ఎలక్టోరల్​ బాండ్స్​పై..సుప్రీం తీర్పును గౌరవిస్తున్నాం : అమిత్​ షా

ఎలక్టోరల్​ బాండ్స్​పై..సుప్రీం తీర్పును గౌరవిస్తున్నాం : అమిత్​ షా
  •     మెరుగుపర్చే అవకాశమిస్తే బాగుండేదన్న అమిత్​ షా
  •     బాండ్స్​పై ఏడుపెందుకు.. లెక్కలు చూడాలని ప్రతిపక్షాలకు సూచన

న్యూ ఢిల్లీ : ఎలక్టోరల్​ బాండ్స్​పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్​షా వెల్లడించారు. రాజకీయాల్లో నల్లధనాన్ని అరికట్టేందుకే ఎలక్టోరల్​ బాండ్స్​ పథకాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు. శనివారం ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేయకుండా.. మెరుగుపర్చేందుకు కోర్టు అవకాశమిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు అమిత్​ షా గట్టిగా బదులిచ్చారు. పథకంపై ఏడుపెందుకని.. కావాలంటే ఏయే పార్టీకి ఎంత విలువైన బాండ్స్​ వచ్చాయో  లెక్కలు చూసుకోవాలని అన్నారు.

 ‘ఎలక్టోరల్​ బాండ్స్​ ద్వారా మొత్తం రూ.20 వేల కోట్ల నిధులు వచ్చాయి. ఇందులో బీజేపీకి వచ్చింది కేవలం 6 వేల కోట్లు. మరి మిగతా బాండ్స్​ ఎవరికెళ్లాయి? రూ.1,600 కోట్లు టీఎంసీకి, 1,400 కోట్లు కాంగ్రెస్​కు, రూ.1,200 కోట్లు బీఆర్​ఎస్​కు, రూ.750 కోట్లు బీజేడీకి, రూ.639 కోట్లు డీఎంకేకు వెళ్లాయి’ అని వెల్లడించారు. 303 మంది ఎంపీలున్న బీజేపీకి రూ.6 వేల కోట్ల ఫండ్స్​ వస్తే.. 242 మంది ఎంపీలున్న ప్రతిపక్షాలకు రూ.14 వేల కోట్లు వచ్చాయని వివరించారు. ఈ లెక్కలు తేలితే ప్రతిపక్షాలు ప్రజలకు ముఖం కూడా చూపించలేవని ఎద్దేవా చేశారు. ‘ప్రతిపక్షాలు నిధులను నగదు రూపంలో తీసుకోవాలని అనుకున్నాయి. రూ. 1,100 వస్తే రూ.100 పార్టీకి జమచేసి, మిగతా ది నేతలు జేబులో వేసుకుంటారు. ఏండ్లుగా జరుగుతున్నది ఇదే’ అని కాంగ్రెస్​ పార్టీకి చురకలంటించారు. 

వన్​ నేషన్​–వన్​ ఎలక్షన్​తో ఖర్చులకు చెక్​

జమిలి ఎన్నికల విధానంపై అమిత్​ షా మాట్లాడుతూ.. ‘దేశంలో పలుమార్లు వివిధ ఎన్నికలు నిర్వహించడంవల్ల భారీగా ఖర్చవుతోంది. కోడ్​ అమలుతో అభివృద్ధి పనులకు ఆటంకం. వీటికి వన్​ నేషన్​–వన్​ ఎలక్షన్​ అనేది సరైన పరిష్కారం. ఒకసారి ఇది అమల్లోకి వస్తే అభివృద్ధి వేగం పుంజుకోవడంతోపాటు ఖర్చులు భారీగా తగ్గుతాయి’ అని వ్యాఖ్యానించారు. ఈ లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు, ఎన్డీఏ కూటమి 400 కుపైగా సీట్లు గెలుచుకుంటాయని అమిత్​షా ధీమా వ్యక్తంచేశారు.