పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాం: ఫేస్‌బుక్

పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాం: ఫేస్‌బుక్

న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై రాజకీయ దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ, ఆర్‌‌ఎస్ఎస్‌కు అనుకూలంగా ఫేస్‌బుక్ వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. ద్వేష భావాన్ని ప్రచారం చేస్తోందని, ఎన్నికల సమయంలో ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఫేస్‌బుక్‌పై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఈ విమర్శలను బీజేపీ సర్కార్ తిప్పికొట్టింది. తాము పారదర్శకంగా ఉంటామంటూ ఫేస్‌బుక్ కూడా వివరణ ఇచ్చుకుంది. ఇప్పుడు మరోమారు ఈ వివాదంపై ఫేస్‌బుక్ స్పందించింది.

‘గత కొన్ని రోజులుగా మేం పక్షపాతంతో వ్యవహరిస్తూ మా పాలసీలను ముందుకు తీసుకెళ్తున్నామని విమర్శలు వస్తున్నాయి. పక్షపాతంగా ఉంటున్నామనే ఆరోపణలను మేం తీవ్రంగా తీసుకుంటున్నాం. మేం ఏ రూపంలోనూ ద్వేషాన్ని రానివ్వం. ఈ అవకాశాన్ని మా పాలసీల అమలుపై స్పష్టతను ఇవ్వడానికి ఉపయోగించుకుంటాం. ఇది మా సంస్థ ఏర్పాటును కూడా ప్రతిబింబిస్తుంది. ఓ విభిన్నమైన సంస్థగా మా ఉద్యోగులు వివిధ రాజకీయ అనుభవాలకు చెందిన వారు. మా ఎంప్లాయీస్ పలు యంత్రాంగాల్లోనూ పని చేశారు. వాళ్లకు రాజకీయ అనుభవం ఉంది. అయినపప్పటికీ ప్రజా సేవకు అంకితమవ్వడంలో వారు చాలా గర్వంగా ఉన్నారు. విభిన్న రాజకీయ సంస్థల్లో అనుభవాలు, వారి బ్యాగ్రౌండ్స్‌ను పక్కనబెట్టి వారు తమ విధులను మా పాలసీలకు అనుగుణంగా నిష్పక్షపాతంగా నిర్వర్తిస్తున్నారు’ అని ఫేస్‌బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ పేర్కొన్నారు.