ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు..రాహుల్‌‌కు లేదు: అమిత్ షా

ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు..రాహుల్‌‌కు లేదు: అమిత్ షా

జైపూర్ :  రాహుల్ గాంధీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కులేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌‌ షా అన్నారు. రాహుల్ నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో అన్యాయంగా ఎమర్జెన్సీ విధించారని ఆరోపించారు. ఆ సమయంలో లక్షలాది మందిని జైల్లో పెట్టడంతో పాటు రాజకీయ పార్టీలను నిషేధించారని తెలిపారు. సోమవారం ఆయన రాజస్థాన్‌‌లోని జోధ్‌‌పూర్‌‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడారు. ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన 'లోక్​తంత్ర బచోవా'(ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) ర్యాలీపై 
విమర్శలు చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కలిసి వచ్చినా ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ మాత్రమే ప్రధాని అవుతారని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఆయన తదుపరి పదవీకాలంలో  దేశం కచ్చితంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పేర్కొన్నారు. 

రాజస్థాన్‌‌లో అన్ని సీట్లు గెలుస్తం

రాజస్థాన్‌‌లోని మొత్తం 25 లోక్‌‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని అమిత్‌‌ షా ధీమా వ్యక్తం చేశారు. మోదీని తొలగించడమే ఇండియా కూటమి లక్ష్యమని..కానీ మోదీ నినాదం ‘దేశాభివృద్ధి’ అని వివరించారు. "స్వాతంత్ర్యం తర్వాత దేశంలో అవినీతి, కులతత్వం, బంధుప్రీతి, టెర్రరిజం వంటి నాలుగు పుండ్లను కాంగ్రెస్ సృష్టించింది. మోదీ వీటన్నింటి నుంచి దేశాన్ని విముక్తి చేశారు. అయోధ్యలోని రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు, మహిళలకు రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటివి మోదీ ప్రభుత్వ విజయాలు. దేశంలో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ఈ విషయాన్ని ఐఎంఎఫ్ నివేదిక చెబుతున్నది. మోదీకి పదేండ్ల ట్రాక్ రికార్డ్ ఉంది. 50 ఏండ్ల విజన్ ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో  ఆలోచించి ఓటు వేయండి" అని ప్రజలను అమిత్‌‌ షా కోరారు.