షాకు సాయంగా నడ్డా

షాకు సాయంగా నడ్డా

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌గా ఆ పార్టీ సీనియర్‌‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జేపీ నడ్డా ఎన్నికయ్యారు. సోమవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నడ్డాను ఏకగ్రీవంగా ఎన్నుకుందని రాజ్‌‌నాథ్‌‌ చెప్పారు. అమిత్‌‌ షాను హోం మంత్రిగా ప్రధాని నియమించడంతో పార్టీ అధ్యక్ష పగ్గాలు వేరే వారికి అప్పగించాలని షా కోరారన్నారు. త్వరలో మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఈ ఏడాది చివరి వరకు అమిత్ షానే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారని తెలుస్తోంది. నడ్డా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌గా ఎన్నికైన నడ్డాకు ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌‌ షా, కేంద్ర మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్, పార్టీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ తదితరులు అభినందనలు తెలిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌‌గా తనను ఎన్నుకున్న మోడీ, షా తదితరులకు నడ్డా థాంక్స్‌‌ చెప్పారు.

అమిత్‌‌కు హోం ఇవ్వడంతో..

2014 జులైలో అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. అప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాజ్‌‌నాథ్ కేంద్ర హోంమంత్రి కావడంతో షా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2016లోనూ రెండోసారి షా ఎంపిక ఏకగ్రీవమైంది. ఆయన నేతృత్వంలో పార్టీ బలం పెరిగింది. 10 కోట్ల మంది కార్యకర్తలతో ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. చాలా రాష్ట్రాల ఎన్నికల్లో విజయబావుటా ఎగరేసింది. 2019 లోక్‌‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ హవా కొనసాగింది. 2014 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లతో రెండోసారి అధికారం చేపట్టింది. ఈ ఎన్నికల్లోనే గుజరాత్‌‌లోని గాంధీనగర్‌‌ నుంచి షా ఎన్నికయ్యారు. మోడీ ప్రభుత్వంలో హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జాతీయ అధ్యక్షుడిగా కొత్త వ్యక్తిని నియమిస్తారని ప్రచారం జరిగింది.

బీజేపీ  వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌గా నడ్డాను  ప్రకటించడం పట్ల  ఆపార్టీ తెలంగాణ శాఖ చీఫ్‌‌ డాక్టర్‌‌ లక్ష్మణ్‌‌ హర్షం వ్యక్తం చేశారు.  అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్‌‌గా నడ్డా  పూర్తి సమయాన్ని కేటాయించి పని చేశారని గుర్తు చేశారు. నడ్డా మార్గదర్శకత్వంలో తెలంగాణలో బీజేపీ  రానున్న రోజుల్లో బలోపేతమవుతుందని, టీఆర్‌‌ఎస్‌‌ పార్టీ కి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందన్న ఆశాభావాన్ని  వ్యక్తం చేశారు.

బీహార్టు హిమాచల్

నడ్డా పూర్తి పేరు జగత్‌‌ ప్రకాశ్‌‌ నడ్డా. 1960 డిసెంబర్ 2న బీహార్‌‌లోని పట్నాలో నరైన్‌‌ లాల్‌‌ నడ్డా, కృష్ణ నడ్డా దంపతులకు జన్మించారు. పట్నాలోని సెయింట్‌‌ జేవియర్‌‌ స్కూల్‌‌లో చదివారు. తర్వాత పట్నా కాలేజీలో బీఏ చేశారు. హిమాచల్‌‌ ప్రదేశ్‌‌ యూనివర్సిటీ నుంచి ఎల్‌‌ఎల్‌‌బీ పట్టా పొందారు. 1991 డిసెంబర్‌‌లో మల్లికా నడ్డాతో పెళ్లి జరిగింది. ఆయనకు ఇద్దరు కొడుకులు.

తొలిసారి హిమాచల్‌‌ అసెంబ్లీకి

తొలిసారి 1993లో హిమాచల్‌‌ ప్రదేశ్‌‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1998లో మరోసారి గెలిచారు. 1994 నుంచి 1998 వరకు అసెంబ్లీలో లీడర్‌‌గా బాధ్యతలు చేపట్టారు. రెండోసారి గెలిచినపుడు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిగా పని చేశారు. 2007లో మరోసారి ఎన్నికయ్యారు. ప్రేమ్‌‌కుమార్‌‌ ధుమల్‌‌ కేబినెట్‌‌లో 2008 నుంచి 2010 వరకు అటవీ, పర్యావరణ, సైన్స్‌‌ అండ్‌‌ టెక్నాలజీ మంత్రిగా ఉన్నారు. 2012లో అసెంబ్లీకి పోటీ చేయలేదు. హిమాచల్‌‌ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. మోడీ తొలి సర్కార్‌లో కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.