జగదీప్ ధన్‎కడ్ రాజీనామాపై నోరువిప్పిన అమిత్ షా.. అసలేం జరిగిందంటే..?

జగదీప్ ధన్‎కడ్ రాజీనామాపై నోరువిప్పిన అమిత్ షా.. అసలేం జరిగిందంటే..?

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‎కడ్ ఆకస్మికంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఉన్నఫళంగా జగదీప్ ధన్‎కడ్ ఉప రాష్ట్రపతి పదవి నుంచి తప్పుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ధన్‎కడ్ రాజీనామాపై కేంద్ర హోంశాఖ అమిత్ షా స్పందించారు. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల కారణంగానే జగదీప్ ధన్‎కడ్ ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారని స్పష్టం చేశారు అమిత్ షా. 

ప్రజలు దీని గురించి ఎక్కువగా చర్చించాల్సిన అవసరం లేదని, ఈ విషయం చుట్టూ అనవసరమైన ఊహాగానాలు సృష్టించవద్దని కోరారు. పూర్తి అంకితభావం, రాజ్యాంగానికి అనుగుణంగా ధన్‎కడ్ జీ తన బాధ్యతలను నిర్వర్తించారని అన్నారు. రాజీనామా అనంతరం జగదీప్ ధన్‎కడ్ ను గృహ నిర్భంధంలో ఉంచారన్న ప్రతిపక్షాల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు అమిత్ షా. ప్రతిపక్షలు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. ప్రతిపక్షల ఆరోపణలే కరెక్ట్ అని అనుకోవద్దని సూచించారు.

Also Read : రష్యా యుద్ధాన్ని ఆపేలా ఒత్తిడి తెచ్చేందుకే ఇండియాపై సుంకాలు

ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 2025 జులై 21న అనారోగ్యకారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 2022  ఆగస్టు 11న భారత ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ధన్‎ఖడ్.. పదవి కాలం ఇంకా రెండేళ్లు ఉండగానే రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఫైర్ బ్రాండ్‎గా పేరున్న ధన్‎కడ్ ఆల్ ఆఫ్ సడెన్‎గా పదవికి రాజీనామా చేయడం పలు సందేహాలను లేవనెత్తింది. ప్రతిపక్షాలు కూడా ధన్‎కడ్ ఆకస్మిక రాజీనామాపై అనుమానం వ్యక్తం చేశాయి. ఉన్నట్టుండి ధన్‎కడ్ పదవికి రాజీనామా చేయడానికి కారణం ఏంటో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. 

ఈ తరుణంలో జగదీప్ ధన్‎ఖడ్ రాజీనామాపై అమిత్ షా క్లారిటీ ఇవ్వడంతో విపక్షాల అనుమానాలకు చెక్ పడింది. జగదీప్ ధన్‎ఖడ్ రాజీనామాతో ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీఏ, ఇండియా కూటమి అభ్యర్థులను బరిలోకి దించాయి. ఎన్డీఏ తరుఫున సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు. 2025, సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.