తెరపైకి నిజామాబాద్​ న్యూ మాస్టర్​ ప్లాన్​

తెరపైకి నిజామాబాద్​ న్యూ మాస్టర్​ ప్లాన్​

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ కార్పొరేషన్ న్యూ మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు తీసుకొని, సవరణలు పంపి 8 నెలలు అవుతోంది. అయినా ఇప్పటికీ ఫైనల్​ నోటిఫికేషన్​ రాలేదు. నెలల గడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ప్లాన్​ ఆమోదం పొందుతుందా? లేదా? అని లీడర్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వెంటనే నోటిఫికేషన్​ విడుదల చేయాలని స్థానిక లీడర్లు ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. మరోవైపు మాస్టర్​ ప్లాన్​లో ఓ వర్గానికి ప్రధాన్యం ఇస్తూ మారుస్తున్నారేమో అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

వంద ఫీట్ల రోడ్డుపైనే అంతా... 

తెలంగాణ అర్బన్ ఏరియాస్ యాక్ట్ 1975 ప్రకారం 73 గ్రామాల విలీనం చేస్తూ నోటిఫికేషన్​ ఇచ్చారు. అనంతరం నిజామాబాద్​ కార్పొరేషన్​ కొత్త మాస్టర్​ ప్లాన్​ను 2018 ఆగస్ట్​లో రిలీజ్​ చేశారు. ఈ మాస్టర్​ ప్లాన్​లో ప్రధానంగా గాయత్రి నగర్ నుంచి వర్ని రోడ్డు వరకు వంద ఫీట్ల రోడ్డు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీని వల్ల సుమారు రెండు వందల కుటుంబాలకు నష్టం కలుగుతోందని వ్యతిరేకత రావడంతో 2019 నవంబర్​లో కొత్త మాస్టర్​ ప్లాన్​ను తెచ్చారు. ఆ ప్లాన్​లోనూ వంద ఫీట్ల రోడ్డును సవరించకపోవడంతో స్థానికులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేయగా.. అధికారులు మళ్లీ 2022 ఫిబ్రవరిలో మరో ప్లాన్​ను విడుదల చేశారు. ఈ ప్లాన్​లో వంద ఫీట్ల రోడ్డులో ఆశించిన మేర మార్పులు జరగలేదు. పైగా దాని ప్రభావం విలీనమైన 73 గ్రామాల మీద పడుతోందని బాధితులు అంటున్నారు. 

వారి నుంచి 146 అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అయితే వాటిని క్షేత్రస్థాయి లో పరిశీలించలేదని లీడర్లు ఆరోపించారు. న్యూ మాస్టర్ ఫ్లాన్ రీడిజైన్ చేయాలని,  రాజకీయపార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఎనిమిది నెలలు అవుతున్నా ఇప్పటికీ ఎలాంటి నోటిఫికేషన్​ లేదు.  మాస్టర్​ ప్లాన్​లో ఏం జరుగుతుందో అని స్థానికంగా లీడర్లు, బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పట్టణాభివృద్ధికి, ప్రజలకు అనుకూలమైన ప్లాన్​ను వెంటనే విడుదల చేయాలని లీడర్లు  డిమాండ్​ చేస్తున్నారు. 

న్యూ ప్లాన్​ పక్కాగా అమలు పరచండి

న్యూ మాస్టర్ ప్లాన్​ ను ప్రజల ఆమోదం మేరకే అమలు పరచాలి. ఓట్ల కోసం ఓ వర్గం నివాసిత ప్రాంతాలను మినహాయింపు ఇచ్చారు. న్యూ మాస్టర్ ఫ్లాన్ 8 నెలలుగా అమోదం ఇవ్వలేదు. దీంతో ప్రజలు, విపక్షాలను అనుమానాలు కలుగుతున్నాయి. న్యూ మాస్టర్ ఫ్లాన్ వంద ఫీట్ల రోడ్ లో బాధితులకు న్యాయం చేయాలి. - న్యాలం రాజు మున్సిపల్​ డిప్యూటీ ఫ్లోర్ లీడర్బీ, జేపీ


ఫ్లాన్​ చట్ట ప్రకారం రెడీ చేయలే. . 

చట్టప్రకారం కాకుండా న్యూ మాస్టర్​ ఫ్లాన్​తయారు చేయాలి. ప్రజాభిప్రాయంతో అలైన్​ మెంట్ చేయాలి. ఫీల్డ్ సర్వే లేకుండా ప్లాన్​ రూపొంచారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కనుగుణంగా ఈ ప్లాన్​ ఉంది. ఇది ప్రజలకు ఏ మాత్రం ఉపయోగకరంగా లేదు. ప్రజాభిప్రాయసేకరణపై బహిరంగసభలు పెట్టలేదు . 8 నెలలైనా ప్లాన్​కు అమోదం లభించకపోవడం విచారకరం. - రామ్మోహన్ రావు బాధితుల కమిటీ కన్వీనర్