ఏం జరిగింది : తమిళి సైకి అమిత్ షా వార్నింగ్ ఇస్తున్నారా.. ఎందుకంత సీరియస్ గా చూశారు..?

ఏం జరిగింది : తమిళి సైకి అమిత్ షా వార్నింగ్ ఇస్తున్నారా.. ఎందుకంత సీరియస్ గా చూశారు..?

ఏపీలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారానికి హాజరైన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ మహిళా నేత తమిళి సై సౌందరరాజన్‌మధ్య జరిగిన మాటలు, హావభావాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వేదికపైకి వచ్చిన తమిళి సై.. అందర్నీ అభివాదం చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ సమయంలో అమిత్ షా దగ్గర రాగానే.. ఆయన తమిళి సైని పిలిచి.. ఏదో సీరియస్ గా చెప్పటం కనిపించింది. అంతేనా.. తమిళి సైని హెచ్చరిస్తున్నట్లు వేలు చూపిస్తూ.. అమిత్ షా గంభీరంగా మాట్లాడటం వీడియోలో స్పష్టంగా కనిపించింది. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో.. ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ.. నెటిజన్లు మాత్రం ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడేసుకుంటున్నారు.

తమిళనాడు బీజేపీలో ఇటీవల జరిగిన అంతర్గత కుమ్ములాటలపై తమిళి సైతో అమిత్ షా  చర్చించినట్లుగా తెలుస్తోంది. తమిళనాడు బీజేపీలో  చాలా మంది సంఘవిద్రోహశక్తులు ప్రవేశించారంటూ తమిళి సై చేసిన కామెంట్స్ హాట్ గా మారాయి.  అయితే అన్నామ‌లైని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించిన‌ట్లు వార్తలు వ‌చ్చాయి. బీజేపీ ప‌రాజ‌యానికి అన్నామ‌లైనే కార‌ణ‌మ‌ని త‌మిళిసై మ‌ద్దతుదారులు ఆరోపించారు. అటు తాను అధ్యక్షుడు అయ్యాకే బీజేపీ ఓటింగ్ శాతం పెరిగిందని  అన్నామ‌లై అన్నారు.  మొత్తానికి ఇరువురి మ‌ధ్య సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర ఆరోప‌ణ‌లు చోటు చేసుకుంటున్నాయి. 

ఇదే విషయంపై అమిత్ షా తమిళి సైపై ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. పార్టీపై ఎక్కడా కూడా బహిరంగంగా విమర్శలు చేయోద్దని ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్లుగా వీడియోలో కనిపిస్తుంది.  అమిత్ షా మాట్లాడుతుండగా మధ్యలో  తమిళి సై కలుగజేసుకుని ఏదో చెప్తుండగా ఆమె మాటలు అమిత్ షా వినలేదు. అమె మాటలకు అడ్డుపడి  ఇంకేం చెప్పొద్దు అన్నట్లుగా  వ్యవహరించారు అమిత్ షా.  వైరల్ గా మారిన ఈ వీడియోలో తమిళనాడు బీజేపీలో జరిగిన  అంతర్గత కుమ్ములాటలపై షా సౌందరరాజన్‌ను మందలించారని నెటిజన్లు భావిస్తున్నారు.