డయాబెటిస్ నివారణ దిశగా అమెరికన్ సైంటిస్టులు కీలక ముందడుగు

డయాబెటిస్ నివారణ దిశగా అమెరికన్ సైంటిస్టులు కీలక ముందడుగు
  • జీర్ణాశయ స్టెమ్ సెల్స్ నే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలుగా మార్చారు
  • అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ సైంటిస్టుల ప్రయోగం సక్సెస్

వాషింగ్టన్: డయాబెటిస్ నివారణ దిశగా అమెరికన్ సైంటిస్టులు కీలక ముందడుగు వేశారు. ఎలుకలపై చేసిన ప్రయోగంలో టైప్ 1 డయాబెటిస్ ను విజయవంతంగా తగ్గించగలిగారు. జీర్ణాశయ స్టెమ్ సెల్స్ నే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలుగా మార్చి కార్నెల్ యూనివర్సిటీకి చెందిన వీల్ కార్నెల్ మెడిసిన్ కాలేజీ సైంటిస్టులు ఈ అద్భుతం సాధించారు. సాధారణంగా శరీరంలో బ్లడ్ షుగర్ (గ్లూకోజ్) లెవెల్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా క్లోమం (ప్యాంక్రియాస్) నుంచి తగినంత ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. గ్లూకోజ్ ను కణాలకు చేర్చడంలో ఇన్సులిన్ కీలకంగా వ్యవహరిస్తుంది. అయితే, కొంతమందికి క్లోమంలో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే బీటా కణాలు దెబ్బతింటాయి. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి పడిపోయి డయాబెటిస్ వస్తుంది. ఇలా ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల వచ్చే డయాబెటిస్ ను టైప్ 1 అని పిలుస్తారు. ఎలుకల్లోఈ టైప్ 1 డయాబెటిస్ పైనే రీసెర్చ్ చేసిన అమెరికన్ సైంటిస్టులు ప్రత్యామ్నాయం దిశగా ముందడుగు వేశారు.

ఎలా చేశారంటే..

జీర్ణాశయ స్టెమ్ సెల్స్ కు కూడా శరీరంలోని అనేక రకాల కణాలుగా మారే శక్తి ఉంటుంది. దీనిని అనుకూలంగా మలచుకున్న సైంటిస్టులు.. మూడు ప్రొటీన్లను ఉపయోగించి ఈ స్టెమ్ సెల్స్ ను ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే ‘గ్యాస్ట్రిక్ ఇన్సులిన్ సెక్రెటింగ్ (జీఐఎన్ఎస్)’ కణాలుగా మార్చారు. ఆ కణాలను ఎలుకల్లోకి తిరిగి ప్రవేశపెట్టారు. దీంతో కొద్దిరోజుల్లోనే ఆ కణాలు గ్లూకోజ్ లెవల్స్ ను గుర్తించి, ఇన్సులిన్ స్రవించడం ప్రారంభించాయి. ఈ కణాల పనితీరును ఆరు నెలలపాటు తాము పర్యవేక్షించామని, ఇప్పటికీ అవి బాగానే పని చేస్తున్నాయని సైంటిస్టులు వెల్లడించారు.

ప్రత్యామ్నాయం దొరికినట్లేనా?

ఎలుకల్లో టైప్ 1 డయాబెటిస్ ను తగ్గించే ప్రయోగం విజయవంతం అయినప్పటికీ, ఈ దిశగా మరింత రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. మనుషులు, ఎలుకల జీర్ణాశయ కణాల్లో కొన్ని తేడాలు ఉంటాయని, అందువల్ల భవిష్యత్తులో మరింత రీసెర్చ్ చేస్తేనే ఆ అడ్డంకులను దాటొచ్చని అంటున్నారు. అయితే, మన శరీరం సహజంగానే ఇన్సులిన్ ఉత్పత్తి చేసుకునేందుకు  ఈ విధానం ప్రత్యామ్నాయం కావచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.