
ఈ ఏడాది రతన్ టాటా మరణం తర్వాత టాటా గ్రూప్ కంపెనీలతో పాటు దాని మెజారిటీ స్టేక్ హోల్డర్ అయిన టాటా ట్రస్ట్స్ మధ్య ఏర్పడిన కొన్ని విబేధాలు చిలికి చిలికి పెద్ద సమస్యగా మారుతున్నాయి. మెుదట అంతర్గతంగా దీనిని పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. ఆ తర్వాత ప్రభుత్వం కూడా దీనికిలోకి ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం ఈ వ్యవహారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా వద్దకు చేరుకోవటంపై కార్పొరేట్ ప్రపంచంలో పెద్ద చర్చ కొనసాగుతోంది.
దేశంలో అత్యంత గౌరవాన్ని పొంతున్న టాటా గ్రూప్ లో జరుగుతున్న వివాదం గురించి పరిశీలిస్తే.. టాటా సన్స్ అలాగే దాని ప్రమోటర్ అయిన టాటా ట్రస్ట్ మధ్య బోర్డు సభ్యుల ఎంపిక విషయంలో అలాగే పరిపాలనపై విబేధాలు మెుదలయ్యాయి. ఈ క్రమంలోనే టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, టాటా ట్రస్ట్స్ వైస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ట్రస్టీ డారియస్ ఖంబాటాతో సహా టాటా గ్రూప్‌లోని పెద్దలు మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు. ఇందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఉన్నట్లు వెల్లడైంది.
దాదాపు రూ.15 లక్షల కోట్లకు పైగా విలువ కలిగిన టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యంలో ఏర్పడిన కలహాలను సరిదిద్దటం ద్వారా స్థిరత్వాన్ని తీసుకొచ్చి.. సంక్షోభాన్ని నివారించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వాస్తవానికి 2017లోనే టాటా సన్స్.. టాటా ట్రస్ట్ మధ్యనే కాకుండా, ట్రస్ట్ లోపల కూడా ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. కానీ రతన్ టాటా అప్పట్లో వాటిని తన నాయకత్వంతో అంతర్గతంగా పరిష్కరించి స్థిరత్వాన్ని తీసుకొచ్చారు. వాస్తవానికి టాటా ట్రస్ట్ సంస్థకు టాటా సన్స్ లో ఏకంగా 66 శాతం మెజారిటీ వాటాలను హోల్డ్ చేస్తూ ఆధిపత్యాన్ని కలిగి ఉంది.
ప్రస్తుతం రతన్ టాటా మరణం తర్వాత టాటా ట్రస్ట్ రెండుగా విడిపోయిందని.. ఒక వర్గం నోయెల్ టాటాకు అనుకూలంగా ఉండగా.. మరో నలుగురు మాత్రం మెహిల్ మిస్త్రీకి అనుకూలంగా వ్యవహరించటం సమస్యకు కారణంగా మారింది. మెహిల్ మిస్త్రీకి టాటా సన్స్ లో 18.37 శాతం వాటాలు ఉన్నాయి. చాలా కాలంగా వాటాలను లిక్విడేట్ చేసుకోవాలని మిస్త్రీ ఫ్యామిలీ చూస్తుండగా.. దానికి కారణం వారికి ప్రాధాన్యం తగ్గటమేనని తెలుస్తోంది. మెుత్తానికి 156 ఏళ్ల లెగసీ కలిగిన టాటా గ్రూప్ 400 కంపెనీలతో దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే దీనిలో వివాదాలను పరిష్కరించటానికి ప్రభుత్వం కూడా ముందుకొచ్చిందని నిపుణులు అంటున్నారు.