నిత్యానంద కైలాసతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్న అమెరికా నగరం

నిత్యానంద కైలాసతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్న అమెరికా నగరం

నిత్యానంద కల్పిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసకు అమెరికాలోని ఓ నగరం షాకిచ్చింది. కైలాసతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. అమెరికన్ సిటీ నెవార్క్ కైలాసతో ఒప్పందం చేసుకోగా..తాము మోసపోయామని గ్రహించిన నెవార్క్ నగరం..తమ అగ్రిమెంట్ ను వెంటనే రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడించింది.  

నిత్యానంద కైలాస దేశంతో ఒప్పందం చేసుకుని తాము మోసపోయామని నెవార్క్ సిటీ అధికార ప్రతినిధి సునాస్ గారోఫాలో తెలిపారు. జరిగిన దానికి చింతిస్తున్నామని..కైలాస పరిస్థితుల గురించి తెలుసుకుని స్పందించామన్నారు. 

ఓ వైపు కైలాసతో తాము ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు నెవార్క్ సిటీ ప్రకటించగా..కైలాస వెబ్ సైట్  మాత్రం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసను నెవార్క్ సిటీ గుర్తించిందని  చూపిస్తోంది. ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుందంటూ అందుకు సంబంధించిన పత్రాలను పోస్ట్ చేసి ప్రచారం చేసుకుంటోంది. 

2019లో అత్యాచారం, కిడ్నాప్ వంటి కేసులు ఎదుర్కొన్న నిత్యానంద స్వామి దేశం విడిచిపారిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించాడు. తాజాగా కైలాస తరపున ఐక్యరాజ్యసమితికి తన ప్రతినిధిని పంపి ఆశ్చర్యానికి గురిచేశాడు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో కైలాస తరపున ప్రసంగించిన విజయప్రియ...నిత్యానంద స్వదేశం నుంచి బహిష్కరణకు గురయ్యారని తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యలను ఐక్యరాజ్యసమితి కొట్టిపారేసింది.