సహారా డిపాజిటర్ల రీఫండ్​ కోసం.. సీఆర్​సీఎస్‌‌‌‌-సహారా పోర్టల్​

సహారా డిపాజిటర్ల రీఫండ్​ కోసం.. సీఆర్​సీఎస్‌‌‌‌-సహారా పోర్టల్​

న్యూఢిల్లీ: సహారా గ్రూప్​లోని నాలుగు కో–ఆపరేటివ్​ సొసైటీలలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు వారి డబ్బు తిరిగి చెల్లించడం కోసం సీఆర్​సీఎస్​–సహారా పేరుతో ఒక పోర్టల్​ను మంగళవారం కేంద్ర కో–ఆపరేషన్​ మంత్రి అమిత్​ షా లాంఛ్​ చేశారు. 45 రోజులలోపు ఇన్వెస్టర్ల డబ్బును వాపస్​ చేయాలని భావిస్తున్నారు. సహారా గ్రూప్​ పెట్టుబడుల విషయంలో చాలా ప్రభుత్వ ఏజన్సీలు పనిచేస్తున్నాయని, ఆయా ఏజన్సీలు చాలా ఆస్తులను సీజ్​ చేశాయని చెబుతూ, ఇలాంటి పోర్టల్​ తేవడం చరిత్రలో నిలిచిపోతుందని అమిత్​ షా చెప్పారు. 

డిపాజిటర్ల డబ్బును రాకుండా ఇప్పుడు ఎవరూ ఆపలేరని, పోర్టల్​లో రిజిస్టర్​ చేసుకున్న 45 రోజులలోపు వారు తమ డబ్బు వెనక్కి పొందవచ్చని పేర్కొన్నారు. నాలుగు సహారా గ్రూప్​ కో–ఆపరేటివ్​ సొసైటీలలో డిపాజిట్లు చేసిన 10 కోట్ల మంది డిపాజిటర్లకు 9 నెలలలోపు వారి సొమ్ము తిరిగి వచ్చేలా చేస్తామని ఈ ఏడాది మార్చి 29 నాడు ప్రభుత్వం ప్రకటించింది. సహారా–సెబీ రీఫండ్​ అకౌంట్​ నుంచి రూ. 5 వేల కోట్లను సెంట్రల్​ రిజిస్ట్రార్​ ఆఫ్​ కో–ఆపరేటివ్స్​కు బదిలీ చేయమని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత ప్రభుత్వం పై విధంగా ప్రకటించింది. తొలి దశలో ప్రతి ఇన్వెస్టర్​కు రూ. 10 వేల రీఫండ్​ లభిస్తుందని, ఎక్కువ మొత్తం పెట్టిన వారికి ఆ తర్వాత మరి కొంత చెల్లింపు జరుగుతందని షా వివరించారు. ఈ మొదటి దశలో 1.7 కోట్ల మందికి రీఫండ్​ చేయడానికి పై రూ. 5 వేల కోట్ల మొత్తం సరిపోతుందని పేర్కొన్నారు. ​నాలుగు సహారా గ్రూప్​ కో–ఆపరేటివ్స్​లోనూ కలిపి 2.5 కోట్ల మంది రూ. 30 వేల కోట్లను డిపాజిట్​ చేశారు. 

సహారా క్రెడిట్​ కో–ఆపరేటివ్​ సొసైటీ, సహారాయాన్​ యూనివర్సల్​ మల్టిపర్పస్​ సొసైటీ, హమారా ఇండియా క్రెడిట్​ కో–ఆపరేటివ్​ సొసైటీ, స్టార్స్​ మల్టిపర్పస్​ కో–ఆపరేటివ్​ సొసైటీలు ఈ జాబితాలో ఉన్నాయి. రూ. 5,000 కోట్లను డిపాజిటర్లకు రీఫండ్​ చేసిన తర్వాత మరొకసారి సుప్రీం కోర్టును మరింత మొత్తం విడుదల చేయాల్సిందిగా కోరనున్నట్లు అమిత్​ షా వెల్లడించారు. ఐఎఫ్​సీఐ సబ్సిడరీ కంపెనీ ఈ పోర్టల్​ను డెవలప్​ చేసింది. డబ్బు తిరిగి కోరుకునే డిపాజిటర్లు రెండు పనులు చేయాల్సి ఉంటుందని, మొబైల్​తో ఆధార్​ రిజిస్ట్రేషన్​ చేసుకోవడం మొదటిదని, బ్యాంకు అకౌంట్​తో ఆధార్​ నెంబరును లింక్​ చేసుకోవడం రెండవదని షా చెప్పారు. ఆ బ్యాంకు అకౌంట్లో రీఫండ్​ జమ అవుతుందని వెల్లడించారు.