్ వద్ద మంజీర నది తీరంలో రూ.2.18 కోట్లు ఖర్చు చేసి నిర్మించినా పథకం మాత్రం ప్రారంభం కాలేదు. ఈ ఎత్తిపోతలకు ఉపయోగించిన పరికరాలు కొన్ని తుప్పు పట్టగా, మరికొన్ని దొంగల పాలవుతున్నాయి. అమీరాబాద్ ఎత్తిపోతల కింద 494.40 హెక్టార్లకు సాగు నీరందించాలని భావించారు. కానీ పాలకుల అశ్రద్ధ, ఫండ్స్ రిలీజ్ లో జాప్యం వల్ల  లిఫ్ట్​ ప్రారంభానికి నోచుకోలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న కారణంగా అమీరాబాద్ ఎత్తిపోతల పథకాన్ని వినియోగంలోకి తీసుకురావాలని  రైతులు కోరుతున్నారు.

26 ఏళ్లుగా..

అమీరాబాద్ ఎత్తిపోతల పథకాన్ని 1993లో అప్పటి నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డి మంజూరు చేయించారు. నాబార్డ్ సహకారంతో రూ.1.30 కోట్లు ఖర్చు చేసి ఈ పథకాన్ని పూర్తి చేశారు. అంతలోనే స్థానికంగా రాజకీయ సమీకరణలు మారడంతో ఐదేళ్లపాటు దీనిని మరిచిపోయారు. 1999లో కిష్టారెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి ఎత్తిపోతలను ప్రారంభించినప్పటికీ కెనాల్స్, పంపు హౌస్ లైనింగ్ కోసం నిధులు సరిపోక పనులు నిలిచిపోయాయి. కొంతకాలానికి నాబార్డ్ నుంచి ఆర్ఐడీఎస్ ఫేస్-3లో రూ.88.80 లక్షలు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించారు. కానీ కెనాల్స్ నిర్మాణంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో లీకేజీలతో పొలాలు పాడవుతూ వచ్చాయి. మరికొంత భాగం కెనాల్స్ పూర్తి చేయకపోవడంతో పథకం వాడుకలోకి రాకుండా
 పోయింది.  

కనిపించని రైతు కమిటీలు

అమీరాబాద్ ఎత్తిపోతల పథకం నిర్వహణకు రైతు కమిటీలు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనలు ఉన్నాయి. పథకం నిర్మించినప్పటి నుంచి కమిటీ లేకపోవడంతో పథకం వాడుకలోకి రాలేదు. ఓ పక్క కెనాల్స్ లైనింగ్ సరిగ్గా లేకపోవడం, రైతు కమిటీల కొరత, స్థానిక పొలిటికల్ లీడర్ల ప్రమేయం లేకపోవడం ఇలా అనేక రకాల సమస్యల వల్ల పథకం ప్రారంభం కాలేదు. ఈ ఎత్తిపోతల పంపు హౌస్ కు ఉపయోగించిన పైపులైన్లు తుప్పు పట్టి డ్యామేజ్ అవుతుండగా, మరికొన్ని పరికరాలు చోరీకి గురవుతున్నాయి. 

అమీరాబాద్ ఎత్తిపోతల పథకం కింద ఎస్సీలకు చెందిన భూములు 49.36 హెక్టార్లు, బీసీల  భూములు 114.03, ఇతరులవి 331.01 హెక్టార్ల భూములు ఉన్నాయి. ప్రస్తుతం ఆయా వ్యవసాయ భూములు బీడువారిపోయాయి. కనీసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా స్పందించి అమీరాబాద్ ఎత్తిపోతల పథకాన్ని వాడుకలోకి తీసుకురావాలని స్థానిక రైతులు కోరుతున్నారు.

ప్రభుత్వ నిర్ణయం

అమీరాబాద్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి చాలా ఏళ్లు అయింది. అందులోని పరికరాలు, సామగ్రి పనిచేయడం లేదు. వాటి స్థానంలో కొత్తవి అమర్చితే ఎత్తిపోతల పథకాన్ని సక్సెస్ చేయొచ్చు. అందుకు ఉన్నతాధికారుల పర్మిషన్ కావాలి. వారు ఇచ్చే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తే నిర్ణయం తీసుకుంటుంది. ఆ మేరకు లిఫ్ట్ ఇరిగేషన్ కు రిపేర్ పనులు మొదలుపెట్టి పొలాలకు నీరు అందించవచ్చు.

జనార్దన్ రావు, లిఫ్ట్ ఇరిగేషన్, డీఈఈ