దక్షిణాదిలో ఎక్కువ సీట్లు గెలుచుకుంటం మోదీ పాపులారిటీ పెరిగింది: అమిత్ షా

దక్షిణాదిలో ఎక్కువ  సీట్లు గెలుచుకుంటం మోదీ పాపులారిటీ పెరిగింది: అమిత్ షా

న్యూఢిల్లీ: ఈసారి దక్షిణాదిలో అత్యధిక సీట్లు గెలుచుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పాపులారిటీ పెరిగిందని అన్నారు. నేషనల్ మీడియా ఎన్డీటీవీకి అమిత్ షా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘‘సౌత్ లో మా పార్టీకి ఇంతకుముందెప్పుడూ రానన్ని సీట్లు ఈసారి వస్తాయని అనుకుంటున్నాను. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటకలో మొట్టమొదటిసారి మోదీ పాపులారిటీ బాగా పెరిగింది. అదంతా ఓట్లు, సీట్ల రూపంలోకి మారుతుందని ఆశిస్తున్నాను” అని తెలిపారు. 2014తో పోలిస్తే 2019లో సౌత్ లో తమ పార్టీకి ఓట్ల శాతం పెరిగిందని, ఇప్పుడు అది మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.

రాహుల్​కు కౌంటర్.. 

ఎలక్టోరల్ బాండ్లపై ప్రతిపక్షాలు చేసిన కామెంట్లకు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ఎలక్టోరల్ బాండ్లు ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ స్కీమ్ అని, మోదీ అవినీతిలో చాంపియన్ అని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ.. ‘‘ప్రతిపక్ష పార్టీలు కూడా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు తీసుకున్నాయి కదా! మరి అదంతా దోపిడీ చేసిన డబ్బేనా? అట్లయితే తాము కూడా దోపిడీ చేశామని ప్రజలకు రాహుల్ గాంధీ తప్పకుండా చెప్పాలి. ఎలక్టోరల్ బాండ్లలో ఎలాంటి అవినీతి జరగలేదు. ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయి” అని అన్నారు. 

నామినేషన్ దాఖలు.. 

గుజరాత్​లోని గాంధీనగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి అమిత్ షా నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్​తో కలిసి వెళ్లి గాంధీనగర్ కలెక్టరేట్​లో నామినేషన్ వేశారు.